పాదయాత్రపై చంద్రబాబు కుట్రలు

  • ప్రతిపక్ష నేత ప్రజలను కలుసుకోవడానికి అనుమతి తీసుకోవాలా..
  • 2013లో ఎవరి అనుమతితో పాదయాత్ర చేశావు చంద్రబాబూ
  • నియంతలా చంద్రబాబు వైఖరి
  • పాదయాత్రతో జననేత అన్నివర్గాల ప్రజలను కలుస్తారు
  • ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ ప్రజలకు వివరిస్తారు
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి
ఒంగోలు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ప్రతిపక్షనేత ప్రజలను కలుసుకోవడానికి అనుమతి తీసుకోవడం ఏంటని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. ఒంగోలులోని ఆయన నివాసంలో వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 2013లో చంద్రబాబు ఎవరి అనుమతి తీసుకొని పాదయాత్ర చేపట్టారని ప్రశ్నించారు. నేడు పోలీసుల అనుమతి తీసుకోవాలనడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుందన్నారు. తుని లాంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశముందని చంద్రబాబు మాట్లాడుతున్నారంటే.. వారే ఏదైనా కుట్రకు పాల్పడుతున్నారనే అనుమానం కలుగుతుందన్నారు.

విపరీతంగా పెరిగిన నిరుద్యోగ సమస్య..
జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందకుండా చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. రైతులు, డ్వాక్రా సంఘాలకు రుణాలు మాఫీ చేయలేదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలన్నింటిని వైయస్‌ జగన్‌ ప్రజలకు వివరించనున్నారన్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రకు సంబంధించి ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. అసెంబ్లీ సమావేశాల బహిష్కరణపై ఇప్పటికే పార్టీ వైఖరిని వెల్లడించడం జరిగిందన్నారు. సంతలో పశువుల్లా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు వారికి మంత్రి పదవులు కట్టబెట్టారని, అంటే చంద్రబాబు చట్ట సభలపై ఎంత గౌరవం ఉందో అర్థం అవుతుందన్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్ర ప్రకటించగానే టీడీపీ అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేయడం బట్టి వారి పద్దతి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. పాదయాత్ర ద్వారా జననేత అన్ని వర్గాల ప్రజలను కలుసుకోనున్నారన్నారు. 

విద్యార్థుల ఆత్మహత్యలపై వినతి...
రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలపై జాతీయ బాలల హక్కుల సంఘం చైర్మన్‌ను కలిసి వినతిపత్రం అందజేసినట్లుగా వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. త్వరలో హాస్టళ్ల నిర్వాహణపై సంఘం తగు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, కార్యదర్శి కేవీ రమణారెడ్డిలు పాల్గొన్నారు. 
Back to Top