కాపుల ఓట్ల కోసం బాటు పాట్లు

నంద్యాల: కాపుల ఓట్ల కోసం చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఈ రోజు విజయవాడలో చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించింది కాపుల ఆత్మీయ సమ్మేళనం కాదని, దాన్ని టీడీపీ సమన్వయ సమావేశం అంటే సముచితంగా ఉండేదేమో అని అనుమానం వ్యక్తం చేశారు. నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు కాపుల పట్ల వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. విజయవాడలో నిర్వహించిన కాపుల సమావేశంలో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతల కంటే టీడీపీ నాయకులే అధిక సంఖ్యలో పాల్గొన్నారన్నారు.  ఇంత హడావుడిగా ఈ సమావేశం ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. నంద్యాలలో ఉప ఎన్నిక, కాకినాడలో కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో కాపుల ఓట్ల కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి కాపుల పట్ల చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. కాపుల హక్కుల కోసం ముద్రగడ పద్మనాభం పోరాడుతుంటే, ఆయన ఉద్యమంపై ప్రజల్లో చర్చ జరుగుతుండటంతో కాపుల దృష్టి మరల్చి, వారి ఓట్ల కోసం టీడీపీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేశారన్నారు. కాపులను బీసీల్లో చేర్చుతామనే హామీని కూడా చంద్రబాబు ఇవ్వలేదని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో కాపులు టీడీపీకి తగిన గుణపాఠం చెప్పాలని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.

Back to Top