బాబు నమ్మించి మోసం చేశారు

– వైయస్‌ఆర్‌సీపీలో చేరడం ఆనందంగా ఉంది
– గంగుల ప్రభాకర్‌రెడ్డి
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు మమ్మల్ని నమ్మించి మోసం చేశారని ఆళ్లగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ గంగుల ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. టీడీపీ విధానాలు నచ్చక బుధవారం ఆయన వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గంగుల మీడియాతో మాట్లాడారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీకి ఉనికి లేని సమయంలో తాను ఆ పార్టీకి జీవం పోశానన్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో భూమా శోభానాగిరెడ్డి చనిపోవడంతో సానుభూతి ఓట్లతో గెలిచిందని, ఆమె చనిపోయాక ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని బాబు మాకు హామీ ఇచ్చారన్నారు. ఆ సమయంలో హుద్‌హుద్‌ తుపాన్‌ రావడం, చంద్రబాబు విశాఖలో బిజీగా ఉండటం, శోభానాగిరెడ్డి కూతురుకు ఏకగ్రీవంగా ఇవ్వాలని కోరడంతో మేం అంగీకరించామన్నారు. ఆ తరువాత భూమా నాగిరెడ్డిని టీడీపీలోకి చేర్చుకునే సమయంలో మీకు అన్యాయం జరుగదని,డిలిమిటేషన్‌లో అందరికి సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే ఆరు నెలలుగా మాకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మాకు జరుగుతున్న అన్యాయాన్ని చంద్రబాబు, లోకేష్, మంత్రి అచ్చెన్నాయుడు, శిల్పా చక్రపాణిరెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గత కొన్ని రోజులుగా ప్రతి మండలంలోని కార్యకర్తలతో చర్చించామన్నారు. చివరకు మంత్రి అచ్చెన్నాయుడు కొంతకాలం వేచి ఉండాలని చెప్పినట్లు తెలిపారు. అయితే ఈ నెల 14వ తేదీన కార్యకర్తల మీటింగ్‌ పెట్టి అందరి అభిప్రాయాలు సేకరించగా అన్యాయం జరిగేచోట మనం ఉండొద్దని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుదామని ముక్తకంఠంతో చెప్పడంతో మేం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉందని గంగుల పేర్కొన్నారు. గతంలో భూమా నాగిరెడ్డిని విషపు మొక్కను నాటానని చంద్రబాబే చెప్పారని, ఇవాళ ఆ విష వృక్షాన్ని  బాబు కౌగిలించుకుంటున్నారని విమర్శించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 35 ఎంపీటీసీలు,  సర్పంచ్‌లు, 3 జెడ్పీటీసీలు,  50 మంది నీటి సంఘాల సభ్యులను గెలిపించుకున్నానని చెప్పారు. త్వరలోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి వీరందరిని వైయస్‌ఆర్‌సీపీలో చేర్చుతామన్నారు.    
Back to Top