చంద్రబాబును ఎందుకు విచారించరు?

పాలకొల్లు (ప.గో.జిల్లా),

28 మే 2013: కాంగ్రెస్‌ పార్టీని వీడినందుకే జగనన్నను ఏడాది కాలంగా ఆర్థికంగా, రాజకీయంగా, మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. ఒకే ఒక్క ప్రజా నాయకుడిని ప్రజల్లో ఎదుర్కొనే దమ్మూ ధైర్యం లేని ఈ కాంగ్రెస్‌, టిడిపి నాయకులు అక్రమంగా సిబిఐతో అరెస్టు చేయించి ఏడాది పూర్తయిందని శ్రీమతి షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. జగనన్న జననేతగా ఎదుగుతుంటే, మహానేత రాజన్న సిసలైన వారసుడిగా ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకుంటుంటే ఓర్వలేని చంద్రబాబు, కాంగ్రెస్‌ నాయకులు కలిసి, ఆ రెండు పార్టీలకూ ఇక మనుగడ ఉండదని తెలిసి, జగనన్న జనాల్లోనే ఉంటే ఆ రెండూ దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందన్న భయంతో కుట్రలు పన్నారని ఆరోపించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత, తన సోదరుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని అక్రమంగా నిర్బంధించినందుకు నిరసనగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంగళవారంనాడు దీక్ష చేసిన శ్రీమతి షర్మిల సాయంత్రం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జగనన్న జనంలో ఉంటే దుకాణాలు సర్దుకోవాలనే భయంతోనే కాంగ్రెస్‌, టిడిపి నాయకులు కుట్రలు చేసి జైలులో పెట్టించారని నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటే జగనన్న ఏ మంత్రో, ముఖ్యమంత్రో అయి ఉండేవారని, పార్టీని వదిలినందుకే ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారని గులాం నబీ ఆజాద్‌ చెప్పిన మాటలను శ్రీమతి షర్మిల ప్రస్తావించారు. కాంగ్రెస్‌ పార్టీని వదిలినందుకే జగనన్న మీద కేసులు పెట్టారని, జైలులో నిర్బంధించారని ఆజాద్‌ మాటలతోనే సుస్పష్టం అయిందన్నారు. జగనన్న ఏ తప్పూ చేయకుండానే ఏడాది కాలంగా ప్రజలకు దూరం చేసి జైలులో పెట్టారని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. సిబిఐని ప్రయోగించి శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ప్రజల నుంచి దూరం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు.

మహానేత వైయస్‌ పాదయాత్రతో, ఆయన వ్యక్తిగత ఇమేజితో, ఆయన పథకాలతో రెండుసార్లు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వైనాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్‌ పార్టీకి డాక్టర్‌ వైయస్‌ఆర్‌ ముప్పై ఏళ్ళు సేవ చేశారన్న విషయాన్ని పక్కన పెట్టి, ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఇంద్రుడు, భగీరథుడు అని పొగిడిన వాళ్ళే ఆయన కొడుకుకి అక్రమంగా లబ్ధి చేకూర్చారంటూ టిడిపితో కుమ్మక్కై ఎన్నో అవినీతి ఆరోపణలు చేశారని శ్రీమతి షర్మిల విమర్శించారు. మహానేత పేరును దోషిలా ఎఫ్‌ఐఆర్‌ చేర్చారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన కొడుకు ఒక్కడ్ని చేసి కుట్రలు పన్ని వంద కేసులు పెట్టారని దుమ్మెత్తిపోశారు.

ఐదేళ్ళ పాలనలో ప్రతి ఒక్కరికీ మేలు చేయాలని మహానేత వైయస్‌ తపనపడ్డారని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. ప్రజలను కొల్లగొట్టి తన బిడ్డలకు లబ్ధి చేయాలని ఆయన ఏనాడూ అనుకోలేదన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రజలకు ప్రయోజనం కలగాలనే నిబంధనల ప్రకారమే డాక్టర్‌ వైయస్‌ఆర్‌ జిఓలు ఇచ్చారన్నారు. స్వార్ధంతో ఆలోచన చేసే మనసు కాదు రాజశేఖరరెడ్డిది అన్నారు. మహానేత వైయస్‌ది పదిమందికీ సహాయపడే మనస్తత్వం అన్నారు.

