ప్రభుత్వ భూదాహంతో రోడ్డున పడిన అన్నదాత

నూజెండ్లలో రైతులను పరామర్శించిన బొల్లా
నూజెండ్ల: అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్‌హైవే క్రింద భూములు కోల్పోయిన రైతులకు పోలవరం నిర్వాసితుల మాదిరిగానే ఎకరాకు 44 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని వైయస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ నియోకవర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండల కేంద్రమైన నూజెండ్లలో ఎక్స్‌ప్రెస్‌హైవే క్రింద భూములు కోల్పోతున్న రైతులను ఆయన కలిశారు. నూజెండ్ల, బుర్రిపాలెం, అప్పాపురం, గ్రామాలకు చెందిన వందలాదిమంది రైతులు బొల్లా వద్దకు చేరుకుని సమస్యను తెలియజేశారు. రైతులు కోల్పోతున్న భూములను పరిశీలించిన అనంతరం బొల్లా మాట్లాడుతూ ప్రభుత్వం భూదాహంతో వేలాది ఎకారాలు భూసేకరణ పేరుతో రైతుల పొట్టలు కొడుతుందని విమర్శించారు. హైవే జంక్షన్‌ నెపంతో నూజెండ్ల లక్ష్మీపురం ప్రాంతంలో రోడ్డుకు కాకుండా మరో 250 ఎకరాలు సేకరించడం దారుణమన్నారు. ఎప్పుడో భూమి అవసరం వస్తుందని ఇప్పుడే రైతుల వద్దనుంచి భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

 రైతులకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా పొలాలల్లో జెండాలను పాతడంతో రైతులు దిగులుతో అల్లాడుతున్నారన్నారు. రోడ్డుక్రింద పూర్తిగా పొలాలు పోయిన రైతులకు నష్టపరిహారంతో  పాటు భూములను ఇవ్వాలన్నారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల అన్నదాత రోడ్డున పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నూజెండ్ల రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు. ఈనెల 26,27 తేదీలల్లో జగన్‌ తలపెట్టిన రైతు దీక్షకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షనేత జగన్‌ దృష్టికి సమస్యను తీసుకెళ్ళి రైతులపక్షాన పోరాటం ఉధృతం చేస్తామన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా రైతులకు న్యాయం చేసేలా పోరాటం చేస్తామన్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే నోరు మెదపక పోవటమేమిటని దుయ్యబట్టారు. అధికారులు కూడా నష్టపరిహారంపై రైతులకు స్పష్టత నివ్వాలని సూచించారు. కార్యక్రమంలో మండలకన్వీనర్‌బత్తుల వెంకటేశ్వర్లు యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మూలె వెంకటేశ్వరరెడ్డి, జిల్లా ఎగ్జిక్యూటివ్‌మెంబరు గంధం బాలిరెడ్డి,దండు చెన్నయ్య, కుర్రాపాపిరెడ్డి, శ్రీరామినేని రమేష్, చిరంజీవి, రామకృష్ణారెడ్డి, లతోపాటు రైతులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top