సింగపూర్ తో మ్యాచ్‌ ఫిక్సింగ్‌

()చేసేది ప్లాట్ల వ్యాపారం..దానికి ఇంకో మేనేజ్‌మెంట్‌ కంపెనీనా?
()సింగపూర్‌ను ముందు పెట్టి దోచుకునేందుకు బాబు కుట్ర
()అసలు రాష్ట్రంలో పరిపాలన ఉందా?... లేదా?
()పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

హైదరాబాద్‌: రాజధాని నిర్మాణం పేరుతో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం సింగపూర్‌ కంపెనీతో చేసుకున్న స్విస్‌ చాలెంజ్‌ విధానం వెనుక పెద్ద మ్యాచ్‌ ఫిక్సింగ్‌ దాగి ఉందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. స్విస్‌చాలెంజ్‌ విధానంలో పారదర్శకత లేదని, అందుకే కోర్టు కూడా దీన్ని వ్యతిరేకించిందని ఆయన తెలిపారు. ఈ విధానం వెనుక నుంచి ముందుకు వచ్చినట్లుగా ఉందని బుగ్గన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నవ్యాంధ్ర రాజధాని ఏర్పాటు పలానా చోట అని చంద్రబాబు ప్రభుత్వం సెప్టెంబర్‌ 2014లో ప్రకటన చేసిందన్నారు. అదే ఏడాది డిసెంబర్‌లో సింగపూర్‌కు చెందిన ఎంవోయూలు ఎంటర్‌ అయ్యాయని తెలిపారు. మనకు ఫ్రీగా రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ ఇస్తున్నట్లుగా సీఎం గొప్పలు చెప్పారని, ఆ తరువాత సింగపూర్‌కు రూ.14 కోట్లు ఫీజు చెల్లించారని బుగ్గన చెప్పారు. ఆ వెంటనే సింగపూర్‌ దేశానికి చెందిన పలు కంపెనీలు ఫిబ్రవరి 22, 2015న మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారన్నారు. ఏప్రిల్‌ 30న అసెండాస్‌ కంపెనీ తాము రాజధాని నిర్మిస్తామని ముందుకు వచ్చినట్లు వివరించారు. మే 4, 2016లో స్విస్‌ చాలెంజ్‌ పద్ధతిలో రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం సింగపూర్‌ కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకుందన్నారు. మార్చి 21న అదే కంపెనీలు 4100 ఎకరాల్లో కాదని, కేవలం 1690 ఎకరాల్లో నిర్మాణం చేపడుతామని చెప్పారన్నారు.  జూలై 20న సింగపూర్‌ మాస్టర్‌ ప్లాన్‌కు ఏపీ కేబినెట్‌ అనుమతి తెలిపిందని చెప్పారు.

చేసేది ప్లాట్ల వ్యాపారం
అమరావతిలో సింగపూర్‌ కంపెనీలు, చంద్రబాబు ప్లాట్ల వ్యాపారం చేస్తున్నాయని ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. 1690 ఎకరాల్లో నిర్మించే ప్లాట్లకు ముందుగానే సింగపూర్‌కు 50 ఎకరాలు కట్టబెట్టాలని నిర్ణయం తీసుకోవడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. ఇందు కోసం ఆంధ్ర ప్రదేశ్‌ రూ.1400 కోట్లు పెట్టుబడి పెడితే, సింగపూర్‌ కేవలం రూ.350 కోట్లు పెట్టుబడి పెడుతుందన్నారు. ఇందుకు గాను సింగపూర్‌ కంపెనీలకు 58 శాతం, ఏపీకి మాత్రం 42 శాతం వాటాలు కుదర్చుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అక్కడ చేసేది ప్లాట్ల వ్యాపారమైతే, దానికి ఇంకో మేనేజ్‌మెంట్‌ కంపెనీ అవసరమని చెప్పడం దారుణమన్నారు. సింగపూర్‌ కంపెనీలను చంద్రబాబు ఇంటి అల్లుడి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారని బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీ వాళ్లకు భద్రత కల్పిస్తారు కానీ, ఏపీ ప్రభుత్వం మెజార్టీ ఉన్న కంపెనీలకు 25 సంవత్సరాల పాటు భద్రత కల్పించేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారని నిప్పులు చెరిగారు. సింగపూర్‌ కంపెనీలు నిర్మించే 1690 ఎకరాల్లో ఊర్లు, ఇల్లు, మందిరాలు, చర్చీలు, చివరకు శ్మాశానాలు ఉండకూడదని నిబంధనలు పెట్టడం దుర్మార్గమన్నారు. 

తిరుపతిలో మరో హుండి
రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ప్రభుత్వం తిరుపతిలో మరో హుండి ఏర్పాటు చేయడం ఎంత వరకు సమంజసమని బుగ్గన ప్రశ్నించారు.  రాష్ట్రంలో పరిపాలన ఉందా? లేదా అని అనుమానం వ్యక్తం చేశారు. అరకొరగా రైన్‌ గన్లు పంపిణీ చేసిన చంద్రబాబు మూడు రోజుల్లో కరువును పారద్రోలానని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. 
 
Back to Top