బాబుకు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది

వెంక‌టాచ‌లం (నెల్లూరు):  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో నంద్యాల‌లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌నుచూసిన త‌ర్వాత చంద్ర‌బాబుకు భ‌యం ప‌ట్టుకుంద‌ని నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి అన్నారు. ఎలాగైనా నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో గెల‌వాల‌నే ఉద్దేశ్యంతో అడ్డ‌దారులు తొక్కుతున్నార‌న్నారు.  స్థానిక పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మాట్లాడుతూ  నంద్యాల‌లో  పోటీ  చేస్తున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి శిల్పా మోహన్‌రెడ్డి అభ్యర్థిత్వం చెల్లదంటూ టీడీపీ నాయ‌కులు ద్రుష్ప్ర‌చారం  చేయడమే కాకుండా నోట‌రీ  చెల్లదని అభ్యర్థిత్వాన్ని రద్దుచేయాలని ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. 2009 ఎన్నికల్లో సర్వేపల్లిలో పోటీచేసిన చంద్రమోహన్‌రెడ్డి విషయంలో ఇదే జరిగితే ఎన్నికల కమీషన్‌తో చంద్రబాబు మాట్లాడలేద‌ని ప్రశ్నించారు. చంద్రబాబు రెండు నాల్కులు, రెండు కళ్ల దోరణితో వ్యవహిరించడం మానుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు నీతి,నిజాయితీగా వ్యవహరించకుండా అడ్డదారులు తొక్కే విషయాన్ని నంద్యాల ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు పాలనపై ప్రజలకు సంతృప్తి ఉంటే బాబు ఎందుకు అడ్డదారులు తొక్కాల్సివస్తుందని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషకరంగా లేరని ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే సంతృప్తి కరంగా ఉన్నారని తెలియజేశారు. మూడేళ్ల పాలనతో అవినీతి సొమ్మును బాగా పోగుచేయడంతో ఆయన కుటుంబ సభ్యులు సంతృప్తిగా ఉంటారే తప్ప ప్రజలు సంతృప్తిగా ఉండరన్నారు. చంద్రబాబుకు తన పాలనపై విశ్వాసం ఉంటే టిడిపి నాయకులంతా నంద్యాలలో ఎందుకు మకాం వేయాల్సి వచ్చింద‌ని కాకాణి ప్ర‌శ్నించారు. 

Back to Top