బాబు భూదాహం పరాకాష్టకు చేరింది

  • ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా..? రాక్షస రాజ్యమా..?
  • వెల్లంపల్లి ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
  • 14 వేల ఎకరాల కొట్టేయడానికి చంద్రబాబు మాస్టర్‌ ప్లాన్‌
  • రైతులే స్వచ్ఛందంగా ఇస్తున్నారంటూ బాబు అబద్ధపు మాటలు
  • మనవడిని చూడటానికి కూడా వెళ్లకుండా దోపిడీకి రచనలు
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి
హైదరాబాద్‌: ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీ నాయకులపై ప్రభుత్వం సిగ్గులేకుండా దాడులకు పాల్పడుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్‌ సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేయడాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తుందా.. లేక రాక్షస ఆటవిక రాజ్యం నడుస్తుందా.. అని ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం టీడీపీ సర్కార్‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 

14 వేల ఎకరాలు తీసుకొని ఏం చేస్తారు...?
ముఖ్యమంత్రి చంద్రబాబుకు భూదాహం పరాకాష్టకు చేరిందని పార్థసారధి విమర్శించారు. రాజధాని నిర్మాణానికి రైతుల దగ్గర నుంచి తీసుకున్న 33 వేల ఎకరాలు చాలక మరో 14 వేల ఎకరాలను కొట్టేయడానికి సర్కార్‌ సిద్ధంగా ఉందన్నారు. 3–4 వేల ఎకరాల్లో బ్రహ్మాండమైన రాజదాని నిర్మించుకోవచ్చు అని ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు, మేధావులు చెప్పినా చంద్రబాబు మొండిగా తాను అనుకున్న దారిలో వెళ్లి రైతులను మభ్యపెట్టి 33 వేల ఎకరాలు సేకరించి గొప్పలు చెప్పుకుంటున్నాడన్నారు. రాజదానికి భూములు ఇవ్వని రైతులను భూములను గ్రీన్‌ జోన్‌గా పెడతామని బెదిరించే నీచస్థాయికి దిగజారుతున్నారంటే ప్రజాస్వామ్య ప్రభుత్వమా.. లేక దోపిడీ ప్రభుత్వమా అనేది ప్రజలంతా ఆలోచించాలన్నారు. మూడు గ్రామాల రైతులు మా భూములు తీసుకోండి అని చంద్రబాబు వెనుకపడి బతిమిలాడుతున్నట్లు సీఎం చెప్పడం హాస్యాస్పదం అన్నారు. 33 వేల ఎకరాలు రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న చంద్రబాబు ఈ రోజుకు కూడా రైతులు వలంటీర్‌గా ఇస్తున్నట్లు చిత్రీకరించుకున్నారంటే ఇంకా దోపిడీకి పుల్‌స్టాప్‌ పెట్టలేదని అర్థం అవుతుందన్నారు. ఇప్పటికే ఉన్న భూమిలో ఎవరూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి అదనంగా మరో 14 వేల ఎకరాలను తీసుకొని ఏం చేస్తారని ప్రశ్నించారు. 

మీ టార్గెట్‌ ఎంతో చెప్పండి బాబూ
మనవడిని చూడటానికి కూడా వెళ్లకుండా అమరావతిలో ఉంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు దోపిడీకి రచనలు రచిస్తున్నారని పార్థసారధి ఎద్దేవా చేశారు. రైతుల దగ్గర నుంచి ఎన్ని వేల ఎకరాలను లాక్కోవాలి... వాటిని ఎన్ని కోట్లకు అమ్ముకోవాలని ఆలోచనలో ఉన్నారని విమర్శించారు. 5 సంవత్సరాల కాలంలో మా టార్గెట్‌ ఇన్ని లక్షల కోట్లు అని ప్రజలకు స్పష్టంగా చెప్పండి చంద్రబాబు అని చురకంటించారు. 14 వేల ఎకరాలు కాకుండా ఔటర్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుల కోసం భూ సేకరణ చేపడుతామంటున్నారంటే చంద్రబాబుకు భూ సేకరణ ఫోబియా పట్టుకున్నట్లుందని అనుమానం వ్యక్తం చేశారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో దాదాపు 32 లక్షల ఎకరాల అటవీ, ప్రభుత్వ భూములను విడతల వారికి పేద ప్రజలకు పంచారన్నారు. కొన్ని దశాబ్దాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ ఆ భూములుపై ఎలాంటి హక్కులేనప్పుడు పేద, బలహీన, గిరిజన ప్రజలకు హక్కులు కల్పించిన మహానుభావుడు వైయస్‌ఆర్‌ అని కొనియాడారు. కానీ చంద్రబాబు 33 వేల ఎకరాల రైతుల నుంచి లాక్కొని కనీసం వారికి 32 ఎకరాల భూమిని కూడా ఇళ్ల నిర్మాణానికి ఇవ్వని దౌర్బాగ్య ప్రభుత్వం చంద్రబాబుదన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు భూదాహానికి అడ్డుకట్ట వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top