అవినీతిని పెంచిపోషిస్తున్న చంద్రబాబు

తెలుగుదేశం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందదంటున్న బీజేపీ
కేంద్ర నిధులన్నీ బాబు జేబులోకే
ఇసుక దోపిడీపై విచారణ జరిపించాలి
జన్మభూమి కమిటీలను రద్దు చేయాలి
అందరికీ సమానంగా నిధులు కేటాయించాలిః పార్థసారథి

విజయవాడః వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు అవినీతిని పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. ఉచితం మాటున ఇసుకను లూటీ చేస్తూ... కొన్ని వందల కోట్ల రూపాయలను బాబు టీడీపీ నాయకులకు దోచిపెడుతున్నారని విమర్శించారు. టీడీపీ ఫండ్ కోసమా లేక వచ్చే ఎన్నికల ఖర్చుల కోసమా బాబు మీ దోపిడీ అంటూ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రతి కేబినెట్ మీటింగ్ లో  ఇసుకపైనే చర్చించడంలో ఆంతర్యమేంటి బాబు అని ప్రశ్నించారు. 

బాబు కుంభకోణాల గురించి రాష్ట్రంలోని పత్రికలన్నీ చెబుతున్నాయని, బాబు అవినీతి బీజేపీకి కూడా అర్థమైపోయినట్లుందని పార్థసారథి పేర్కొన్నారు.రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని,  తెలుగుదేశం వల్ల కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందదని మిత్రపక్షానికి చెందిన బీజేపీ నేతలే చెబుతున్నారన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులన్నీ బాబు జేబుల్లోకి వెళుతున్నాయని కమలనాథులే అంటున్నారని చెప్పారు. టీడీపీతో జతకట్టి రాజకీయాలు చేయమని కేంద్రమంత్రి దత్తాత్రయ స్వయంగా చెప్పాడన్నారు. తెలంగాణ మాదిరి ఏపీలోనూ బాబుకు కమలనాథులు కటీఫ్ ఇచ్చే పనిలో ఉన్నారన్నారు.

ఇసుక ద్వారా వందల, వేల కోట్లు దోచుకుంటున్నారని వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తే, దానికి సమాధానం చెప్పకుండా..ప్రతిపక్ష నాయకుని దూషిస్తున్నారని ఫైరయ్యారు . ఇసుక పాలసీ మీద నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రతి కేబినెట్ లో ఇసుకపై ఎందుకు చర్చిస్తున్నారని నిలదీశారు.  టీడీపీ నాయకులు ఇసుకలో వేల కోట్లు దోచుకున్నారని అన్ని పత్రికల్లోనూ వచ్చిందని, తాము కూడా లెక్కలతో సహా నిరూపించామన్నారు. ఐతే, ఇసుకలో జరిగిన అవినీతిని బయటపెట్టడం గానీ, అవినీతి సొమ్మును లాగేందుకు గానీ ప్రభుత్వం ఎక్కడా కృషి చేయకపోవడం దారుణమన్నారు. అవినీతి సొమ్మంతా తెలుగుదేశం నాయకుల జేబుల్లోకి వెళ్లింది కాబట్టే దాన్ని తొక్కిపెడుతున్నారని స్పష్టం చేశారు. 
 
ఏ క్వారీకి వెళ్లినా లారీ లోడింగ్ 1500 నుంచి 2 వేల వరకు వసూలు చేస్తున్నారని పార్థసారథి మండిపడ్డారు . లోడింగ్ ముఠాకు కేవలం రూ.500 నుంచి 7 వందలు ఇస్తూ.... లోడింగ్ ఛార్జెస్ కి అదనంగా వసూలు చేస్తుదంతా టీడీపీ నాయకుల జేబుల్లోకి వెళ్తుందన్నారు. ఇదంతా టీడీపీ పార్టీ ఫండ్ కోసం వసూల్ చేస్తున్నారా బాబు అని పార్థసారథి తూర్పారబట్టారు. ఇప్పటికైనా ఇసుక దోపిడీపై ఎంక్వైరీ చేసి  ఆసొమ్ము ప్రభుత్వ ఖజానాకు వచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై చంద్రబాబు పక్షపాతం చూపుతున్నారని పార్థసారథి ఆగ్రహించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులను విస్మరించి... ఓడిపోయిన టీడీపీ నాయకులు, పార్టీ కార్యకర్తల పేరున జీవోలు విడుదల చేసి వందల కోట్లు కేటాయించే అధికారం సీఎంకు ఎక్కడుందని నిలదీశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల  గూడుపుఠాణికి కారణం కూడా స్పెషల్ డెవలప్ మెండ్ ఫండేనని పార్థసారథి అన్నారు. వెంటనే దీనిపై గవర్నర్ విచారణ జరిపించి... పక్షపాత ధోరణితో కేటాయించిన నిధులను నిలుపుదల చేసేలా చూడాలన్నారు. 

అన్ని నియోజకవర్గాలకు నిధులు సమానంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక రాష్ట్రంలో ఎప్పుడూ లేనివిధంగా అవినీతి జరుగుతుందని తమ అధ్యక్షులు వైఎస్ జగన్ చెబితే...తప్పును సరిదిద్దుకోకుండా మీకు చట్టాలు తెలియవు, పరిణితి లేదని చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు.  నా రాజ్యం నా ఇష్టమంటూ చంద్రబాబు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. 

నియోజకవర్గానికి 50,60 కోట్లు కేటాయిస్తాను. మీ అందరి ఖర్చు నేనే భరిస్తాను అంటూ చంద్రబాబు మాట్లాడిన మాటలపై పార్థసారథి తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. ప్రజలకు మంచి సంక్షేమపథకాలను అందజేసి మెప్పుపొందాలి గానీ, దోపిడీ చేసిన నిధులతో ఓట్లు కొనుక్కోవాలనుకోవడం అవివేకమన్నారు. ప్రతిపేదవాడి కడుపు నిండే విధంగా నరేగాని రూపొందించాలని  అసెంబ్లీలో వైఎస్ జగన్ మాట్లాడితే ...నీకేం తెలుసయ్యా అంటూ చంద్రబాబు వెకిలి నవ్వులు నవ్వుతూ ఎద్దేవా చేయడం హేయనీయమన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం తీరుపై  ప్రజలు ఆలోచన చేయాలని పార్థసారథి సూచించారు. 

కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు తీసుకురమ్మంటే..బీజేపీ, టీడీపీకి తగాదా పెడుతున్నారని చెప్పి బాబు తప్పించుకుంటున్నారని పార్థసారథి ఫైరయ్యారు.  రెవెన్యూ రావడం లేదని ఆర్థికమంత్రి యనమల అంటున్నారని....అంటే ఇంతకాలం  మీరు చెప్పిన అభివృద్ధి అంతా హుళక్కేనా అని ఎధ్దేవా చేశారు . ఇప్పటికైనా వైఎస్ జగన్ నాయకత్వంలోని ప్రతిపక్షాలన్నంటినీ కలుపుకొని... కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి నిధులు రాబట్టేందుకు ప్రయత్నించాలన్నారు. అదేవిధంగా జన్మభూమి కమిటీల వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని, పనుల్లో నాణ్యత లోపించి  అవినీతికి ఆలవాలంగా మారిందన్నారు. జన్మభూమి కమిటీలను పూర్తిగా రద్దు చేసి స్థానిక సంస్థల అధికారాలనే మళ్లీ కొనసాగించాలన్నారు. ప్రభుత్వ పథకాల్లో జన్మభూమి కమిటీల పాత్ర లేకుండా చేసి అర్హులైన లబ్దిదారులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.  
Back to Top