పొలిటికల్ కరప్షన్ ను కనిపెట్టింది చంద్రబాబే

()బాబు అవినీతిని పెంచి పోషిస్తున్నారు
()డబ్బులున్న వాళ్లకే సీట్లు ఇస్తున్నారు
()దొంగే దొంగ అన్నట్లుంది బాబు, మంత్రుల తీరు
()రాష్ట్రంలో ఏం జరిగినా ప్రతిపక్ష నేతకు ఆపాదిస్తున్నారు
()ప్రతిపక్ష నేతకు బహిరంగ క్షమాపణ చెప్పాలి
()వైయస్సార్సీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్

విజయవాడః చంద్రబాబు రాష్ట్రంలో అవినీతిని పెంచి పోషిస్తున్నారని వైయస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. రాజధాని పేరుతో రైతుల భూములు దోచుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ చంద్రబాబు, ఆయన అనుయాయులు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీ నుంచి ప్రధాని మొదలు..ప్రతీ జిల్లా నుంచి మట్టి, నీళ్లు తెచ్చి పండుగలు చేసిన చంద్రబాబు రాజధానిలో శంకుస్థాపన చేసి ఏడాది గడిచిపోయినా కూడా ఇంతవరకు అక్కడ ఒక్క పునాది కూడా వేయలేకపోయారని దుయ్యబట్టారు.  పిచ్చిమొక్కలతో రాజధాని ప్రాంతం మెరిసిపోతోందని ఎద్దేవా చేశారు. పురుషోత్తమ్ పట్నం నుంచి టెండర్ పిలవకుండానే 77 శాతం ఎక్సస్ తో ఎస్టిమేట్ మంజూరు చేసుకోని జీవో ఇవ్వడం అన్యాయమన్నారు. ఇంత దారుణమైన దోపిడీ దేశంలో మరెక్కడా లేదన్నారు. 

కృష్ణా డెల్టాలో ఇప్పటికీ 1.60 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదని గుర్తుచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాలువలు కట్టిస్తుంటే.. ప్రాజెక్టులు కట్టకుండా కాలువలేంటని అప్పట్లో ఎద్దేవా చేశారని, ఇప్పుడు అదే కుడికాల్వ ద్వారా పట్టిసీమ నీళ్లు పారిస్తున్నారని అన్నారు. ఇప్పుడు తాజాగా ఎడమ కాల్వ ద్వారా నీళ్లు విడుదల చేసేందుకు జీవో నెం. 100 ఇచ్చారని, అందులో.. పురుషోత్తమపట్నం నుంచి ఎడమకాలువ ద్వారా గోదావరి నీళ్లు తెస్తున్నామని చెప్పారని తెలిపారు. గతంలో దీని అంచనాలు రూ. 958 కోట్లుగా పేర్కొని. శాఖాపరమైన అనుమతులు తీసుకున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు దీనికి 77 శాతం ఎక్సెస్‌గా రూ. 1638 కోట్లతో అనుమతులు ఇచ్చారన్నారు.. టెండర్లు పిలిచిన తర్వాత ఎక్సెస్ పర్సంటేజి కింద దోపిడీ చేస్తున్నారని తామంతా గొంతులు చినిగేలా పట్టిసీమ గురించి మాట్లాడుతుంటే అది మర్చిపోకముందే ఇంత ఎక్సెస్‌తో ఇస్తున్నట్లు జీవో ఇవ్వడమంటే ఇంత దారుణమైన దోపిడీ దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఉండదని ఆయన అన్నారు.

తాత్కాలిక రాజధాని అని చెప్పి ఆగమేఘాల మీద అందరినీ రప్పించడం తప్ప బాబు అక్కడ చేస్తున్నదేమీ లేదని పెద్దిరెడ్డి విమర్శించారు.  స్విస్ ఛాలెంజ్ కింద సింగపూర్ కు ప్రాజెక్ట్ లు అప్పజెప్పడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టినా పట్టించుకోకుండా బాబు సీల్డ్ కవర్ వ్యవహారాలు నడిపిస్తున్నాడని పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫస్ట్ స్టేజ్ రాజధాని నిర్మాణానికి సీడ్ క్యాపిటల్ కింద 1691 ఎకరాలు ఉచితంగా ఇస్తున్నారు. అంత విలువ చేసే భూములను సింగపూర్ కు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని నిలదీశారు. మన ఇంజినీర్లంతా ఇతర దేశాల్లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లు కట్టి కీర్తి గడిస్తే బాబు వారిని పక్కనబెట్టడమే గాక అవమానించడం బాధాకరమని పెద్దిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  ఆంధ్రా ఇంజినీర్లంతా గాడిదలు అందుకే సింగపూర్ ను ఆశ్రయించామని టీడీపీ నేతలు అనడం దారుణమన్నారు. మన ఇంజినీర్ల సామర్థ్యాన్ని  గుర్తించకపోవడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు, ఆయన తాబేదారులు రైతుల భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని పెద్దిరెడ్డి విరుచుకుపడ్డారు. రాజధాని కట్టాలన్న చిత్తశుద్ధి బాబుకు లేదని అన్నారు. 

