చంద్రబాబుకు పాలించే అర్హత లేదు

విశాఖపట్నం(అచ్యుతాపురం): చంద్రబాబు ప్రభుత్వం బ్రాండిక్స్ యాజమాన్యంతో కుమ్మక్కయి కార్మికులను వేధిస్తోందని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. కనీస వేతనాలు పెంచకపోతే కార్మికులు ఎలా బతుకుతారని జననేత ప్రశ్నించారు. కేవలం నెలకు నాలుగు వేల జీతమిస్తూ, అది కూడా ఐదేళ్లకోసారి 20 శాతమే పెంచడం దారుణమన్నారు. నెలరోజుల్లోగా యాజమాన్యం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అవసరమైతే తానే స్వయంగా కార్మికులతో పాటే నిరాహార దీక్షలో కూర్చుంటానని హెచ్చరించారు. అచ్యుతాపూరంలో బ్రాండిక్స్ కార్మికుల ఆందోళనకు వైఎస్ జగన్ మద్దతుగా నిలిచారు. 

బ్రాండిక్స్ కార్మికులతో వైఎస్ జగన్ ముఖాముఖి మాట్లాడారు. ఈసందర్భంగా మహిళలు జననేతతో తమ కష్టాలు పంచుకున్నారు. 
సకాలంలో పూర్తిచేయలేని టార్గెట్లు పెట్టి తమను వేధిస్తున్నారని, పని  చేస్తున్నప్పుడు కనీసం బాత్రూమ్‌కు వెళ్లినా టార్చర్‌కు గురిచేస్తున్నారని, రెండు నిమిషాలు బాత్రూమ్‌లో ఉన్నా తలుపుకొట్టి మరీ పిలుస్తున్నారని బ్రాండిక్స్ కంపెనీ గార్మెంట్ ఫ్యాక్టరీ మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. 

మహాలక్ష్మి (ఆపరేటర్‌, బ్రాండిక్స్ కంపెనీ)
నాలుగు సంవత్సరాలుగా బ్రాండిక్స్ కంపెనీలో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాను. యాజమాన్యం మమల్ని అనేక రకాలుగా వేధిస్తోంది. టార్గెట్ పేరుతో మా హెచ్‌ఆర్ వాళ్లే మమ్మల్ని ఎక్కువగా టార్చర్ పెడుతున్నారు. కంపెనీలో పనిచేసే వాతావరణం సరిగ్గా లేదు. పూర్తిచేయలేని టార్గెట్లు ఇచ్చి.. కనీసం బాత్రూమ్‌ వెళ్లివచ్చినా వేధింపులకు గురిచేస్తున్నారు. ఆరోగ్య సమస్యలున్నా టార్గెట్లు పూర్తి చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. చేతికొచ్చేది నాలుగువేల జీతమే. కానీ, ఎనిమిది వేలు ఇస్తున్నట్టు చెప్పమంటున్నారు. జీతాలు పెంచాలని మేం డిమాండ్ చేస్తున్నాం. కనీసం మాకు పదివేల జీతం ఇవ్వాలి. మా అన్నజగన్‌ మాకు న్యాయం చేసేందుకు ముందుకొచ్చారు.

- బాలా, కార్మికురాలు( బ్రాండిక్స్ కంపెనీ)
గత నెలలో మేం ధర్నా చేసినప్పుడు సమస్యలు పరిష్కారిస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు బ్రాండిక్స్‌ యాజమాన్యం సమస్యలను పరిష్కరించలేదు. మేం గతంలో ధర్నా చేసినప్పుడు మహిళా సంఘాలు కానీ, కార్మిక సంఘాలు కానీ మద్దతు తెలిపేందుకు ముందుకు రాలేదు. సీఐటీయూ కూడా సంఘీభావం తెలుపలేదు. మనం ఐక్యంగా ఉండి పోరాడాలి. న్యాయం చేసేందుకు జగన్‌ అన్న ముందుకొచ్చారు. జగన్‌ అన్న మన తరఫున అల్లూరి సీతారామరాజులా పోరాడటానికి ఇక్కడి వచ్చారు.

- విజయదుర్గ (ఆడిటర్‌-బ్రాండిక్స్ కంపెనీ)
పదో తరగతి పరీక్షల సమయంలో మా పాప అనారోగ్యంగా ఉండటంతో తనను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాను. అందువల్ల పొద్దున షిఫ్ట్‌కు రాలేనని, మధ్యాహ్నం షిఫ్ట్‌కు వస్తానని చెప్పాను. అంతే, నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు. మెడికల్ రిపోర్ట్స్ తీసుకున్నా పట్టించుకోలేదు.  మళ్లీ ఉద్యోగంలోకి తీసుకున్నప్పటికీ ఐడెంటీకార్డు నంబర్ మార్చేశారు. ప్రస్తుతం నేను కాల్విటీ విభాగంలో ఆడిటర్‌గా పనిచేస్తున్నారు. ఐదువేల జీతం వస్తున్నది. వారం రోజులు రాకపోయినా, సెలవు పెట్టినా ఐడెంటీ కార్డు మారిపోతున్నది. దీంతో ఉన్న సీనియారిటీ పోతోంది. సీనియారిటీ లేకపోవడంతో జీతాలు పెంచడం లేదు.

దుర్గమ్మ( కార్మికురాలు- బ్రాండిక్స్ కంపెనీ)                                                                                                                                                                          
భారీగా దుస్తులు కుట్టాలని పెద్ద పెద్ద టార్గెట్లు ఇస్తారు. ఆ టార్గెట్లు పూర్తిచేయకుండా లంచ్ బ్రేక్‌కు కూడా వెళ్లనివ్వరు. గంటకు వంద పీసులుకుట్టాలని టార్గెట్ పెడతారు. టార్గెట్లు పూర్తిచేయకుంటే రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోమ్మని బెదిరిస్తున్నారు. టార్గెట్ పూర్తిచేయకుంటే అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. తిడుతున్నారు. వేధింపులు గురిచేస్తున్నారు. మా సమస్యలు పరిష్కరించాలి. మా జీతాన్ని పెంచాలి .

చంద్రబాబు కార్మికులను పట్టించుకోకపోవడం అన్యాయమని వైఎస్ జగన్ ఫైరయ్యారు.  జీతాలు పెంచమని ధర్నా చేస్తే మహిళలని కూడా చూడకుండా లాఠీలతో కొట్టించి పోలీస్ స్టేషన్ లో పెట్టడం  దుర్మార్గమని మండిపడ్డారు. చంద్రబాబు జిల్లాలో ఉండగానే కార్మికులను కొట్టించారని, ఇంతకంటే దారుణం మరొకటి ఉండదన్నారు.  ధర్నా చేస్తుంటే  500 మందిని తీసుకెళ్లి ఎస్.రాయవరం స్టేషన్‌లో పొద్దున్నుంచి రాత్రిదాకా పెట్టారు.
ఆడవాళ్లు, పిల్లల మీద  ప్రతాపం చూపిస్తున్నారు. చంద్రబాబుకు ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే అర్హత లేదన్నారు. ఈవిషయంపై కేంద్రానికి, రాష్ట్రానికి లేఖలు రాయడంతో పాటు ధర్నాలు చేస్తామన్నారు. కార్మికులందరికీ  కనీస వేతనం నెలకు రూ. 10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  కార్మికులకు  వైఎస్ఆర్‌సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. 
Back to Top