చంద్రబాబుకు మనస్సాక్షి లేదా?

కదిరి, 4 సెప్టెంబర్ 2013:

టిడిపి అధికారంలోకి వస్తే.. తెలంగాణకు సంబంధించి రాజకీయ.. చట్టపరమైన ప్రకియ చేస్తామని చంద్రబాబు 2009 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. చంద్రబాబు ఇచ్చిన బ్లాంక్‌ చెక్కు లాంటి లేఖే మన రాష్ట్ర విభజనకు కారణం అయిందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికలు వరకు కాంగ్రె‌స్‌తో చంద్రబాబు కుమ్మక్కు అయ్యారని మండిపడ్డారు. అనంతపురం జిల్లా కదిరి బస్‌ స్టాండ్‌ సెంటర్‌లో బుధవారం నిర్వహించిన సమైక్య శంఖారావం సభలో ఆమె టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి తీరుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు.

రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోని చంద్రబాబు... తన పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలతో డ్రామాలాడిస్తున్నారని శ్రీమతి షర్మిల విమర్శించారు. ఇప్పుడు బస్సుయాత్రతో సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎఫ్‌డిఐల విషయంలో తన పార్టీ ఎంపిలను గైర్హాజరు చేసి, అది ఆమోదం పొందేలా చంద్రబాబు చేశారన్నారు.

రాష్ట్ర విభజనకు కారణమైన చంద్రబాబు నాయుడు... ఆ నెపాన్ని ఇప్పుడు మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డిపై వేస్తున్నారని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. ఆయనకు అసలు మనస్సాక్షి అనేది ఉందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అబద్ధాలకు ఒక హద్దంటూ ఉందా? అన్నారు. ఉప ఎన్నికలు మొదలు మొన్నటి పంచాయతీ ఎన్నికల వరకూ కాంగ్రెస్, టిడిపి పాలు నీళ్ళలా కలిసిపోయి పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా చంద్రబాబు మేలుకున్నారా అంటే లేదన్నారు. చంద్రబాబు తీరు చూస్తే.. ఒకరిని హత్య చేసి.. ఆ శవం మీదే పడి వెక్కివెక్కి ఏడ్చిన చందంగా ఉందని తూర్పారపట్టారు.

జీతాలు, జీవితాలు పణంగా పెట్టి ఉద్యోగులు, విద్యార్థులు సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతుంటే... టిడిపి, కాంగ్రెస్ ‌నాయకులు రోజుకు ఒకరి ఇంటిలో మీటింగ్‌లు పెట్టి విందు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.  వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినప్పుడే కాంగ్రెస్, టిడిపి ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర విభజనకు తెర తీసిందన్నారు.

కదిరి ప్రాంతంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించింది మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అన్నారు. ఆయన బ్రతికి ఉంటే సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తయిపోయి అనంతపురం జిల్లాకు రెండు పంటలకూ సాగునీరు వచ్చేదన్నారు. ఇప్పటి ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడంలేదు. కొత్త రేషన్‌ కార్డులు, పింఛన్లు లేవు. ఉన్నవాటిని కూడా తొలగిస్తున్నారంటే ఈ పాలకులు ‌రాక్షసులే అని మండిపడ్డారు. వైయస్ఆర్‌ ప్రతి పథకానికీ ఈ ప్రభుత్వం తూట్లు పెట్టిందన్నారు. అన్ని చార్జీలు, ధరలు పెంచేసి పేదలు నలిగిపోతుంటే చూసి నవ్వుకుంటోందని దుయ్యబట్టారు.

మహానేత వైయస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయింబర్సుమెంటు వంటి పథకాలు నిర్వీర్యం అవుతున్నాయని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ఆర్ హయాంలో ప్రజలపై పన్నులు, ఛార్జీల భారం లేవని ఈ సందర్భంగా‌ శ్రీమతి షర్మిల గుర్తు చేశారు.

లక్షణంగా కలిసి మెలిసి బ్రతుకుతున్న అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టి, టిఆర్ఎస్‌ను కలుపుకుని కేంద్రంలో బలపడాలని కాంగ్రెస్‌ పార్టీ చూస్తోందని విమర్శించారు. ఓట్లు, సీట్ల కోసమే ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేయాలని కేంద్రం చూస్తోందన్నారు. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడే కృష్ణా నీటిని కర్నాటక రాష్ట్రం దిగువకు వదలని దుస్థితి ఉందన్నారు. మధ్యలో మరో రాష్ట్రం వస్తే, నీటిని కిందికి రానివ్వకుండా అడ్డుకుంటే సీమాంధ్ర ఏమైపోవాలి? అని ప్రశ్నించారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్, ఎంఐఎం, సిపిఎం పార్టీ విభజనకు ఏనాడూ ఒప్పుకోలేదని చెప్పారు. ఈ మూడు పార్టీలూ ఒప్పుకోనప్పుడు ఏకాభిప్రాయం అని ఎలా అంటారో కాంగ్రెస్‌ నాయకులే సమాధానం చెప్పాలన్నారు. సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని విభజించే హక్కు కాంగ్రెస్‌ పార్టీకి లేదన్నారు. న్యాయ చేసే ఉద్దేశం కానీ, చేయాలన్న ఆలోచన కానీ కాంగ్రెస్‌కు లేవని తేలిపోయింది... అందుకే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గట్టిగా డిమాండ్‌ చేస్తోందన్నారు. సమైక్యాంధ్ర సాధించే వరకూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు మద్దతుగా ఉంటుందన్నారు. అంతవరకూ జగనన్నను, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదించాలని విజ్ఞప్తిచేశారు.

సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పదవిని పట్టుకుని గబ్బిలంలా వేలాడుతున్నారని విమర్శించారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రులు, ఎంపిలు కాంగ్రెస్‌ పెద్దలకు వంగి వంగి సలామ్‌లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

Back to Top