దొడ్డిదారిన అమెరికా పారిపోయిన చంద్రబాబు

ఏపీ ప్రజలను దగా చేసిన టీడీపీ, బీజేపీ
హోదాను విస్మరించి బాబు విహారయాత్రలు
కరవును కాసుల కోసం వాడుకుంటున్న బాబు
రేపు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ కలెక్టరేట్ ల ముట్టడి

విజయవాడః  కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ఏపీ ప్రజలను నయవంచన చేసి పబ్బం గడుపుకుంటున్నాయని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ మండిపడ్డారు. హోదా గానీ, లోట్ బడ్జెట్  గానీ,  రాజధానికి భూములిచ్చిన రైతులకు రాయితీలు గానీ ఇవ్వమని కేంద్రం తెగేసి చెబుతుంటే...అవేమీ పట్టించుకోకుండా బాధ్యత మరచి దొడ్డిదారిన అమెరికాకు పారిపోవడం సిగ్గుచేటని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలంతా మథనపడుతుంటే..... కుటుంబసమేతంగా చంద్రబాబు విహారయాత్రలకు వెళ్లడం దుర్మార్గమన్నారు.  ఢిల్లీలో ముఖ్యమంత్రి సమావేశంలో హోదాపై ప్రధానిని నిలదీసే అవకాశం ఉన్నా...దాన్ని పోగొట్టుకొని అమెరికాకు పారి పోవడంలో ఆంతర్యమేంటి బాబు అని ప్రశ్నించారు. 

ఐదేళ్లు కాదు రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేకహోదా ఇవ్వాలని వెంకయ్యనాయుడు, కాదు 15 ఏళ్లు ఇవ్వాలని నోరుచించుకున్న చంద్రబాబు నాయుడు మాటతప్పారని ధ్వజమెత్తారు.  రాష్ట్ర ప్రజలంతా ఆందోళనలో ఉంటే, అవన్నీ వదిలేసి చంద్రబాబు అమెరికా పారిపోవడం హేయనీయమన్నారు. తెలుగుదేశం నేతలు  ప్రత్యేకహోదాపై ఇప్పుడేం సమాధానం చెబుతారని నిలీశారు. కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్న అశోకగజపతిరాజు, సుజనాచౌదరీలు పార్లమెంట్ లో మోడీని నిలదీయకుండా...విజయనగరం, విజయవాడలో ప్రెస్ మీట్ లు పెట్టి హోదా ఇవ్వాల్సిందేనని మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఇద్దరుమంత్రులు ఢిల్లీలో నోరుమెదకుండా రాష్ట్రంలో బల్లలు చరవడమేంటని ఎద్దేవా చేశారు. 


ప్రత్యేకహోదాపై చంద్రబాబు నిలకడలేని మాటల కారణంగానే రాష్ట్రానికి ఈపరిస్థితి దాపురించిందని జోగిరమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్సీపీ ప్రతిక్షణం పోరాడుతుందని జోగిరమేష్ స్పష్టం చేశారు. ప్రతిపక్షం గొంతునొక్కాలని చూస్తున్న ప్రభుత్వంపై ఉవ్వెత్తున ఉద్యమిస్తామని చెప్పారు. అధ్యక్షులు వైఎస్ జగన్ నాయకత్వంలో రేపు అన్నిజిల్లాల కలెక్టరేట్ లను ముట్టడిస్తామన్నారు.  హోదా కోసం తమ అధినేత వైఎస్ జగన్ ఇదివరకే గుంటూరులో ఆమరణనీరాహార దీక్ష, ఢిల్లీలో ధర్నాతో పాటు ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు నినాదంతో హోదాకోసం మరింతగా ఉద్యమిస్తామని తేల్చిచెప్పారు.  

రాష్ట్రంలో ప్రజలు కరవుతో విలవిలలాడుతున్నారు.  తాగడానికి నీళ్లు లేవు. పశువులు హాహాకారాలు పెడుతున్నాయి. పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే చంద్రబాబు, లోకేష్ లు తమ సంస్థ హేరిటేజ్ ద్వారా పెరుగును కొనుగోలు చేసి మజ్జిగ వ్యాపారం చేస్తున్నారని జోగిరమేష్ నిప్పులు చెరిగారు. సహకారసంఘంలో మూతబడిన డైరీల ద్వారా మజ్జిగ కొనుగోలు చేస్తే ఎంతో బాగుండేదన్నారు.  చంద్రన్న కానుకల పేరుతో పాడైపోయిన హెరిటేజ్ నెయ్యి సరఫరా చేసి రూ. 500 కోట్లను కానుకల రూపంలో జేబులో వేసుకున్న చంద్రబాబు....ఇప్పుడు కరవును కూడా కాసుల రూపంలో జేబులో వేసుకుంటున్నారని జోగి ఫైరయ్యారు. బాబు నిర్వాకంతో ప్రజలంతా ముక్తకంఠంతో ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. 

Back to Top