వైఎస్ కు పేరొస్తుందనే ప్రాజెక్టులపై నిర్లక్ష్యం

హైదరాబాద్, డిసెంబరు 24: శాసన సభ శీతాకాల సమావేశాల్లో ముఖ్యమంత్రి హుందాగా వ్యవహరించలేదని వైఎస్సార్సీపీ శాసన సభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ విమర్శించారు. ప్రతిపక్ష నేత శ్రీవైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో హుందాగా వ్యవహరించి ప్రజా సమస్యలను సభలో ప్రస్తావిస్తే అధికారపక్షం ఎదురుదాడికి దిగి ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకుందన్నారు. జ్యోతుల నెహ్రూ బుధవారం పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కొత్త రాజధాని నిర్మాణానికి తమ పార్టీ వ్యతిరేకం అంటూ టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్నిఖండించారు. రాజధాని నిర్మాణానికి తామెంత మాత్రం వ్యతిరేకం కాదని, ప్రభుత్వం అనుసరిస్తున్నవిధానాలనే వ్యతిరేకిస్తున్నామని అన్నారు.

రాయలసీమకు మంచి నీరు ఇవ్వాలంటే తాము అడ్డుపడుతున్నట్లుగా ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందన్నారు. గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులపై టీడీపీ ప్రభుత్వం ఎందుకు శ్రద్ధవహించడం లేదని ప్రశ్నించారు. పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించడం అంటూ జరిగితే మన వేలితో మన కంటినే పొడుచుకోవడమేనని అభిప్రాయపడ్డారు. దివంగత వైఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే ఆయనకు ఎక్కడ మంచి పేరువస్తుందోనన్నభయంతో సీఎం వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

Back to Top