ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తున్నారు

వన్‌టౌన్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తున్నారని వైయ‌స్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఆసిఫ్ అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం తన మంత్రివర్గంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చోటు కల్పించటాన్ని నిరసిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పిలుపు మేరకు ‘సేవ్ డెమెక్రసీ’ పేరుతో నగరంలో ఆసిఫ్ ఆధ్వర్యంలో ధ‌ర్నా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ర్యాలీని ప్రారంభించిన ఆసిఫ్ మాట్లాడుతూ ప్రపంచంలో తాను, తన కుటుంబమే నీతివంతమైనవిగా పదేపదే చెప్పుకునే చంద్రబాబు మొదటి నుంచి అప్రజాస్వామ్య పద్దతుల్లోనే తన రాజకీయాలను నడిపారని ఎద్దేవా చేశారు. మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన చంద్రబాబు నేడు వందల కోట్లను వెదజల్లి, మంత్రి పదవులను ఎరచూపి వైయ‌స్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్నారు. వైయ‌స్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయించకుండా తన పార్టీలోకి చేర్చుకోవటమే కాకుండా నలుగురికి మంత్రి పదవులు కట్టపెట్టడం ఏ రకమైన ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు బుద్ధి తెచ్చుకోకుండా అదే రీతిలో దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
Back to Top