నోట్ల రద్దు బాబుకు ముందే తెలుసు

* ముందస్తు సమాచారంతోనే బాబు హెరిటేజ్‌ను ఫ్యూచర్‌ గ్రూపుకు విక్రయించాడు
* చంద్రబాబు, మంత్రులు బ్యాంకులకు ఎందుకు 
వెళ్లడం లేదు
* ప్రధాని నరేంద్ర మోడీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు
* గంటన్నర పాటు బ్యాంకు క్యూలో నిల్చుని నగదు డ్రా చేసిన ఎమ్మెల్యే ఆర్కే

మంగళగిరి: పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధాని నరేంద్రమోడీ నియంతలా వ్యవహరిస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల  రామకృష్ణారెడ్డి(ఆర్కే)ధ్వజమెత్తారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్‌ వద్ద ఉన్న స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో సోమవారం నగదు మార్చుకునేందుకు వెళ్లిన ఆయన అక్కడ క్యూలైన్‌లో వేచివున్న వృద్ధులు, ఇతర ఖాతాదారల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గంటన్నరపాటు ఖాతాదారులతో వేచివుండి నగదు మార్చుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆర్‌బీఐ చట్ట ప్రకారం నోట్ల రద్దు చెల్లదన్నారు. అవినీతిని రూపుమాపేందుకు చేపట్టిన నోట్ల రద్దును స్వాగతిస్తున్నామని, కానీ అందుకు  అవలంభించిన విధానం వలన పేదలు సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఆర్‌బిఐ సెంట్రల్‌ బోర్డును సంప్రదించి వుంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదన్నారు. వంద రోజులలో నలడబ్బు తీసుకువస్తానని చెప్పిన మోడీ రెండున్నర సంవత్సారాలయినా ఇప్పటివరకు ఎందుకు తేలేకపోయారని ప్రశ్నించారు. విదేశాలు తిరగడం మాని నోట్ల రద్దుతో సామాన్యులు పడుతున్న కష్టాలకు ఉపశమనం కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దేశంలో ఆరులక్షల ముప్పై వేల బ్యాంకులుండగా గ్రామీణ ప్రాంతాలలో కేవలం యాభై వేల బ్యాంకులు మాత్రమే ఉన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంత ప్రజలకు నగదు పూర్తి స్థాయిలో అందించేందుకు ఎన్ని సంవత్సారాలు పడుతుందని ప్రశ్నించారు. అదే విధంగా బంగారం విషయంలో ఆంక్షలపై మహిళలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు నోట్ల రద్దు ముందే తెలిసిన కారణంగానే వెయ్యి, 500 నోట్లు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని విమర్శించారు. నోట్ల రద్దుకు మూడు రోజుల ముందు తన హెరిటేజ్‌ కంపెనీని ఫ్యూచర్‌ గ్రూపుకు విక్రయించి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారని ఆరోపించారు. నెల రోజులవుతున్నా ముఖ్యమంత్రి కానీ తన మంత్రి వర్గ సహచరులు కానీ బ్యాంకుల ముందు నిలబడి సామాన్యులు కష్టాలు ఎందుకు తీర్చట్లేదన్నారు . ఇప్పటికైనా గ్రామీణ ప్రాంత ప్రజల నోట్ల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని నోట్ల కష్టాల నుంచి సామాన్యులను పేదలకు గట్టెక్కించాలని లేదంటే ప్రజలే తిరగబడి ప్రభుత్వాలకు బుద్ది చెబుతారని హెచ్చరించారు.
Back to Top