హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల పాలిట కాలకేయుడిగా మారారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. అన్ని రకాలుగా మహిళల్ని సీఎం వేధిస్తున్నారని ఆమె వివరించారు. రోజాను ఏడాదిపాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయటంతో పాటు ఆగకుండా పూర్తి పదవీకాలం పాటు సస్పెండ్ చేయటానికి చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు పన్నుతున్న నేపథ్యంలో ఆమె మీడియా ఎదుటకు వచ్చారు. చంద్రబాబు, ఆయన అనుచరులు అసెంబ్లీ వేదికగా చేస్తున్న డ్రామాల్ని , ప్రజల్ని మోసగిస్తున్న తీరును ఆమె పూసగుచ్చినట్లు వివరించారు. 'గతంలో కూడా రైతు ఆత్మహత్యల మీద వైఎస్ జగన్ మాట్లాడుతుంటే మైకు కట్ చేశారు. రైతు సమస్యల గురించి మాట్లాడేందుకు మైకు ఇవ్వాలని మేమంతా నినాదాలు చేస్తే.. దళిత మహిళ పీతల సుజాతను లేపి ఎలా మాట్లాడించారో అందరికీ తెలుసు. అసెంబ్లీ సెషన్ జరిగేటప్పుడు అవి తప్ప మరే ఇతర క్లిప్పింగులు ఇవ్వకూడదని తెలిసినా, నేనేదో ఆమెను తిట్టినట్లు చూపించారు. వ్యక్తిత్వాన్ని హననం చేయడం సరికాదు. ఆ ముందు ఏం జరిగిందో, నేనేం మాట్లాడానో ప్రజలకు తెలియాలి. బోండా ఉమ అందరినీ పాతేస్తాను, రండిరా రౌడీల్లారా అన్నారు. బుచ్చయ్య చౌదరి సమయం సందర్భం లేకుండా నా గురించి ఏం మాట్లాడారు.. అధికారం, మీడియా తమ చేతిలో ఉన్నాయని తాము అనుకున్నట్లు చేస్తామని ముందుకుపోతున్నారు. ప్రజా సమస్యల మీద మేం చేసే నినాదాలు, ప్లకార్డులు చూపించరు. వాళ్లు ఉచ్చులో ఇరుక్కున్నప్పుడు తప్పించుకోడానికి రెండు మూడు క్లిప్పింగులు చూపించి, మా భాష బాగోలేదంటే చంద్రబాబు ఎంత దిగజారిపోయారో తెలుస్తుంది. మహిళలను, ఎస్సీ ఎస్టీలను అడ్డుపెట్టుకుని కాల్‌మనీ సెక్స్ రాకెట్ నుంచి తప్పించుకోడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారు' అని రోజా అన్నారు. అవసరాలకు చంద్రబాబు అందరినీ వాడుకొంటారని, చివరకు అంబేద్కర్ వంటి మహానుభావుల్ని కూడా వదలటం లేదని రోజా మండి పడ్డారు. అసెంబ్లీలో ఆడినడ్రామాలే ఉదాహరణ అన్నారు. ‘‘ అంబేద్కర్ మీద గౌరవం ఉన్నట్లు ఆయన చేసిన నటన అందరూ చూశారు. అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం మీద దుమ్ము, ధూళి ఉన్నా పట్టించుకోరు. ఇష్యూని డైవర్ట్ చేయడానికి పెద్దాళ్లను ఉపయోగించుకోవాలని చూశారు తప్ప అంబేద్కర్ మీద గౌరవం ఉంటే ఆయన రాసిన రాజ్యాంగానికి విరుద్ధంగా ఎందుకు పనిచేస్తున్నావని ప్రశ్నిస్తున్నా? గిరిజనులు, దళితులను అవమానిస్తూ, వాళ్ల హక్కులను కాలరాసేలా పాలిస్తున్నావు? ఆయన నటన అసెంబ్లీలో చూశాం. నేనేదో అన్నట్లు, వాళ్లు బాధపడినట్లు నటిస్తున్నారు. భార్యలను, పిల్లలను లాక్కుపోతుంటే ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రజలు ఉన్నప్పుడు వాళ్ల కన్నీళ్లు కనిపించలేదా? మీ కుటుంబ సభ్యులను ఇలాగే లాక్కెళ్లిపోతే కడుపుమంటతో సీఎంను నిలదీస్తారా.. వదిలేస్తారా ’’ అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన తీరుని ఆమె తూర్పార బట్టారు. ‘‘రిషితేశ్వరి విషయంలో, వనజాక్షి విషయంలో మీరు వేసిన కమిటీలు ఏం చెప్పాయి? వనజాక్షి తప్పు చేశారని అసెంబ్లీలో చెబుతున్నారే..