కులాల మధ్య కుంపటి చంద్రబాబు ఘనతే

  • ఏపీలో బరితెగింపు పాలన 
  • కోర్టుకు సమాధానం ఇచ్చుకోలేక చట్ట సవరణలా
  •  బాబు జీవితమంతా కుట్ర రాజకీయాలే
  •  టీడీపీ అసమర్థతను ఆధారాలతో సహా బయటపెడతాం
  • రాజకీయ సన్యాసానికి సిద్ధమా..?
  •  వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిథి  వాసిరెడ్డి పద్మ సవాల్ 
హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్‌లో బరితెగింపు పాలన నడుస్తుందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిథి వాసిరెడ్డి పద్మ చంద్రబాబు పాలనపై ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు అసమర్థ పాలనపై తీవ్ర ఆరోపణలు చేశారు. కృష్ణా జలాల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రి రేపు మాపు అంటూ మీనమేషాలు లెక్కించడం రైతులకు అన్యాయం చేయడమేనని అన్నారు. స్విస్‌ చాలెంజ్‌ మీద కోర్టుల్లో వాదనలు వినింపించడానికి ఢిల్లీ నుంచి ఆగమేఘాల మీద ఏజీని పిలిపించుకునే మీరు నీరు లేక వేలాది ఎకరాలు ఎండిపోతుంటే పట్టించకోరా అని బాబును ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ వలనే రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్న మంత్రి దేవినేని ఉమ ఆ లేఖపై బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. బాబు మీరు బలపరిచిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కూడా.... కృష్ణా జలాల కోసం వైయస్ఆర్ చాలానే పోరాడారని చెప్పిన సంగతి గుర్తులేదా అని ప్రశ్నించారు. మీరు, మీ పార్టీ అసమర్థతను ఆధారాలతో సహా మేము నిరూపించేందుకు సిద్దమేనన్నారు. దేవినేని ఉమా...రాజకీయ సన్యాసానికి సిద్ధమా అని సవాల్ చేశారు. 

ప్రాజెక్టులు ఎందుకు కట్టలేకపోయారు...
ఆంధ్రప్రదేశ్‌కు మిగులు జలాలపై వాటా ఉన్న సమయంలో ప్రాజెక్టులు కట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి చనిపోయిన వ్యక్తిపై అడ్డగోలు ఆరోపణలు చేయడం చాలా నిసిగ్గుగా ఉందన్నారు. కృష్ణా మిగులు జలాలపై మనకు హక్కు ఉన్నప్పుడు ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదని అధికార టీడీపీని ప్రశ్నించారు. అప్పుడు ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు పనిచేసిన బాబు ఏం చేశారో చెప్పాలన్నారు. ఆనాడు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేమే నడిపించామని చెప్పుకుంటున్నారు కదా మరి అలాంటప్పుడు కర్ణాటక సుప్రీంకోర్టుకు వెళ్లినప్పుడు ప్రతిగా ఏపీ కోసం మీరేం చేశారన్నారు. ఇప్పుడు కూడా కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా పోరాటం చేయకుండా విచారణకొచ్చినప్పుడు చూద్దాంలే అని నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. 

కులాల మధ్య కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది మీరే...
కులాల మధ్య కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడం బాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని వాసిరెడ్డి పద్మ నిప్పులు చెరిగారు. ఎన్నికల సమయంలో కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పి మోసగించడంతో వారు ఉద్యమిస్తుంటే బాబు మరో కులాన్ని రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. సాక్షాత్తు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ కుటుంబాన్నే నిలువునా మోసం చేసిన చరిత్ర బాబుదని దుయ్యబట్టారు. చంద్రబాబు జీవితమంతా కుట్రలేనని, అవన్నీ ప్రస్తావిస్తే తెల్లమొహం వేయడం ఖాయమన్నారు. స్విస్‌ చాలెంజ్‌పై హైకోర్టు మొట్టికాయలు వేస్తే హడావుడిగా నచ్చినట్టుగా చట్టాలను కూడా మార్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని.. కానీ, అలాకాకుండా తప్పించుకు తిరుగుతున్న అసమర్థ ప్రభుత్వాన్ని చూస్తున్నామని తెలిపారు. ఆర్‌టీఐ చట్టం ద్వారా వివరాలు కోరిన జర్నలిస్టును కూడా తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషించిన మీరు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 
Back to Top