టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా చెల్లవు

  • అభివృద్ధి వ్యతిరేకులు అంటూ ప్రతిపక్ష పార్టీపై విషప్రచారం
  • జన్మభూమి సభలో చంద్రబాబు వికృత చేష్టలు 
  • అభివృద్ధికి డబ్బులెక్కడివంటూ దబాయించిన చంద్రబాబు
  • శిల్పా నామినేషన్‌ తిరస్కరణకు టీడీపీ కుట్రలు
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
నంద్యాల: ఎన్నికల్లో ఓడిపోతామని గ్రహించిన చంద్రబాబు ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై పనిగట్టుకొని దుష్ప్రచారం చేయిస్తున్నాడని వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటుందని, వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని అభివృద్ధి నిరోధకుడి ముద్ర వేస్తూ విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాలలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ.. చంద్రబాబు అభివృద్ధి వ్యతిరేకుడని, అందుకు శిల్పా మోహన్‌రెడ్డి టీడీపీలో ఉన్న సమయంలో ఓ సభ అందుకు నిదర్శనమన్నారు. 2016 జనవరి 6వ తేదీన గోసపాడు మండలం దీపగుంట్ల గ్రామంలో జన్మభూమి కార్యక్రమంలో శిల్పా మోహన్‌రెడ్డి నంద్యాలను అభివృద్ధి చేయాలని వేడుకుంటే అందుకు చంద్రబాబు ప్రవర్తించిన తీరు దారుణమన్నారు. ఆ వీడియోను మీడియా ముందు ప్లే చేసి చూపించారు. నంద్యాలలో రోడ్డు వెడల్పుకు డబ్బులు కేటాయించండి అని ప్రాదేహపడితే డబ్బులు ఎక్కడివి అంటూ మాట్లాడడని, దీపగుంట్ల కాలేజీ నిర్మాణానికి రూ. 1.5 కోట్లు ఖర్చు అవుతుంది. రూ.కోటి నేను ఇస్తా.. మిగిలింది, మీరు పెట్టుకోండి అని మాట్లాడడాన్నారు. 

గతంలో రోడ్డు వెడల్పు చేయాలని శిల్పా మోహన్‌రెడ్డి అడిగితే డబ్బులు లేవన్న చంద్రబాబు ఇవాళ ఎన్నికల నగారా మోగంగానే రాజధాని లాంటి రోడ్లు నంద్యాలలో అంటూ గ్రాఫిక్స్‌ చూపిస్తున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. శిల్పా మోహన్‌రెడ్డి అభివృద్ధి కోసం తాపత్రయపడే నాయకుడని ఈ వీడియో నిదర్శనమన్నారు. ప్రజాదరణ కోల్పోయిన చంద్రబాబు ఎన్నికల్లో గెలిచేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉప ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్‌ తిరస్కరణకు కుట్రలు చేశాడని ధ్వజమెత్తారు. అఫిడవిట్‌ నోటరీ రెన్యూవల్‌ లేదనే తిరకాసు పెట్టారని, నిజాయితీ గల అధికారులు ఉండడం వల్లే చంద్రబాబు ఆటలు చెల్లలేదన్నారు. చంద్రబాబు ఓడిపోతాడని గమనించే నామినేషన్‌ తిరస్కరణకు కుట్ర పూరిత మానస్తత్వంతో వ్యవహరించారన్నారు. 2014లో శిల్పా మోహన్‌రెడ్డి టీడీపీ తరుపున నామినేషన్‌ వేసినప్పుడు నోటరీ రామతులసిరెడ్డి సంతకం పెట్టారు. ఆ రోజున అదే అఫిడవిట్‌పై సంతకం పెట్టిన నోటరీ శిల్పా వైయస్‌ఆర్‌ సీపీలో చేరగానే అభ్యంతరం పెట్టారన్నారు. నిజానికి తెలుగుదేశం పార్టీ నిన్న ఓడిపోయిందని, టీడీపీ విష ప్రయత్నం ప్రజలకు అర్థం అయ్యిందన్నారు. చంద్రబాబు గెలిస్తే అభివృద్ధి అనేది కల, ప్రజలను మభ్య పెట్టేందుకు అభివృద్ధి మంత్రం తీసుకొచ్చాడని దుయ్యబట్టారు. అభివృద్ధి కోసం పనిచేసే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 
Back to Top