నిజంగా ఆమె జిల్లా దాటి వచ్చి ఉంటే ఆమెను సస్పెండ్ చేయండి. అధికారిని కొట్టినందుకు చింతమనేనిని నాన్ బెయిలబుల్ కేసులో అరెస్టు చేయండి. నారాయణ కాలేజిలో 18 మంది పిల్లలు చనిపోతే తల్లిదండ్రులు ఎలా రోదిస్తున్నారో చూడరా? కనీసం మీ మంత్రిమండలి నుంచి నారాయణను డిస్మిస్ చేశారా, ఆ కేసులు విచారించారా, ఎవరికైనా శిక్షలు వేశారా?' అని రోజా ప్రశ్నించారు. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా కూడా డ్రామాలు కొనసాగిస్తున్నారని రోజా మండిపడ్డారు. ‘‘మూడు రోజుల క్రితం సస్పెండ్ చేసి ఇప్పుడు మళ్లీ ఏడుపు కార్యక్రమం పెట్టారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ఇలాగే రాష్ట్రమంతా బాబును దుమ్మెత్తి పోస్తే పీతల సుజాతతో ఏడుపు కార్యక్రమం పెట్టించారు. మహిళా ఎమ్మెల్యేలకు చీము, నెత్తురు ఉంటే.. అంగన్‌వాడీ మహిళలను బట్టలిప్పి కొడుతుంటే మీరేం చేస్తున్నారని అడుగుతున్నాను. కల్తీ మద్యం తాగి ఎంతమంది మహిళల పుస్తెలు తెగిపోయాయి.. వాళ్లు వితంతువులు అవ్వడానికి కారణమైన మీరు మీ షూటింగ్ పిచ్చితో పుష్కరాల్లో 30 మంది మరణించారు.. అది చూసి మీరు సిగ్గుతో తలదించుకోవాలి తప్ప నేను తలదించుకోనక్కర్లేదు. రిషితేశ్వరిని ర్యాగింగ్ పేరుతో ఎలా చంపారో తెలిసినా.. తమవాళ్లన్న కారణంతో తల్లిదండ్రులకు పరిహారం ఇచ్చేశాం, నోరు మూసుకుని ఉంటారన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఆడవాళ్లు అబలలు, వాళ్లను ఎలాగోలా ఉచ్చులో ఇరికించవచ్చని నీ వెన్నుపోటు రాజకీయాలు నామీద ప్రదర్శిస్తే.. నీ అంతు చూసేవరకు ఊరుకోను' అని రోజా చెప్పారు. అసెంబ్లీలో తెలుగుదేశం నాయకులు తమను తిడితే చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఒక న్యాయం, తమకు ఒక న్యాయం అంటే ఎలా అని నిలదీశారు. ‘‘మా గిరిజన మహిళా ఎమ్మెల్యేను ఉద్దేశించి మంత్రి రావెల కిశోర్‌బాబు అజ్ఞాని, బుద్ధి జ్ఞానం లేవని అంటారు. నాతో పెట్టుకున్నవాళ్లు ఎవరూ బతికి బట్టకట్టలేదని సీఎం అంటారు.. అంటే చంపేస్తారా? గిరిజన మహిళ బాక్సైట్ తవ్వితే గిరిజనులకు నష్టం కలుగుతుందని పోరాడితే ఆమె మీద దేశద్రోహం నేరం మోపుతారు. ఆమెను జీవిత ఖైదు చేయాలట. ఎవరు మీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ల క్యారెక్టర్‌ను చంపేస్తారన్న మాట. ఇంతకుముందు అందరూ అలాగే అనుకుంటే చంద్రబాబు, ఆయన మంత్రులు ఉండేవాళ్లా? పనికిమాలినవాళ్లను జన్మభూమి కమిటీల్లో వేస్తున్నారు. ఇంతవరకు చరిత్రలో ఏ ప్రభుత్వానికి రాని చెడ్డపేరు మొదటి 18 నెలల్లో మూటగట్టుకున్నావు. దేశంలో ఎక్కడా జరగనన్ని అఘాయిత్యాలు, అరాచకాలు ఆంధ్ర రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. నువ్వున్న విజయవాడలోనే ఇన్ని జరుగుతుంటే, విజయవాడకు చెడ్డపేరు తేవడానికి నేను ప్రయత్నిస్తున్నానని చెప్పడం సిగ్గుచేటు' అని రోజా అన్నారు. అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన దారుణం అని ఆమె అన్నారు. అసలు జరిగిందేమిటో మొత్తంగా బయట పెట్టాలని ఆమె నిలదీశారు. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలోకి వస్తుంటారని, ఎవరకీ లేని రూల్స్ తనకే ఎందుకు ఆపాదిస్తున్నారని ఆమె నిలదీశారు.