ప్రజాకోర్టులో చంద్రబాబుకు శిక్ష తప్పదు

నరసరావుపేటః ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసి కేసులు పెడుతూ అరాచక ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. భేషరత్‌గా రాష్ట్ర ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహనరెడ్డిపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి, ప్రభుత్వం చేస్తున్న  అరాచకాలతో 2019ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవటం ఖాయం అన్నారు. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌పై పెట్టిన అక్రమ కేసును ఉపసంహరించుకోవాలని కోరుతూ గురువారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేసును వెనక్కు తీసుకోవాలని కోరుతూ తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్యాయంగా 11మంది ప్రయాణికులను బలిగొన్న బస్సు డ్రైవర్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని వైయస్‌ జగన్‌మోహనరెడ్డి కోరటం ప్రభుత్వానికి తప్పుగా ఉందా అని ప్రశ్నించారు. దీనికి ఆయనపై కేసులు పెట్టడం దారుణం అన్నారు. ప్రభుత్వం విధానం చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా..? లేక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌ లాంటి ఒక నియంతృత్వ పరిపాలనలో ఉన్నామా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు.

30 మంది చనిపోయి రెండేళ్ళవుతున్నా చర్యలేవి?
చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో గోదావరి పుష్కరాల్లో 30మంది చనిపోయి రెండేళ్ళు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గోపిరెడ్డి మండిపడ్డారు. ఇసుక మాఫియాను అడ్డుకున్న వనజాక్షి అనే మహిళా తహశీల్దార్‌ను ప్రభుత్వ చీఫ్‌ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ ఇసుకలోకి లాక్కొని వెళ్ళి కొట్టి ఏడాదిన్నర గడిచినా సీఎం చంద్రబాబు ఏమి యాక్షన్‌ తీసుకున్నారని ప్రశ్నించారు. కడపలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ౖవైయస్‌ఆర్‌ సీపీ కార్పోరేటర్‌పై దాడిచేసి కొట్టారని, మరికొంతమంది ఎమ్మెల్సీలకు పంటనష్టం చేశారన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ తమను భయపెట్టేందుకే కేసులు పెట్టిస్తున్నాడని, ఎవరూ భయపడేవారులేరని, తప్పకుండా ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు.

దివాకర్, కేసినేని ట్రావెల్స్‌ను రద్దుచేయాలి
ఆర్టీసీకి కోట్లు నష్టం వస్తుందని చెబుతూ ప్రైవేటు ట్రావెల్స్‌ను ఎందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందో చెప్పాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. ప్రైవేటు ట్రావెల్స్‌లో 95శాతం టీడీపీవారివే అన్నారు. ట్రావెల్స్‌ పేరు చెబుతూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ట్రావెల్స్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం వారికి ఎందుకు దాసోహం అంటుందో చెప్పాలన్నారు.  వెంటనే దివాకర్, కేసినేని ట్రావెల్స్‌లను మూసేసి వీటి స్థానంలో ఆర్టీసీ బస్సులను నడిపి నష్టాల నుంచి సంస్థను రక్షించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జెడ్బీటీసీ సభ్యుడు నూరుల్‌అక్తాబ్, పార్టీ నాయకులు కొమ్మనబోయిన శంకరయాదవ్, పిల్లి ఓబుల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 

తాజా వీడియోలు

Back to Top