చంద్రబాబు ప్రజలను క్షమాపణ కోరాలి

రాక్షసగుంపుల మాదిరి వైయస్ జగన్ పై దాడులు
ఆనాడు ఎన్టీఆర్ ను చెప్పులతో కొట్టించారు
నేడు దిష్టిబొమ్మల దహనానికి పురిగొల్పుతున్నాడు
వైయస్ జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రలు
ముఖ్యమంత్రి వల్లే రైతుల ఆత్మహత్యలు
టీడీపీ ప్రభుత్వంపై వాసిరెడ్డి పద్మ ఆగ్రహం

హైదరాబాద్ః అధికారపార్టీ నేతల అరాచకాలకు అంతే లేకుండా పోతుందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. చంద్రబాబు చేసిన మోసపూరిత హామీల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చలించి చెప్పులతో కొడతారని వైయస్ జగన్ అంటే...దాన్ని సాకుగా చూపి అధికారసభ్యులు ఆయనపై మాటల దాడి చేయడం దుర్మార్గమన్నారు. ఎన్టీఆర్ ను చెప్పులతో కొట్టించిన సంస్కృతి చంద్రబాబుదని పద్మ దుయ్యబట్టారు.  మీరా సభ్యతా, సంస్కారాల గురించి మాట్లాడేది అంటూ ముఖ్యమంత్రి, మంత్రులపై  పద్మ నిప్పులు చెరిగారు. వైయస్ జగన్ ను విమర్శించి పబ్బం గడుపుకోవాలనుకుంటే మీ పప్పులు ఉడకవని టీడీపీని హెచ్చరించారు. 

వైయస్ జగన్ పై అధికార సభ్యులు చేస్తున్న మాటల దాడిని చూసి సభ్యసమాజం  సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని పద్మ అన్నారు. చంద్రబాబు వైయస్ జగన్ ను టార్గెట్ చేసి దిష్టిబొమ్మలను కాల్చేందుకు పురిగొల్పుతూ... ప్రతిపక్షం లేకుండా చేయాలన్న కుట్రలు పన్నుతున్నారని పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్కహామీ నెరవేర్చకుండా బాబు ప్రజలను నమ్మించి గొంతు కోశారని పద్మ మండిపడ్డారు. బాబు తనను వ్యక్తిగతంగా తొక్కేయాలని చూసినా ఏనాడు వైయస్ జగన్ పల్లెత్తు మాట అనలేదని..కానీ, రైతులను, మహిళలను, రాష్ట్రాన్నే తొక్కేయాలని చూస్తున్నందునే జననేత స్పందించాల్సి వచ్చిందన్నారు.  ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడుతారని, ప్రజానాయకుడిగా ఇంకా గట్టిగా నిలదీస్తారని బాబును హెచ్చరించారు. 

చంద్రబాబు అండ్ కో కుట్రపన్నికేసులు పెట్టి 16 నెలలు బెయిల్ రాకుండా చేసినా... వైయస్ జగన్ సహనంతో రాజకీయంగా ఎదుర్కొన్నారే తప్ప ఎవరినీ ఏమీ అనలేదన్నారు. ఎన్నికల్లో కూడా  వీరి కుట్ర రాజకీయాలను ఎండగట్టారు తప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదన్నారు. కానీ ఎన్నికల ముందు, ఆతర్వాత చంద్రబాబు ఆయన టీం ....ఒక అబద్ధాన్ని పదిసార్లు చెబితే ప్రజలు నమ్ముతారని వైయస్ జగన్ ను సైకో అంటూ  గ్లోబెల్ ప్రచారం చేశారని పద్మ గుర్తు చేశారు. అప్పుడే ప్రజలు ఎవరు సైకో అని  చొక్కాలు పట్టుకొని నిలదీస్తే తలలు ఎక్కడ పెట్టుకునే వాళ్లని తెలుగుతమ్ముళ్లకు చురక అంటించారు. మీరు ఎన్నిదాడులు చేసినా  వైయస్ జగన్ ప్రజల కష్టాల మీదే స్పందించారు తప్ప....తనపై చేస్తున్న దుష్ర్పచారం మీద ఏనాడు స్పందించలేదన్నారు. 