డాక్టర్‌ వైయస్‌ సిఎంగా ఉన్న ఐదేళ్ళలో ఒక్క రోజు కూడా జగనన్న సచివాలయంలో అడుగుపెట్టలేదని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. ఒక్క రోజు కూడా సిఎం క్యాంపు కార్యాలయంలోకి వెళ్ళలేదన్నారు. ఒక్క మంత్రికి గాని, అధికారికి గానీ ఈ పని చేసిపెట్టండని ఫోన్‌ చేసి అడగలేదన్నారు. అలాంటి జగనన్నను, అంత మంచి మనసున్న రాజశేఖరరెడ్డిని అప్రతిష్ట పాలు చేయడానికి, ప్రజల ముందు దోషిగా నిలబెట్టడానికి, ప్రజల మనసుల్లో నుంచి వారిని తుడిచివేయడానికి చంద్రబాబు, కాంగ్రెస్‌ నాయకులు కలిసి కుట్రలు పన్నారని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. ప్రజల్లో వైయస్‌ కుటుంబంపై ఉన్న ముద్రను తుడిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్‌ చేతిలో సిబిఐ ఓ కీలుబొమ్మ అని అది ఏది చేయమంటే అదే చేస్తుందని, ఎలా ఆడమంటే అలా ఆడుతుందని కోల్‌గేట్‌ కుంభకోణం సహా ఎన్నో సార్లు రుజువైందని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు. జగనన్న విషయంలో కాంగ్రెస్‌ పార్టీ సిబిఐని ఉసిగొల్పిందని, వందల మంది అధికారులతో దాడులు చేయించిందని, కేసులు పెట్టించిందని ఆరోపించారు. ఆఖరికి జైల్లో కూడా పెట్టించిందని నిప్పులు చెరిగారు. మహానేత వైయస్‌ హయాంలో కొన్ని భూములు, అనుమతులు పొందిన వారు వాటికి ప్రతిఫలంగా జగనన్న సంస్థలలో పెట్టుబడులు పెట్టారని కాంగ్రెస్‌, టిడిపి నాయకులు కలిసికట్టుగా ఆరోపణలు చేశారన్నారు.

ఆ ఆరోపణ నిజమా? కాదా? ప్రభుత్వం నుంచి అధికార దుర్వినియోగం జరిగిందా? లేదా? అని దర్యాప్తు చేయాల్సిన సిబిఐ ఉద్దేశ పూర్వకంగా ఆ విషయాన్ని పక్కనపెట్టి జగనన్నను మాత్రమే టార్గెట్‌ చేయడాన్ని శ్రీమతి షర్మిల తప్పుపట్టారు. జగనన్న సంస్థలు, ఆస్తుల మీద, ఆయనకు సంబంధించిన అందరి మీద దాడుల మీద దాడులు చేసిందన్నారు. అరెస్టులు చేసిందని, చార్జిషీట్ల మీద చార్జిషీట్లు పెట్టిందన్నారు. సిబిఐ దాఖలు చేయబోయే చార్జిషీట్లలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి మాత్రమే ఎ 1 గా, విజయసాయిరెడ్డి ఎ 2 గా ఉంటారని దర్యాప్తు మొదలు కాక ముందే ఒక సిబిఐ అధికారి ప్రకటన చేయడాన్ని శ్రీమతి షర్మిల ప్రస్తావించారు. దర్యాప్తు ప్రారంభం కాకుండానే దర్యాప్తుతో సంబంధం లేకుండానే దోషులను నిర్ధారించిందంటే ఈ కేసును సిబిఐ ఎలా నడపదలచుకున్నదో సుస్పష్టం అయిందన్నారు. వివాదాస్పద జిఓలకు సంబంధించి కోర్టు ఇచ్చిన నోటీసుల్లో జగనన్న 52వ ప్రతివాది అని ఆమె చెప్పారు. కాంగ్రెస్‌ మంత్రులు, అధికారులు ఒకటి నుంచి 15వ స్థానాల్లో ఉన్న ప్రతివాదులన్నారు. ఈ జిఓలు సక్రమం అని ఈ ప్రభుత్వం ఆనాడే చెప్పి ఉంటే అసలు ఈ కేసు నిలబడేదే కాదన్నారు. కానీ ఆ రోజు జగనన్నను ఎలాగైనా ఇరికించాలని కుట్ర చేశారని ఆరోపించారు.