ఓటుకు కోట్లు కేసులో ముద్దాయిగా ఉన్న చంద్రబాబు..పదేళ్లు హైదరాబాద్ లో ఉండే అవకాశం ఉన్నా జైలుకు పోవాల్సి వస్తుందని భయపడి విజయవాడకు పారిపోయారని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. అలాంటి చంద్రబాబు బ్లాక్ మనీ విషయంలో వైయస్ జగన్ పై బురదజల్లుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా జగన్ పై నెపం వేసేలా బాబు మాట్లాడడం ఆ తర్వాత దానికి ఊతమిచ్చేలా మంత్రులు పాటపాడడం అలవాటైపోయిందన్నారు. నల్లధనం గురించి కేంద్రం ప్రకటన చేసిన వెంటనే వీళ్లకు ఆ వివరాలు ఎక్కడినుంచి వచ్చాయని ప్రశ్నించారు. నల్లధనాన్ని ప్రకటించిన వ్యక్తుల పేర్లు ఇవ్వాలని ప్రధానిని లేఖ ద్వారా కోరిన వ్యక్తి  వైయస్ జగన్ మాత్రమేనన్నారు. జగన్ పై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబుకు దమ్ముంటే  ఆవివరాలు బయటపెట్టి క్రెడిబిలిటీని నిలబెట్టుకోవాలని సవాల్ చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతీ విషయాన్ని బాబు, మంత్రులు వైయస్ జగన్ పైకి నెడుతున్నారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. జగన్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

దోపిడీ కోసమే బాబు రూ.500, రూ. 1000 నోట్లను రద్దు చేయాలంటున్నారని పెద్ది రెడ్డి చెప్పారు. సింగపూర్, జపాన్ లలో  ఉన్న లావాదేవీలను 
డాలర్స్, పౌండ్స్ లోకి మార్చుకునేందుకే బాబు ఈవిధంగా మాట్లాడుతున్నారని, దీన్ని  ప్రజలంతా గుర్తించారని పెద్దిరెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో నోట్ల పంపకమే లేదని,  ఓటుకు డబ్బులు ఇచ్చే విధానాన్ని కనుగొన్న విధానకర్త బాబేనని అన్నారు. టీడీపీ నేతలు ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నారనడానికి గతంలో ఆధారాలు కూడా దొరికాయన్నారు. ఈ సిటీలోనే సిద్ధార్థ కాలేజీలో రెండు కోట్లు పట్టుకున్నా ఎవరూ క్లెయిమ్ చేయలేదన్నారు. డబ్బులున్నవాళ్లకే బాబు రాజ్యసభ సీటు ఇస్తున్నారని పెద్దిరెడ్డి విమర్శలు గుప్పించారు. టీజీ వెంకటేశ్,  సుజనా చౌదరిలు రాష్ట్రానికి ఏమైనా సేవ చేశారా..? వీళ్లు వ్యాపారవేత్తలు కాదా...? డబ్బు లావాదేవీలతో కాదా రాజ్యసభ సభ్యులైందని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. పొలిటికల్ కరప్షన్ ను, ఎన్నికల్లో డబ్బులు పెట్టే విధానాన్ని కనిపెట్టిన గొప్ప వ్యక్తి బాబేనని దుయ్యబట్టారు. అలాంటి బాబు దొంగే దొంగ అన్నట్లు ఆయన చేసే తప్పులను వైయస్ జగన్ పై రుద్దాలని ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. 

మంత్రిపదవులు, డబ్బులు ఆశచూపి 20 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు గొర్రెలను కొన్నట్లు కొన్నారని పెద్దిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు పోయి గెలిపించుకునే ధైర్యం కూడా బాబుకు లేదన్నారు. 11 మున్సిపాలిటీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటే అక్కడ ఆర్నెళ్ల పాటు అధికారులను పొడిగించడం శోచనీయమన్నారు. ఎన్నికలకు పోలేమని బాబు ప్రజలకు చెప్పకనే చెబుతున్నారని ఎద్దేవా చేశారు. వెళ్లిపోయిన ఎమ్మెల్యేలంతా టీడీపీలో భరించలేక మళ్లీ వస్తామంటున్నారని పెద్దిరెడ్డి తెలిపారు. డబ్బులు లేకుండా బాబు ఏకార్యక్రమం చేయడని,  ఏదైనా చేపట్టాడంటే దాని వెనుక వందల, వేల కోట్లు లావాదేవీలు జరిగినట్లేనని తెలిపారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని,  ఏ ముఖ్యమంత్రి కూడా  దేశంలో ఇంత అవినీతికి పాల్పడలేదని అన్నారు. బాబు అవినీతిపై పుస్తకాన్ని ప్రచురించడం జరిగిందని, విచారణ జరపాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.  ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. మోసపు మాటలతో ఎన్నికల్లే గెలిచే వ్యక్తులు, అవినీతికి పాల్పడిన వారిపై రెఫరెండం అమలు చేసేలా చట్టం తేవాలని కోరుతున్నామన్నారు. 
Back to Top