చంద్రబాబు చేసిన మోసాల వల్ల  బ్యాంకుల్లో అప్పులు కట్టలేక రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే మనసు చలించి ప్రజానాయకుడిగా  వైయస్ వారికి అండగా నిలిచారని పద్మ చెప్పారు.  రైతులు, డ్వాక్రామహిళలు దుర్భర పరిస్థితికి చంద్రబాబే కారణమని పద్మ దుయ్యబట్టారు. బాబు రుణమాఫీ హామీ ఇవ్వకపోతే  వారు అప్పుల సుడిగుండంలో ఇరుక్కునేవారు కాదు. ఆత్మహత్యలు చేసుకునే వారే కాదని పద్మ అన్నారు.  బాబు మోసం చేయడం వల్లే ప్రజల పక్షాన వైయస్ జగన్ ప్రశ్నించారన్నారు. దాన్ని పట్టుకొని  ఒకాయని ఆంబోతు అని, మరొకాయన పిచ్చికుక్క అంటూ వైయస్ జగన్ పై నోటికొచ్చినట్లు చెలరేగుతున్నారని పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు ఎన్టీఆర్ ను చెప్పులతో కొట్టించిన చంద్రబాబు.. ఇవాళ వైయస్ జగన్ దిష్టిబొమ్మలను చెప్పులతో కొట్టిస్తూ నీచస్థాయికి దిగజారారని మండిపడ్డారు. 

ముఖ్యమంత్రి అయి ఉండి ఖూనీ కోరు, సైకో అంటూ అసెంబ్లీలో వైయస్ జగన్ ను వేలెత్తి చూపిస్తూ బెదిరించారే .  అప్పుడు సభ్యతా సంస్కారం గుర్తుకు రాలేదా బాబు..? మీరు చేస్తే శుద్ధమా...? రైతుల ఆత్మహత్యలు చూసి చలించి మోసకారిని చెప్పులతో కొడతారని  వైయస్ జగన్ అంటే అసభ్యం లాగా కనిపిస్తుందా...?  అసెంబ్లీలో, బయట మీరు మాట్లాడిన మాటలు రికార్డులు తిరగేస్తే.... సభ్యత, సంస్కారం ఎవరిదో తేలుతుందన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించాక వైయస్ జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ...కుట్ర రాజకీయాలకు తెరతీసినప్పుడే బాబు సభ్యతా సంస్కారం సమాదైపోయిందని పద్మ దుయ్యబట్టారు. వైయస్ జగన్ పై వ్యక్తిగత దాడి చేసినప్పుడే బాబు నీచ రాజకీయాలు బట్టబయలయ్యాయని అన్నారు.  

పోలీసుల కనుసన్నల్లో  దిష్టిబొమ్మల దహనం జరగడం అమానుషమన్నారు. రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నా పోలీసులు టీడీపీ నేతలపై ఒక్క కేసు కూడా పెట్టకపోవడం దారుణమన్నారు. చంద్రబాబు గూండాయిజం, దౌర్జన్యాలకు పోలీసులు కొమ్ముకాయడం హేయనీయమన్నారు. ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన బాధ్యత తమదేనన్న సంగతి పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు. చంద్రబాబు బెదిరింపులకు ప్రజలు, ప్రతిపక్షం భయపడబోదని పద్మ తేల్చిచెప్పారు. ఏం చేసినా చెల్లుతుందనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. 

అన్ని వర్గాల ప్రజలను బాబు వెన్నుపోటు పొడిచారని పద్మ ఫైరయ్యారు. ఆత్మహత్యలు తమ వల్లే జరుగుతున్నాయని బాబు చేసిన తప్పు ఒప్పుకుంటే అప్పుడు రైతులు క్షమిస్తారన్నారు. అబద్ధపు హామీలతో ముంచామని డ్వాక్రామహిళలను క్షమాపణ కోరితే అప్పుడు వారు క్షమిస్తారని పద్మ చెప్పారు. క్షమాపణ అడిగి వారిని అప్పుల్లోంచి బయటకు ఎలా తీసుకొస్తారో చెప్పాలన్నారు. అంతేగానీ రాక్షసుల గుంపు మాదిరి వైయస్ జగన్ ను టార్గెట్ చేసి ప్రతిపక్షం లేకుండా చేయాలనుకుంటే ప్రజలు క్షమించరన్నారు. 

Back to Top