చంద్రబాబుకు పాలించే హక్కు లేదు

హైదరాబాద్: రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని హమీ ఇచ్చి మాట తప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ర్టాన్ని పాలించే హక్కు ఎంత మాత్రం లేదని,ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్ సీపీ శాసనసభాపక్షం ఉపనేత జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... తొలుత చెప్పిన విధంగా రూ.87 వేల కోట్ల వ్యవసాయరుణాలతో పాటు ,డ్వాక్రాలోని ప్రతి మహిళ రుణం పూర్తిగా మాఫీ చేసిననాడే ఆయనకు పదవిలో కొనసాగే ఆర్హత ఉంటుందన్నారు.వ్యవసాయరుణాలన్నీ మాఫీ చేస్తానని తొలుత చెప్పిన చంద్రబాబు క్రమంగా వాటిని కుదించుకుంటూ వచ్చారని దుయ్యబట్టారు. రూ.87 వేల కోట్ల రుణాలను అంచెలంచెలుగా తగ్గించుకుంటూ వచ్చి చివరకు రూ.15 వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తామని ప్రకటించారని విమర్శించారు.

అప్పటికీ ఆంక్షలు పెడతున్న తీరు చూస్తూంటే అవైనా పూర్తిగా రద్దవుతాయా లేదా అనేది అనుమానంగా ఉందన్నారు. 50 వేల రూపాయల లోపు రుణాలను ఒక్కసారిగా మాఫీ చేస్తానని చెప్పి ఇపుడు మెలికలు పెడుతున్నారని దుయ్యబట్టారు. రుణమాఫీకి సంబంధించి జారీ చేసిన పత్రాల్లో ఒక రైతుకు రూ.3.15లు మాత్రమే మాఫీ అయితే మరో రైతుకు కేవలం రూ.95 వేలు మాత్రమే రద్దయ్యాయని చెప్పారు. ఇంకొక రైతు రూ.60 వేలు రుణం తీసుకుంటే అందులో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రూ.13 వేలు రద్దుకు మాత్రమే అర్హత ఉందని తేలుస్తూ, అది కూడా ఐదు విడతలుగా మాఫీ చేస్తామనడం విచిత్రమని వ్యాఖ్యానించారు.

అప్పులు కట్టలేని పరిస్ధితుల్లో రైతులు ఉన్నారని గుర్తించే రుణమాఫీ హమీ ఇచ్చానంటున్న చంద్రబాబు..రైతుల వద్ద డబ్బుంటే రుణం తీూర్చుకోండి.ఆ మొత్తాన్ని ఐదు విడతల్లో చెల్లిస్తామని చెప్పడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. ఆధికారంలోకి వస్తే స్వామినాధన్ కమిటీ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తికి అయిన ఖర్చుకు 55 శాతం అదనంగా మద్దతు ధర కల్పిస్తామని మేనిఫెస్టోలో రాసుకున్నప్పటికీ అమలు చేయడం లేదని విమర్శించారు.

రాష్ర్ట ఆర్ధిక పరిస్ధితి బాగోలేదని పేద అరుపురు అరుస్తున్న చంద్రబాబు..రాష్ర్ట విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హమీల ప్రకారం టీడీపీ మిత్ర పక్షంగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వం నుంచి నిధులు ఎందుకు రాబట్టలేక పోతున్నారని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వల్ల రైతులకు లభిస్తున్న ఉచిత విద్యుత్ కు ఇప్పుడు చార్జీలు చెల్లించాల్సిందిగా నోటిసులు పంపడంపై దారుణమని విమర్శించారు.

Back to Top