ఈనాడుకు చెందిన వంద రూపాయల ఒక్కో  షేరును రూ.5.30 లక్షలకు అమ్ముకుంటే సిబిఐకి అభ్యంతరం లేదని శ్రీమతి షర్మిల తెలిపారు. కాని సాక్షి పది రూపాయల షేరును రూ. 350కి అమ్మితే క్విడ్‌ ప్రో కో అని పరిగణించిందని దుయ్యబట్టారు. సాక్షి షేర్లను జగనన్న అక్రమంగా అమ్ముకున్నారని సిబిఐ అంటోందన్నారు. సాక్షి షేర్లు నిజంగానే క్విడ్‌ ప్రో కో అయితే.. అక్రమంగా వచ్చిన డబ్బుని ఎవరైనా ఇలా అందరికీ కనబడేలా వాళ్ళను సాక్షిలో వాటాదారులుగా చేరుస్తారా? అని ఆమె ప్రశ్నించారు. సిబిఐ ఇలాంటి ఆరోపణలు ఎన్నో చేసిందన్నారు. కానీ ఒక్క దానికి కూడా రుజువు చూపించలేకపోయిందని ఎద్దేవా చేశారు. జగనన్న బయటే ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తాడన్న సాకు చెప్పి బెయిల్‌ రాకుండా అడ్డుకుంటూనే ఉందన్నారు. సాక్షులను ప్రభావితం చేయాలని జగనన్న ప్రయత్నించారా? అని అడిగితే సిబిఐ సమాధానం చెప్పలేదన్నారు. మీ సాక్షులను మీరు రక్షించుకోలేరా? ఆ సామర్ధ్యం మీకు లేదా అని నిలదీస్తే దానికి సిబిఐ వద్ద సమాధానం లేదన్నారు. జగనన్న అడ్డు తొలగించేందుకే ఈ కుట్రలన్నీ అని శ్రీమతి షర్మిల ఆరోపించారు. సిబిఐ కావాలనే విచారణను సంవత్సర కాలం పొడిగించిందని విమర్శించారు. ప్రభుత్వానికి మద్దతిస్తున్న సిబిఐని కాంగ్రెస్ పంజరంలో చిలక అనాలా? పెరట్లో కుక్క అనాలా? లేక గుంటనక్క అనాలా అని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు.

ఎన్నో అవినీతి ఆరోపణలున్న చంద్రబాబును ఎందుకు విచారించడం లేదని సిబిఐని శ్రీమతి షర్మిల సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నా‌రు కనుకే సిబిఐని ఆయనపైకి ఉసిగొల్పడం లేదన్నారు. ఆయనపై ఏ విచారణలు ఉండవన్నారు. ఒక్క అవినీతి కేసుపైనైనా విచారణ జరిగితే చంద్రబాబు ఈపాటికి ఎప్పుడో జైలులో ఉండేవారని ఆమె అన్నారు. ఎమ్మార్‌ కేసులో ఎవరెవరినో కాకుండా భూములను కారుచౌకగా అప్పగించిన చంద్రబాబును ఎందుకు విచారించరని నిలదీశారు. సిఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తన హెరిటేజ్‌ సంస్థకు అక్రమంగా ఎంతో లబ్ధి చేకూర్చుకున్నా ఎందుకు దర్యాప్తు చేయడంలేదని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని టిడిపి కార్యాలయానికి భూమి కేటాయింపులో కూడా చంద్రబాబు ఎంతో అవినీతికి పాల్పడ్డారని ఆమె తెలిపారు. దాని మీద చంద్రబాబును ఎందుకు విచారించడంలేదన్నారు. మేనేజ్ చేయడంలో చంద్రబాబు ‌పిహెచ్‌డి సంపాదించారని ఎద్దేవా చేశారు. చీకట్లో చిదంబరాన్ని కలిసి కేసులు లేకుండా చేసుకున్నారని ఆరోపించారు. ఇంత ప్రజా వ్యతిరేక ప్రభుత్వం కూలిపోకుండా రక్షణ కవచంలా నిలబడ్డారని ఎద్దేవా చేశారు. ఎన్ని కుట్రలు చేసినా జగనన్నను ఆపలేరని అన్నారు.

Back to Top