మోసకారి చంద్రబాబు

పులివెందులలో పర్యటించిన జననేత
ప్రజాసమస్యలపై దృష్టి
పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
ఎన్నికల హామీలు విస్మరించిన బాబుపై ఫైర్
అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపాటు
 
వైయస్సార్ జిల్లాః ఏపీ ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ రెండ్రోజుల పాటు పులివెందులలో సుడిగాలి పర్యటన చేశారు. ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. తక్షణమే వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందిన బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి వారిని ఓదార్చారు. అండగా ఉంటానని వారిలో ధైర్యం నింపారు. అదేసమయంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయంలో పార్టీశ్రేణులు, ప్రజలతో మమేకమయ్యారు.

‘ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు ...అధికారం చేపట్టాక వాటిని పూర్తిగా విస్మరించారని వైయస్ జగన్ మండిపడ్డారు. చివరకు దళితులను కూడా మోసం చేసేందుకు సిద్ధమయ్యారని ఫైరయ్యారు. ఎస్సీ కాలనీల్లో 50 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇవ్వడంలోనూ అనేక మెలికలు పెడుతున్నారు. మీటర్ల కనెక్షన్లకు డబ్బులు కట్టకపోతే కరెంటు కట్ చేస్తామని ప్రభుత్వం బెదిరింపు ధోరణికి దిగడం దారుణమని వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలోని స్వగృహంలో ఉన్న ఆయనను వల్లూరు మండలం పైడికాల్వ ఎస్సీ కాలనీ వాసులు కలిశారు. దళితులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, తమకు కరెంటు సక్రమంగా ఇవ్వడం లేదని జననేతకు ఫిర్యాదు చేశారు. దళిత కాలనీలోని ఇళ్లకు మూడు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిపేయడం సరైంది కాదని వైయస్ జగన్ అన్నారు. 

 నిరుద్యోగ భృతి ఏమైంది?
 ‘‘ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇస్తామని ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. ఉద్యోగాలు లేని యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్నారు. ఎన్నికలకు ముందు చెప్పింది ఒకటి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నది మరొకటి. ఉన్నత చదువులు చదివిన వారికి కూడా ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది‘’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. పులివెందులకు చెందిన కొందరు నిరుద్యోగులు వైయస్ జగన్‌ను కలిశారు. 

ఇంటర్, ఇంజనీరింగ్‌లో 90 శాతం మార్కులు సాధించినా ఉద్యోగాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ...  ఎన్నికల ముందు హామీలిచ్చి, అవసరం తీరాక విస్మరించడం సరికాదన్నారు. వైయస్ జగన్ పులివెందుల మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన వెంట కడప ఎంపీ వైయస్ అవినాశ్‌రెడ్డి, వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Back to Top