చంద్రబాబు అబద్దపు పత్రాలు

అల్లీపురం: చంద్రబాబు నాయుడు ఇసుక విధానంపై విడుదల చేసిన శ్వేతపత్రం అబద్ధాల పత్రంగా ఉందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి విమర్శించారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రవేశపెట్టిన ఇసుక విధానం వల్ల మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కోట్లకు పడగలెత్తారే కానీ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు, గోదావరి జిల్లాల్లో మరో మంత్రి యనమల రామకృష్ణడు లారీ ఇసుకకు 10 వేల రూపాయలు చొప్పున దండుకుంటున్నారన్నారు. ఇక కర్నూలు జిల్లాలో కేఈ కృష్ణమూర్తి, కృష్ణాజిల్లాలో దేవినేని ఉమ వందల కోట్లు దోచుకుంటున్నట్టు తెలిపారు.  ఉత్తరాంధ్రలో టీడీపీకి చెందిన  10 మంది శాసనసభ్యులు విచ్చలవిడిగా ఇసుకమాఫియా చేస్తున్నారన్నారు. చంద్రబాబు చెవిన పడినా ఏమీ తెలియనట్లు నటిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ఇసుక విధానం వల్ల సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకుండా పోయిందని ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. 

బాక్సైట్ తవ్వకాలపై గిరిజనుల ఆందోళనతో వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల ఒత్తిడి మేరకు మళ్లీ అనుమతులిచ్చేందుకు ప్రయత్నిస్తోందని ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. బాక్సైట్ తవ్వకాలపై గిరిజనులకు అండగా పోరాడతామని, అలా కాకుండా ప్రభుత్వం ముందుకు వెళ్లితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.

Back to Top