చంద్రబాబు ప్రజాస్వామ్యానికి మచ్చ

ఉద్యమాన్ని అణగదొక్కిన బాబును క్షమించకూడదు
మరో కొత్తపొత్తు కోసం ఢిల్లీ వచ్చాడు
వైయస్‌ఆర్‌ సీపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి

ఢిల్లీ: చంద్రబాబు లాంటి వ్యక్తులతో ప్రజాస్వామ్యానికే మచ్చ ఏర్పడుతుందని వైయస్‌ఆర్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలను వంచించే దుర్మార్గుడు చంద్రబాబు అని మండిపడ్డారు. రాజకీయ కారణాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి. అభివృద్ధిని తన ఉక్కుపాదంతో అణగదొక్కిన చంద్రబాబు లాంటి వ్యక్తిని క్షమించకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం ఏ పార్టీ చిత్తశుద్ధితో పోరాడుతుందో ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు తన అవసరాల కోసం మాటలు మార్చుతూ.. వైయస్‌ఆర్‌ సీపీ బీజేపీతో జతకట్టిందని తప్పుడు కూతలు కూస్తున్నాడని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సింగిల్‌గానే పోటీ చేస్తుందన్నారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత ఎవరు విభజన చట్టంలోని అంశాలను నెరవేరుస్తామని ముందుకొస్తారో వారికే మద్దతు ఇస్తామన్నారు. రాజకీయ కారణాలతో విన్యాసాలు చేయడం చంద్రబాబుకు అలవాటన్నారు. ఇప్పటి వరకు బీజేపీతో కలిసి ఎవరు కాపురం చేశారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

2019 ఎన్నికల్లో ఏ పార్టీతో జతకూడితే బాగుంటుందనే అంశంపై ఆరా తీసేందుకు ఢిల్లీకి వచ్చారని ఎంపీ మేకపాటి విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అసలు రాలేదన్నారు. వైయస్‌ జగన్‌ ప్రతి బహిరంగ సభలో అన్ని అంశాలను క్షుణ్ణంగా వివరిస్తున్నారన్నారు. 14వ ఆర్థిక సంఘం హోదాకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదని, కావాలనే చంద్రబాబు డబ్బుల కోసం ప్రత్యేక ప్యాకేజీ తీసుకున్నాడన్నారు. ఈ రోజు ఏదో కాకమ్మ కథలు చెబుతూ మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు.  
Back to Top