చంద్రబాబు@34 కుంభకోణాలు

రాష్ట్రంలో చంద్రబాబు విచ్చలవిడి అవినీతి
బ్లాక్ మనీ సొమ్ముతో ఎమ్మెల్యేలకు ప్రలోభాలు
రెండేళ్లలో లక్షా రూ. 34 వేల కోట్ల దోపిడీ
అవినీతిపై విచారణకు సిద్ధమా బాబు
టీడీపీ సర్కార్ పై ధ్వజమెత్తిన వైఎస్ జగన్

ఢిల్లీః ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతి చిట్టాను ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్  బట్టబయలు చేశారు. రెండేళ్ల కాలంలోనే చంద్రబాబు లక్షా 34 వేల 295 కోట్ల అవినీతికి పాల్పడ్డారని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు.  బాబు పాలనలో 34 కుంభకోణాలు జరిగాయని విమర్శించారు. రాష్ట్రంలో బాబు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నా దాన్ని అడిగే నాథుడే కరువయ్యాడన్నారు. అవినీతి సొమ్ముతో ఒక్కో ఎమ్మెల్యేలకు 20,30 కోట్లు ఇచ్చి కొంటూ పట్టపగలే చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడని దుయ్యబట్టారు.  ఢిల్లీలో మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...

తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో ఆడియో వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ...ఏపీలోనూ అదే అవినీతిని కొనసాగిస్తున్నాడంటే ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదు. అసలు బాబుకు ఇంతింత డబ్బులు, బ్లాక్ మనీ ఎక్కడ నుంచి వస్తుంది. ఇన్ని డబ్బులిచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం. అంతటితో ఆగకుండా మంత్రి పదవులిస్తా, మీరు రాజీనామా చేయనవసరం లేదని చెబుతున్నారు.  ప్రజాస్వామ్యంలో ఉన్న మనం ఇదెలా సాధ్యం అని కూడా బాబును అడగలేకపోతే ఎలా అని మీడియాను ప్రశ్నించారు . వేరే పార్టీ సింబల్ పై గెలిచిన వాళ్లను అనైతికంగా చేర్చుకుంటున్నారు. పార్టీ ఫిరాయించిన వాళ్ల చేత రాజీనామా చేయించడం లేదు, అనర్హులుగా ప్రకటించడం లేదు. ఇంతకన్నా దిక్కుమాలిన ప్రభుత్వం మరెక్కడా ఉండదని వైఎస్ జగన్ మండిపడ్డారు. 

67 మందిలో 13 మంది పోయినంత మాత్రాన పార్టీకి పెద్దగా వచ్చే నష్టమేమి లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులను గెలిపించేవాళ్లు ప్రజలు. పైన దేవుడు. గత ఎన్నికల్లో  మా పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 45. బాబు కూటమికి 46 చిల్లర. బాబు కూటమికి మాకు మధ్య ఓట్ల తేడా 1.86 శాతం. 5 లక్షల ఓట్ల కన్నా తక్కువ. చంద్రబాబు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశాడు. వాటిని నిలదీస్తున్నామనే ప్రజల స్వరం తొక్కుతున్నాడు. టీడీపీ పాలనలో రైతులు , డ్వాక్రా అక్కచెల్లెమ్మలు, నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ప్రతి చోట బాబు మీద వ్యతిరేకత ఉంది. 

 ఎన్నికలకు ముందు 87,612 కోట్ల రుణాలు మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టాడు. టీవీల్లో ఊదరగొట్టాడు. ఈ రెండేళ్లలోనే వడ్డీ 24 వేల కోట్లు అయ్యింది. బాబు చేసిన రుణమాఫీ రైతులకు వడ్డీలో మూడో వంతు కూడా సరిపోలేదు. డ్వాక్రా మహిళలకు జీరో పర్సంట్ వడ్డీ పోయి రూ.2 వడ్డీలు కడుతున్నారు. ఇంటింటికీ జాబ్ అన్నాడు . ఉద్యోగాలివ్వడం సంగతి దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు ఊడబెరుకుతున్నారు. ఉద్యోగం లేని వారికి నెలకు రూ. 2 వేల  నిరుద్యోగ భతి అన్నారు. ఒక్క పైసా ఇవ్వలేదు. ఇవాళ  కోటి 75 లక్షలు ఇళ్లు నిరుద్యోగ భృతి కోసం ఎదురుచూస్తున్నాయి. ఇళ్లు కట్టిస్తానన్నాడు.  ఒక్క ఇళ్లు కట్టించిన పాపాన పోలేదు. సగంలో ఆగిపోయిన ఇళ్లకు బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు. ఆర్టీసీ, కరెంట్ ఛార్జీల మోత మోగిస్తున్నాడు. బాబు పాలనపై ప్రజలు విసిగిపోయారు.  తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. 

తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు  ప్రజల గొంతు వినపడకూడదని  ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నాడు. చదువుకున్న మనం బాబు చేస్తున్నదాన్ని వ్యతిరేకించకుండా చూస్తు ఊరుకోవడం ఎంతవరకు సబబు అని వైఎస్ జగన్ మీడియాను ప్రశ్నించారు. బాబు కుంభకోణాల చిట్టాకు సంబంధించిన  చంద్రబాబు ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తక కాపీనీ వైఎస్ జగన్ మీడియాకు అందించారు. ఇసుక నుంచి ల్యాండ్ మాఫియా దాకా అన్ని స్కాంలు పుస్తకంలో ఉన్నాయన్నారు. 

రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు వేల ఎకరాలు కొల్లగొట్టాడని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఒక్క అమరావతి స్కామే లక్ష కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. ఎన్నికలయిన వెంటనే రాజధాని అంశం బాబు బుర్రలో ఉన్నా దాన్ని దాచిపెట్టారని మండిపడ్డారు.  ఇక్కడ, అక్కడ అంటూ ప్రజలను మభ్యపెట్టాడు. బాబుకు సంబంధించిన బినామీలు రాజధాని ప్రాంతంలో తక్కువ రేట్లకు భూములు కొనుగోలు చేశారు. మేలో ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి డిసెంబర్ 28 దాకా బాబు ఈవిషయాన్ని దాచిపెట్టారు. అప్పుడు అమరావతిలో రాజధాని అని ప్రకటన చేశాడు. ఇలా చేయడాన్ని ఇన్ సైడర్ ట్రేడింగ్ అనక మరేమంటారని వైఎస్ జగన్ కడిగిపారేశారు. 

రాజధాని ప్రకటన చేశాక బాబు మరో కుంభకోణానికి పాల్పడ్డారు. రాజధాని  చుట్టూ రెండు జిల్లాల్లో జోనింగ్ చేశాడు. వాళ్ల భూములు మాత్రం కమర్షియల్ జోన్ లో పెట్టుకున్నారు. రైతుల భూములు అగ్రికల్చర్ జోన్ లో పెట్టి అమ్ముకునే పరిస్థితి లేకుండా చేశారు. వాళ్ల భూములకు డిమాండ్ వచ్చేలా జోన్ చేయడం. వేరే వాళ్లు అమ్ముకోకుండా నెట్టేయడం. బాబు తన బినామీలను కోటీశ్వరులు చేసేందుకు ఆరాటపడ్డారు. రైతులకు అన్యాయం చేశారు. ఇది మోసం గాక మరేమిటని వైఎస్ జగన్ ప్రశ్నించారు. 

లింగమనేని ఎస్టేట్ కు పది అడుగుల దూరంలో ల్యాండ్ పూలింగ్ ఆగిపోయింది.  చంద్రబాబు లింగమనేని ఇంట్లోనే ఉన్నాడు. ఇది వాళ్లకు లబ్ది చేకూర్చేందుకు కాదా అని కడిగిపారేశారు. ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో రిజిస్ట్రేషన్ లతో సహా ఆధారాలు చూపించాం. ఇంకా లోతుగా పోయి చూస్తే జీపీఎస్ కూడా బయటపడుతుంది. సీబీఐ ఎంక్వైరీ జరిగితే అన్నీ బయటకు వస్తాయి. ఇన్ని స్కాంలతో బాబు అవినీతి డబ్బులు సంపాదిస్తుంటే అడిగే నాథుడు లేడు. 20,30 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొంటుంటే అడిగే దిక్కు లేదు.  కొందరు ఎమ్మెల్యేలు పోతుంటే అదేదో ఘనకార్యమన్నట్లు బాబు సోదర మీడియా ఛానళ్లు చూపిస్తున్నాయి. బాబు అవినీతిపై ప్రశ్నించాల్సింది పోయి...ఎవరూ వెళ్లకముందే వీళ్లు పోతున్నారు, వాళ్లు పోతున్నారని  చూపిస్తున్నారు. ఇంతకన్నా ఘోరం మరొకటి ఉండదని వైఎస్ జగన్ ఫైరయ్యారు.  

చంద్రబాబు కొనుక్కున్న ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ప్రజల్లోకి ఎందుకు తీసుకుపోవడం లేదు. తిరిగి ఓట్లు వేయించే నమ్మకం మీ పాలనపై ఎందుకు లేదని ...బాబును గట్టిగా నిలదీయాలని మీడియాకు సూచించారు. బాబుకు  తనమీద తనకే నమ్మకం లేదని వైఎస్ జగన్ దుయ్యబట్టారు.  కాంగ్రెస్ లో ఉన్నంతవరకు వైఎస్ జగన మంచోడన్నారు. వైఎస్ జగన్ సోనియాను ఎదురించి కాంగ్రెస్ నుంచి 
బయటకు వచ్చినప్పుడు  కేసులు పెట్టారు. కాంగ్రెస్, బాబు కలిసి కేసులు పెట్టారు. వాళ్లు ఆనాడు అధికారంలో ఉన్నా కూడా ఎదురొడ్డి పోరాటం చేశాం. ఎక్కడ రాజీ పడలేదు. ఇంకా చేస్తానే ఉన్నాం. ఇదే చంద్రబాబు ఆయన అవినీతిపై విచారణ జరిపించుకునే దమ్ముందా అని వైఎస్ జగన్ తూర్పారబట్టారు. 

Back to Top