ఆల్ ఫ్రీ బాబుకు అంత సీనేదీ?

నర్సీపట్నం:

చంద్రబాబు నాయుడి మాదిరిగా తాను అబద్ధపు హామీలు ఇవ్వలేనని, మహానేత వైయస్ఆర్‌ నుంచి తనకు వారసత్వంగా వచ్చింది విశ్వసనీయత అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. మాట కోసం ఎందాకైనా వెళతానన్నారు. చంద్రబాబు హామీలను చూసి చాలామంది తనను కూడా హామీలివ్వాలని సలహా ఇచ్చారన్నారు. చంద్రబాబులా అన్యాయమైన రాజకీయాలు చేయలేనని అన్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చంద్రబాబు ఎన్ని అబద్ధాలైనా చెబుతారన్నారు. విశ్వసనీయతకు తాను చంద్రబాబులా పాతరేయలేనన్నారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో మంగళవారం శ్రీ జగన్ రో‌డ్‌షో నిర్వహించారు. తరువాత విశాఖ జిల్లా నర్సీపట్నం సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అనకాపల్లి లోక్‌సభా స్థానంలో గుడివాడ అమర్‌నాథ్, నర్శీపట్నం ఎమ్మెల్యే ‌స్థానానికి పెట్ల ఉమాశంకర్ గణే‌శ్‌ను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించారు.

చంద్రబాబు నాయుడికి విశ్వసనీయత లేదని, ఆయన ఇంతవరకు ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయలేదని, కొత్తగా ఆల్ ఫ్రీ అంటూ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని శ్రీ వైయస్ జగ‌న్ విమర్శించారు. ‘రాష్ట్రాన్ని సింగపూ‌ర్ చేస్తా‌నని చంద్రబాబు అంటున్నారని, కానీ ఆయన ఈ మాట అంటుంటే ఇంతకన్నా అన్యాయం లేదనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజిస్తే ఒక‌ పక్క అన్యాయం అని అంటూనే, ఇంకో పక్క రాష్ట్రాన్ని విడగొట్టడానికి పార్లమెంట్‌లో ఎంపీలతో ఓట్లు వేయించారని దుయ్యబట్టారు. ఒకవైపు రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టి, ఇంకోవైపు విభజనలో భాగస్వాములయ్యారని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేంత సీన్ చంద్రబాబుకు లేదన్నారు.

ఒక వ్యక్తిని చంపేసి, చనిపోయిన వ్యక్తికి తిరిగి తానే దండ వేస్తానని పరిగెత్తినట్టుంది చంద్రబాబు నాయుడి తీరు అని శ్రీ జగన్‌ నిప్పులు చెరిగారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి తిరిగి ఎన్నికలొచ్చినప్పుడల్లా ఆయన ఫొటో బయటకు తీసి దానికి దండేస్తుంటాని ఘాటుగా విమర్శించారు. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు అంటున్నారని, ఉచితంగా సెల్‌ఫోన్లు, టీవీలు.. ఇలా అన్నీ ఆల్‌ ఫ్రీ అంటున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు రుణ మాఫీ చేయాలంటే రూ.1.27 లక్షల కోట్లు అవసరం. డ్వాక్రా రుణాల మాఫీకి రూ.20 వేల కోట్లు కావాలి. ఈ రెండు కలిపితే రూ.1.47 లక్షల కోట్లు. కానీ రాష్ట్ర బడ్జెట్లో మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం రూ.1.25 లక్షల కోట్లు. బడ్జెట్‌ను మించిపోయి రూ.1.47 లక్షల కోట్ల రుణాలను చంద్రబాబు ఎలా మాఫీ చేస్తారు? అని శ్రీ జగన్ ప్రశ్నించారు.

అన్ని కోట్ల ఉద్యోగాలు బాబు ఎలా ఇవ్వగలరు? :

ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు ఏ గడ్డి తినడానికైనా సిద్ధపడతారని శ్రీ జగన్‌ నిప్పులు చెరిగారు. నోటికి ఏ హామీ వస్తే అది గుడ్డిగా ఇచ్చేస్తారని విమర్శించారు. ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు చెబుతున్నారని, రాష్ట్రంలో మూడున్నర కోట్ల ఇళ్లున్నాయని, ఇంటికొక ఉద్యోగం ఎలా ఇస్తార?ని ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చిన ఈ 60 ఏళ్లలో రాష్ట్రంలో ఇప్పటివరకు 20లక్షల ఉద్యోగాలిస్తే ఐదేళ్లలోనే 3 కోట్లకు పైగా ఉద్యోగాలెలా ఇస్తారని నిలదీశారు. చంద్రబాబు అధికారంలో ఉండగా 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయించి 21వేల మంది ఉద్యోగులను బజారులో నిలబెట్టిన వైనాన్ని శ్రీ జగన్‌ గుర్తుచేశారు.

సంవత్సరానికి 10 లక్షల ఇళ్లు నిర్మిస్తా :

తాను సీఎం అయ్యాక అయిదు సంతకాలు చేస్తానని శ్రీ జగన్‌ చెప్పారు. ఆ సంతకాలు రాష్ట్ర చరిత్రను మారుస్తాయన్నారు. అక్కా చెల్లెళ్ళ కోసం మొదటి సంతకం అమ్మఒడి పథకంపై పెడతానన్నారు. ఈ పథకంతో పిల్లల భవిష్యత్తుకు బంగారుబాట వేస్తానన్నారు.  ప్రతి పాఠశాలలో ఇంగ్లీషు మీడియం పెట్టిస్తానన్నారు. రెండవ సంతకం అవ్వా, తాతలకు. రూ.200 పింఛన్‌ను రూ.700కు పెంచుతూ చేస్తానన్నారు. మూడవ సంతకంగా రైతులకు రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చారు. నాలుగవ సంతకం అక్కా చెల్లెళ్లకు రూ.20 వేల కోట్ల డ్వాక్రా రుణాలను కిందా మీదా పడి ఏదోలా మాఫీ చేస్తానన్నారు. రేషన్‌కార్డుల కోసం ప్రజలు కాళ్లరిగేలా తిరగనక్కర్లేకుండా ప్రతి గ్రామం, ప్రతి వార్డులో ఆఫీసు తెరుస్తానన్నారు. 24 గంటల్లో ఏ కార్డు అయినా సరే ఇచ్చేందుకు ఐదవ సంతకం చేస్తానన్నారు. సీఎం అయ్యాక ఏడాదికి 10లక్షల ఇళ్లు నిర్మిస్తానని, అయిదేళ్లలో అందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తానని చెప్పారు.

ప్రతి జిల్లాకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి :
ఆపరేషన్ ‌కోసం హైదరాబాద్ తప్ప వేరే దిక్కులేని పరిస్థితి‌ మన రాష్ట్రంలో ఉందని శ్రీ జగన్‌ అన్నారు. ఈ పరిస్థితి లేకుండా మన రాష్ట్రంలోనే అన్ని జిల్లాల్లో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తానన్నారు. హైదరాబాద్ కంటే గొప్ప నగరాన్ని అభివృద్ధి చేస్తా‌నన్నారు. అక్కడే 17 నుంచి 20వరకు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తామని చెప్పారు. 2019 నాటికి రాష్ట్రంలో కరెంటు కోతలే లేకుండా చేస్తానన్నారు. పగలు ఏడు గంటలు కచ్చితంగా వ్యవసాయానికి విద్యుత్ అందిస్తా‌నన్నారు. అధికారంలోకి వచ్చాక కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పారిశ్రామిక కారిడార్ తీర్చిదిద్దుతా‌మన్నారు. ఆ కారిడార్‌లో పలు కంపెనీలు ఏర్పాటయ్యేలా చేస్తామన్నారు. పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను నంబర్‌వన్‌గా చేస్తానన్నారు.

తాజా ఫోటోలు

Back to Top