దోపిడీ దొంగల మీటింగ్

కేబినెట్ మీటింగ్ కాదు అది దోపిడీ మీటింగ్
పచ్చనేతల జేబులు నింపేందుకు బాబు తాపత్రయం
18నెలల్లో దోచుకోవడం తప్ప చేసిందేమీ లేదు

హైదరాబాద్ః
వైఎస్సార్సీపీ సీనియర్ నేత పార్దసారథి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
దొంగలంతా ఒక చోట సమావేశమై దోపిడీని పంచుకునే విధంగా రాష్ట్రంలో కేబినెట్
మీటింగ్ లు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రజాసమస్యలు
పరిష్కరించేందుకు,ప్రజల అవసరాలు తీర్చేందుకు కేబినెట్ మీటింగ్ ఉపయోగపడాలి
కానీ, ఏవిధంగా రాష్ట్రాన్ని దోచుకుందామన్న దానిపైన కాదని ప్రభుత్వానికి
చురకలు అంటించారు. ఎప్పుడు కేబినెట్ మీటింగ్ లు జరిగినా  ఏవిధంగా
ఇసుకదోపిడీ చేయాలి, ఇంకా ఎన్ని లక్షల ఎకరాలు రైతుల దగ్గర దోచుకోవాలి,
తెలుగుతమ్ముళ్లకు ఎన్ని ఎకరాలు కట్టబెట్టాలన్న దానిపైనే సమావేశాలు
జరుపుతున్నారని పార్ధసారథి  విరుచుకుపడ్డారు.
 
కేబినెట్
సమావేశాలు దోపిడీకి పరిమితమవుతుంటే...ప్రజల నెత్తిన శఠగోపం పెట్టేందుకు
చంద్రబాబు ఎంపీలు, అధికారులతో మాట్లాడిస్తున్నారని ధ్వజమెత్తారు. కప్పు టీ
రూ.5 ఉన్నప్పుడు, రూపాయికి కిలో బియ్యం అవసరమా అని టీడీపీ ఎంపీ జేసీ
దివాకర్ రెడ్డి మాట్లాడుతున్నారంటే.. చంద్రబాబు రూపాయకి కిలోబియ్యం పథకం
ఎత్తేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు కనబడుతుందన్నారు. రైతుల ఆత్మహత్యల
గురించి గానీ, నిత్యవసర ధరల గురించి గానీ, రాష్ట్రంలోని ప్రజాసమస్యల
గురించి గానీ చంద్రబాబు ఏమాత్రం ఆలోచన చేయకపోవడం దుర్మార్గమన్నారు.  ఎవరైనా
చావండి మాకు సంబంధం లేదన్నట్లు చంద్రబాబు పాలన సాగిస్తున్నారని
దుయ్యబట్టారు. 

పోలీసులను అడ్డుపెట్టుకొని టీడీపీ
నాయకులు జన చైతన్యయాత్రలు చేస్తుంటే...కార్యకర్తలు వచ్చిసీఎం ఆఫీస్ వద్ద
 ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నారని పార్ధసారథి అన్నారు. తీవ్రంగా పంట నష్టం
పోయిన టీడీపీకి చెందిన  ఓ రైతు కేబినెట్ మీటింగ్ కూతవేటు దూరంలో
ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని చెప్పారు.  ఏం మొహం పెట్టుకొని టీడీపీ
నేతలు గ్రామాల్లోకి వెళుతున్నారన్నారు. ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం లేనివారికి
నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు...ఇప్పటివరకు  ఎంతమందికి
ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో  దాదాపు 4 వేల మంది
నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే చంద్రబాబు పాలన ఏవిధంగా ఉందో
అర్థమవుతోందన్నారు. రైతులు, నిరుద్యోగులు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్
 ఉద్యోగులు, వీఆర్ఏలు, అంగన్ వాడీలు అంలా అందరిలోనూ అశాంతి నెలకొని,
రోడ్డుపైకి వస్తున్నారని పార్ధసారథి తెలిపారు. 

అధికారంలోకి
వచ్చి 18 నెలలయింది. ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ అయినా జారీ చేశావా
చంద్రబాబు అని పార్థసారథి ప్రశ్నించారు . ఏపీపీఎస్సీకి వచ్చిన ఛైర్మన్ తో
చంద్రబాబు చిలుక పలుకులు పలికిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రైవేటు
ఉద్యోగాలు చూసుకోండి. నేను ప్రభుత్వంతో మాట్లాడి నోటిఫికేషన్ ఇవ్వగలనో లేదో
చూస్తానంటూ ఏపీపీఎస్సీ ఛైర్మన్ మాట్లాడడం దారుణమన్నారు. దివంగత
ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి  ప్రతిసంవత్సరం వేల పోస్ట్ లు ఇచ్చిన
విషయాన్ని గుర్తు చేశారు. డీఎస్సీ పరీక్షలో అర్హత సాధించిన వారి భవిష్యత్
ను చంద్రబాబు గాలికొదిలేశారని మండిపడ్డారు. అన్ని శాఖల్లో ఉన్న ఉద్యోగులను
తొలగిస్తున్నారని నిప్పులు చెరిగారు. అంగన్ వాడీలను తీసేసి తెలుగుదేశం
కార్యకర్తలతో వాటిని భర్తీ చేయాలని చూస్తున్నారన్నారు.  రాష్ట్రంలో దాదాపు
28 లక్షల మంది నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారని
చెప్పారు.  అందరికీ శఠగోపం పెట్టి నాయకుల సూటుకేసులు, కార్యకర్తల జేబులు
నింపేందుకు చంద్రబాబు మీటింగ్ లు పెడుతున్నారని ధ్వజమెత్తారు. 
Back to Top