రుణాల మాఫీపై మాట తప్పిన చంద్రబాబు

హైదరాబాద్:

రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తూ సీఎం అయిన వెంటనే తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు మాట తప్పారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిప్పులు చెరిగింది. అధికార పీఠాన్ని దక్కించుకోవడం కోసం ఆయన ప్రజలకు అబద్ధాలు చెప్పారని పార్టీ సంస్థాగత వ్యవహారాల రాష్ట్ర కో ఆర్డినేటర్ ‌పి.ఎన్.వి. ప్రసాద్ విమర్శించారు. రైతుల రుణాలను మాఫీ చేస్తానని చెప్పిన ‌చంద్రబాబు.. ఆ పని చేయకుండా విధివిధానాలు అంటూ కమిటీ వేయడంలోని ఔచిత్యం ఏమిటని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. రుణాలు మాఫీ అయి ఖరీఫ్ సీజ‌న్‌లో కొత్తగా పంట రుణాల కోసం రైతులు ఎదురుచూస్తుంటే  చంద్రబాబు ఇలాంటి కుంటిసాకులు చెప్పడమేంటని ప్రసాద్ ధ్వజమెత్తారు.

రుణ మాఫీ ఫైలుపై తొలి సంతకం‌ చేయడం అంటే కమిటీ నియామకంపై సంతకమా? అని ప్రసాద్ ప్రశ్నించారు. ఇది రైతులను నిలువునా మోసం చేయడమే‌ అని ఆయన దుయ్యబట్టారు. ప్రమాణస్వీకారం చేసిన తొలి రోజునే, తొలి సంతకంతోనే చంద్రబాబు నిజస్వరూపం బట్టబయలైందన్నారు. ఇలాంటి మోసకారి చర్యలకు పాల్పడిన చంద్రబాబును ప్రజలు నమ్మబోరని ప్రసాద్ అన్నారు. అధికారంలో ఉన్నపుడు ఒకమాట, లేనపుడు ఇంకొక మాట మాట్లాడే చంద్రబాబు తన నైజాన్ని మ‌రోసారి చాటుకున్నారన్నారు.

ఎన్నికల ప్రచారంలో బంగారం తాకట్టుతో సహా అన్ని రకాల రుణాలనూ రద్దు చేస్తానని వాగ్దానం చేసిన చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చేసిన తన ప్రసంగంలో ఆ ఊసే ఎత్తలేదని పి.ఎన్.వి. ప్రసాద్ తప్పుపట్టారు.

Back to Top