చంద్రబాబు పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలి

హైదరాబాద్, 26 అక్టోబర్ 2013:

మరణించిన మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డిపై చంద్రబాబు నాయుడు పిచ్చిప్రేలాపనలు మానుకోవాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, తాజా మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని హెచ్చరించారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన వైయస్ఆర్‌ రాష్ట్ర ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారని చెప్పారు. ఆ మహానేత తనయుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి స్థాపించిన పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరముందని హెచ్చరించారు. చంద్రబాబు తన పిచ్చి కుక్కలను తమ మీదకు వదిలితే తగిర విధంగా బుద్ధి చెబుతామని కొడాలి నాని అన్నారు.

రాష్ట్ర విభజన ప్రక్రియను మొదలుపెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని నాని విమర్శించారు. ఎల్బీ స్టేడియంలో శనివారం జరిగిన సమైక్య శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు గజని నాని ఎద్దేవా చేశారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలన్న బీజేపీతో 1999లో పొత్తు పెట్టుకున్న విషయాన్ని మర్చిపోయి చంద్రబాబు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

ముఖ్యమంత్రి కావాలని 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టినా పదవి‌ కోసం ఆశపడని నైజం శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిది అన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఎమ్మెల్యేలతో వైశ్రాయ్ హోట‌ల్‌లో క్యాంపు పెట్టి ఎన్టీఆ‌ర్‌కు వెన్నుపోటు ద్వారా ముఖ్యమంత్రి అయ్యారని కొడాలి నాని గుర్తుచేశారు.

Back to Top