పరిశ్రమలకు భరోసా .. రైతులకు మాత్రం నిరాశ

తెలుగునాట రైతుల్ని వేయించుకొని తినటంలో ప్రభుత్వం ఉరకలు వేస్తోంది. అన్ని
వైపుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువ కావటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితి
ఎదుర్కొంటున్నారు.

కౌలు రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పే చంద్రబాబు చివరికీ షాకులు
ఇస్తున్నారు. సీజన్ మొదలైన నాటి నుంచి పంట రుణాల కోసం కౌలురైతులు బ్యాంకుల చుట్టూ
తిరుగుతున్నారు. అయితే రుణ అర్హత కార్డును ప్రాతిపదిక గా చేసుకొని రుణాలు
ఇప్పిస్తామని చెబుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో సగానికి సగం మందికి రుణం అర్హత
కార్డులు ఇవ్వనే లేదు. చాలా మంది తాము సాగు చేస్తున్న కొద్ది పాటి పొలానికి తోడుగా
ఎక్కువ మేర భూముల్ని తీసుకొని సాగు చేసుకొంటున్నారు.  ఈ అదనపు భూములకు రుణ అర్హత కార్డులు దొరకటం
లేదు.

అయితే ఇదంతా రుణ అర్హత కార్డు ఉన్నా, లేకున్నా బ్యాంకుల్లో మాత్రం రుణాలు
దొరకటం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో తీసుకొన్న రుణాలు చెల్లిస్తే తప్ప కొత్త
అప్పులు ఇవ్వబోమని బ్యాంకు అధికారులు అంటున్నారు. రుణ మాఫీ చేస్తానని ఊరించిన
చంద్రబాబు ఎన్నికల తర్వాత ముఖం చాటేశారు. అదిగదిగో రుణమాఫీ అంటూ ఊరిస్తున్నారు
తప్పితే చేయటం లేదు. దీంతో రైతులు తీసుకొన్న అప్పులకు అపరాధ రుసుంలు పడుతూ
వడ్డీలకు చక్రవడ్డీ లు తయారవుతున్నాయ. దీంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకొని
పోతున్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో 3,39,214 మంది కౌలు రైతులకు రుణాలు ఇప్పించాలని లక్ష్యంగా
పెట్టుకొన్నారు. దాదాపుగా సగం ఆర్థిక సంవత్సరం అయిపోతోంది. రెండో సీజన్
మొదలైపోయినా కానీ నాలుగో వంతు మేర కూడా రుణ వితరణ జరగలేదు. ఇప్పటి దాకా 70, 013
మందికి మాత్రమే రుణాలు దక్కాయి. అదికూడా రూ. 146.99 కోట్ల మేర మాత్రమే రుణాలు
లభించాయి. అనంతపురం జిల్లాలో అయితే అత్యల్పంగా అంటే 589 మందికి మాత్రమే అప్పులు
దొరికాయి.

దీంతో కౌలు రైతులు అల్లాడిపోతున్నారు. చంద్రబాబు చేసిన మోసానికి దిక్కుతోచక,
కొత్త అప్పుల కోసం వెదక్కొంటున్నారు.

Back to Top