చంద్రబాబు పాలనకు ఇది రెండో భాగం

మాచర్ల:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సో దరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో బుధవారం సాగిన పాదయాత్రలో ఆమె ఏమన్నారంటే... ‘1999లో ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్ని వాగ్దానాలు చేశారు. మహిళలకు బంగారు మంగళ సూత్రాలు ఇస్తానన్నారు. పుట్టిన ప్రతి ఆడబిడ్డకూ రూ.5 వేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామనీ, ఆ ఆడబిడ్డ చదివినంత వరకు ఉచితంగా చదివిస్తామనీ మాటిచ్చారు.  ముఖ్యమంత్రయ్యాక చంద్రబాబు.. కరెంటు బిల్లుల వసూళ్లకు ప్రత్యేక పోలీసు స్టేషన్లు పెట్టారు. రైతులను చిత్ర హింసలకు గురిచేశారు. ఇంట్లో మగవాళ్లు లేకపోతే మహిళలను స్టేషన్లలో కూర్చోబెట్టారు. ఈ అవమానం భరించలేక... అప్పుల బాధలు తట్టుకోలేక నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంత మంది నా అక్కా చెల్లెమ్మల మంగళ సూత్రాలు తెంపిన పాపం ఈ చంద్రబాబు నాయుడుది. ఇప్పుడున్న కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన కూడా దానికి కొనసాగింపు మాదిరిగా ఉంది. ఇది చంద్రబాబు పాలన రెండో భాగం. కరెంట్ బిల్లులు కట్టడానికి తాళిబొట్లు తాకట్టుపెట్టాల్సి వస్తోందని మహిళలు వాపోతున్నారు’ అని శ్రీమతి షర్మిల వివరించారు.  పేటసన్నెగండ్ల గ్రామ శివారులోని సమీప తోటల్లో మిరపకాయలు ఏరుతున్న రైతులు, కూలీలు శ్రీమతి షర్మిల చెంతకు వచ్చారు.

కరెంటు ఉండదు.. బిల్లులు మాత్రం వేలల్లో
     ‘అమ్మా... కరెంటు బిల్లు కట్టలేకున్నామమ్మా... రెండు నెలలకు కలిపి రూ. 6 వేలు వచ్చింది.. నిన్నయితే అర గంట కూడా కరెంటు లేదమ్మా' అంటూ వాపోయారు. బిల్లు కట్టకపోతే పోలీసు స్టేషన్లకు పిలిపించి నిలబెడుతున్నారన్నారు. రైతు బతికి లాభం లేదమ్మా.. ఇంత పురుగుల మందు తాగి చావడమే మేలని  జూలకల్లు గ్రామానికి చెందిన పాశం శ్రీనివాసరెడ్డి కన్నీళ్లు పెట్టారు. అక్కడే ఉన్న రైతు కూలీలు నాలనాగమ్మ, వెంకట లక్ష్మి కల్పించుకొని ‘కరెంటు బిల్లు కట్టాలంటే తాళిబొట్లు తాకట్టు పెట్టాల్సి వస్తోంది’ అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా షర్మిల పై వ్యాఖ్యలు చేశారు.

వైయస్‌తోనే నా భాగ్యం పోయింది..
     పెద్ద అగ్రహారం గ్రామానికి చెందిన గాదెబోయిన వెంకట కోటయ్య అనే రైతు తన పొలంలోని పసుపు మొక్కలను షర్మిలకు చూపిస్తూ.. ‘అమ్మా... నాన్నగారు ఉన్నప్పుడు కూడా పసుపు పెట్టిన, నాడు క్వింటాల్ రూ. 16 వేలు పలికింది. రాజశేఖరరెడ్డితోనే నా భాగ్యం, కాలం రెండూ పోయాయి. ఇప్పుడు క్వింటాల్ పసుపునకు రూ. 4 వేలకు మించి లేదమ్మా.. ఎకరానికి రూ. 1.10 లక్షలు ఖర్చు చేసి నాలుగు ఎకరాలు పెట్టినా. కరెంటు రోజుకు మూడు గంటలు కూడా రాదు. డబ్బులు పెట్టి తడి పెట్టుకున్నా. ఎకరాకు 15 క్వింటాళ్ల పసుపు వెళ్తుంది. రూ. 60 వేలు వస్తాయమ్మా... మిగిలిన రూ. 50 నష్టపోయినట్టే.. రూ. 3 వడ్డీకి అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టినా. మొత్తం రూ. 2 లక్షలు నష్టపోయా. సర్కారు ఆదుకోకుంటే ఆత్మహత్య తప్ప ఇంకో దారిలేదమ్మా’’ అని వాపోయాడు. అధైర్య పడొద్దని, జగనన్న త్వరలోనే వస్తారని షర్మిల ఆయనకు ధైర్యం చెప్పారు.

      బుధవారం 76వ రోజు ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర కారంపూడి శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి పేటసన్నెగండ్ల, జూలకల్లు గ్రామాల మీదుగా సాగి పందిరివారి పాలెం చేరింది. ఇదే గ్రామం శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. బుధవారం మొత్తం 13.7 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇప్పటివరకు మొత్తం 1,072.9 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ కారంపూడి చేరుకొని పాదయాత్రలో ఉన్న షర్మిలను కలిసి పలకరించారు. యాత్రలో షర్మిల వెంట నడిచిన నేతల్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, ఆర్‌కే, అంబటి రాంబాబు, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, నన్నపునేని సుధ, దేవళ్ల రేవతి, పి.గౌతంరెడ్డి, బండారి సాయిబాబు మాదిగ ఉన్నారు.

తాజా వీడియోలు

Back to Top