జగన్ బెయిల్‌ను అడ్డుకునేందుకే బాబు ఢిల్లీ యాత్ర

తిరుపతి, 13 సెప్టెంబర్ 2013:

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిపై తప్పుడు కేసులు బనాయించి జైలులో పెట్టించేలా కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. అందులో భాగంగానే చంద్రబాబు ఇప్పుడు న్యూఢిల్లీ యాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు చంద్రబాబు ఎలాంటి నీచ రాజకీయాలకై‌నా పాల్పడతారని బాబు యాత్ర ద్వారా అర్థం అవుతుందన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో భూమన మాట్లాడారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ వేయగానే చంద్రబాబుకు గజగజ వణుకు వస్తుందని ఎద్దేవా చేశారు. ఆయన బెయిల్‌ను నిలువరించడానికే బస్సు యాత్రను అర్ధంతరంగా ఆపేశారన్నారు.

భవిష్యత్తులో టిఆర్ఎస్ పార్టీ కాంగ్రె‌స్తో కలుస్తుందో లేదో కానీ ‌టిడిపి మాత్రం కలవడం ఖాయమని భూమన ఎద్దేవా చేశారు. శ్రీ వైయస్ జగ‌న్ బెయి‌ల్ విషయాన్ని న్యాయస్థానమే ని‌ర్ణయిస్తుందని కానీ తమ పార్టీ ఎవరితో లాలుచీ పడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగ‌న్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణను అడ్డుకునేందుకు గత మూడేళ్లుగా చంద్రబాబు కాంగ్రెస్తో చీకటి ఒప్పందం కుదుర్చుకు‌ని కుట్రలు చేస్తున్నారని భూమన ఆరోపించారు‌. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, సహకార ఎన్నికల్లో వైయస్ఆర్ పార్టీ విజయావకాశాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారని భూమన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు‌ నాయుడు చేస్తున్న నీచ రాజకీయాలను గమనిస్తున్నారని భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ వేసిన ప్రతిసారీ తనకు అనుకూలంగా ఉన్న ఇంగ్లీషు మీడియాతో సహా ప్రసార, పత్రికా మాధ్యమాల ద్వారా ఆయనకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారని భూమన దుయ్యబట్టారు. యెల్లో మీడియా ద్వారా అసత్య కథనాలు వండి వార్పించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ కుమ్మక్కయ్యాయంటూ కుటిల విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

అంటే.. శ్రీ జగన్మోహన్‌రెడ్డిగారు జీవితకాలం జైలులోనే ఉండాలన్నది చంద్రబాబు లక్ష్యమా? అని భూమన ప్రశ్నించారు. నిబంధనలను అనుసరించి శ్రీ జగన్‌కు రావాల్సిన బెయిల్‌ను రానివ్వకుండా ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చంద్రబాబు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే చంద్రబాబు, కాంగ్రెస్‌ కుట్రలకు బలైపోయిన శ్రీ‌ జగన్ 16 నెలలుగా అక్రమంగా జైలు నిర్బంధంలో ఉన్నారన్న విషయాన్ని ఆయన తెలిపారు. చట్టప్రకారం 90 రోజుల్లో బెయిల్‌ రావాల్సి ఉండగా ఏడాదిన్నర కాలంగా శ్రీ జగన్‌ జైలులోనే మగ్గిపోవడానికి ప్రధాన కారకుడు చంద్రబాబే అన్నది జగమెరిగిన సత్యం అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీతో కలిసిపోయి అడుగడుగునా కుమ్మక్కు రాజకీయాలు చేసింది చంద్రబాబు నాయుడే అని భూమన దుయ్యబట్టారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటైన తొలినాళ్ళలో జరిగిన శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పూర్తిగా కలిసిపోయి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడించడానికి కుట్రలు చేసిందీ చంద్రబాబే అన్నారు. చిత్తూరు జిల్లాలో టిడిపి అభ్యర్థిని నిలబెట్టకుండా కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓట్లు వేయించిన మాట వాస్తవం కాదా చంద్రబాబూ అని నిలదీశారు. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో కూడా వైయస్ఆర్ కాంగ్రెస్‌ ప్రాబల్యాన్ని తగ్గించడానికి ఎన్నో రకాల నీచపు ఎత్తుగడలు చేసింది చంద్రబాబు కాదా? అన్నారు. చీకట్లో చిదంబరాన్ని కలుస్తున్నది మీరు కాదా? చంద్రబాబూ అన్నారు. 2012 అక్టోబర్‌లో టిడిపి ఎంపి నామా నాగేశ్వరరావు చిదంబరాన్ని కలిసిన తరువాత శ్రీ జగన్‌ ఆస్తులపై ఈడీ అటాచ్‌మెంట్‌ వచ్చిన మాట వాస్తవం కాదా? అన ప్రశ్నించారు.

జెడ్‌ ప్లస్‌ భద్రతా వలయంలో ఉండాల్సిన చంద్రబాబు ఢిల్లీ వెళితే ఎవరికీ కనిపించకుండా మాయమైపోవడం దేనికని భూమన నిలదీశారు. చీకట్లో చిదంబరాన్ని కలిసి‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి ప్రాబల్యాన్ని అడ్డుకోవడానికి కలిసి పనిచేయాలని అవగాహన పెట్టుకున్నది చంద్రబాబు అన్నారు.‌ చంద్రబాబు నాయుడి పొలిటికల్ బిజినెస్‌ బినామీ అయిన సుజనా చౌదరిని అడుగడునా కుయుక్తులు, కుట్రలకు వినియోగిస్తున్న మాట ఢిల్లీలో కోడై కూస్తున్నది నిజమా కాదా? అని ప్రశ్నించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top