జనం గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదు

విజయవాడ, 13 ఆగస్టు 2013:

రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చినప్పుడే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడే అర్హత కోల్పోయారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుడు జోగి రమేష్ ‌నిప్పులు చెరిగారు. విజయవాడలో మంగళవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్రలో ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడుపై రమేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న దుర్భర పరిస్థితులకు చంద్రబాబునాయుడే అని రమేష్ తూర్పార‌పట్టారు. సీమాంధ్ర ప్రజానీకం గురించి చంద్రబాబు మాట్లాడితే పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ ఆత్మలు క్షోభిస్తాయని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజల గురించి ఇక బాబు నోరు మెదపకపోవడం మంచిదని ‌ఆయన అభిప్రాయపడ్డారు.

సీమాంధ్ర ప్రాంత టిడిపి నాయకులు సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటే తక్షణమే చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయించాలని జోగి రమేష్ ఆ పార్టీ ‌నాయకులను డిమాండ్ చేశారు. ఆ తర్వాతే సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని సీమాంధ్ర ‌టిడిపి నాయకులకు ఆయన సూచించారు. చంద్రబాబు సమైక్యాంధ్రకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్న తర్వాతే సీమాంధ్రలో అడుగుపెట్టాలని జోగి రమేష్ సూచించారు.

తాజా ఫోటోలు

Back to Top