<br/>అమరావతి: అగ్రిగోల్డ్ యాజమాన్యంతో అమీతుమీకి సిద్ధమైన బాధితులు ‘ఛలో హాయ్‌ల్యాండ్’ పేరుతో ముట్టడి కార్యక్రమం చేపడుతుండటంతో.. గుంటూరు అర్బన్ జిల్లాలో బుధవారం ఉదయం నుంచి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అగ్రిగోల్డ్ వినియోగదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు బాధితులు హాయ్‌ల్యాండ్‌ను ముట్టడించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తాము తలపెట్టిన హ్యాయ్‌ల్యాండ్ ముట్టడి కార్యక్రమానికి ఆటంకం కల్పించవద్దని బాధితులు కోరుతుండగా.. మరోవైపు ముట్టడిని భగ్నం చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసులను ప్రయోగిస్తోంది. ముట్టడిలో పాల్గొనేందుకు వస్తున్న బాధితులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. మరో వైపు అగ్రి గోల్డు బాధితులకు అండగా నిలిచిన వైయస్ఆర్ సీపీ నాయకులను గృహ నిర్బంధం చేశారు. వైయస్ఆర్‌సీపీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, తదితరులను హౌస్ అరెస్టు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇంటి వద్ద, పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మొహరించడంతో పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు.