ప్రభుత్వ విద్యను నాశనం చేసింది చంద్రబాబే

నందికొట్కూరు: ప్రభుత్వ విద్యను నాశనం చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని ఎమ్మెల్యే ఐజయ్య ఆరోపించారు. గురువారం పట్టణంలోని స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాథమిక విద్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. దేశానికి ఆయుపట్టు ప్రాథమిక విద్యేనని, అలాంటి విద్యను నిర్వీర్యం చేయడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. ప్రాథమిక పాఠశాలలో పిల్లలు లేరని సాకు చూపించి గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలను ఎత్తివేయడం సిగ్గుచేటన్నారు.  కార్పొరేట్‌ పాఠశాలలను ప్రోత్సహించి ప్రభుత్వ పాఠశాలలను నీరుగార్చడం దారుణమన్నారు. విదేశాల్లోనే ప్రాథమిక విద్యకు మొదటి ప్రాధాన్యతను ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్‌ సీఎం భ్రష్ఠుపట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. బాబుకు చిత్తశుద్ది ఉంటే ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వద్ద రెండు సబ్‌ స్టేషన్‌లు మంజూరైతే విద్యుత్‌శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ఒక్కొక్క పోస్టుకు లక్షలు దండుకుంటున్నారని ఆరోపించారు. ఎంప్లాయీమెంట్‌ కార్యాలయం, నోటిఫికేషన్‌ ద్వారా ఆ సబ్‌ స్టేషన్‌లోని పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. వేల కోట్ల రూపాయలతో నిర్మించిన సచివాలయం, అసెంబ్లీ భవనం కొద్దిపాటి వర్షానికి వెలుచడం నిర్మాణంలో ఏ మేరకు నాణ్యత ఉందో ప్రజలు గమనించాలన్నారు. ప్రతిపక్ష నేత వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఛాంబర్‌ అప్పుడో, ఇప్పుడో కూలేందుకు సిద్ధంగా ఉందని టీవీ ఛానల్‌లో మార్మోమోగుతున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వ నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. 28 సార్లు, 16 విదేశాలు తిరిగి ఏమి సాధించారో శ్వేత పత్రం విడుదల చేయాలని బాబును డిమాండ్ చేశారు.

Back to Top