ఉద్యమ ఉద్ధృతితో కేంద్రం దిగొస్తుంది: విజయమ్మ

గుంటూరు 21 ఆగస్టు 2013:

తాము చేపట్టిన ఉద్యమాన్ని ప్రజలు మరింత తీవ్రతరం చేయాలనీ, దానివల్ల రాష్ట్ర విభజన అంశంపై కేంద్రం తప్పకుండా దిగొస్తుందనీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన తీరుకు నిరసనగా ఆమె గుంటూరులో  చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారం మూడో రోజుకు చేరింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీమతి విజయమ్మ తొలుత ప్రజలకు రక్షా బంధన్ శుభాకాంక్షలను తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన మంచిది కాదని స్వర్గీయ ప్రధాని ఇందిర గాంధీ ఏనాడో చెప్పిన విషయాన్ని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. మొదటి ఎస్సాఆర్సీ ప్రకారం భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఆమె సమర్థించారన్నారు. తన  ప్రధాన మంత్రులు చెప్పిన అంశాలనే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పాటించకపోవడం శోచనీయమని చెప్పారు.
టీడీపీ, బీజేపీ, సిపీఐ తాము రాసిన లేఖలను వెనక్కి తీసుకుంటే సీడబ్ల్యూసీ కూడా తన నిర్ణయాన్ని పునస్సమీక్షిస్తుందని మంత్రులు చెప్పడాన్ని శ్రీమతి విజయమ్మ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు తెలంగాణ ఏర్పాటు నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీనామా చేసి, తన ఎమ్మెల్యేలచేత కూడా చేయించి ఉంటే ప్రస్తుత పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని ఆమె  పేర్కొన్నారు. తెలంగాణ నిర్ణయాన్ని వ్యతిరేకించే కాంగ్రెస్ ఎంపీలు కూడా రాజీనామా చేసుంటే బాగుండేదన్నారు. 2009లో 135మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు కాబట్టి అప్పట్లో కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుందనీ, ఇప్పుడూ అలా చేసుంటే అదే ఫలితం వచ్చేదనీ ఆమె అభిప్రాయపడ్డారు.

హాట్ లైన్ ఉన్నది బాబుకూ టెన్ జన్ పథ్ మధ్య..

తమకూ, కాంగ్రెస్ పార్టీకీ మధ్య హాట్ లైన్ ఉందని చంద్రబాబు చెప్పడంపై శ్రీమతి విజయమ్మ మండిపడ్డారు. హాట్ లైన్ ఉన్నది తమకూ కాదనీ, చంద్రబాబుకూ, టెన్ జన్ పథ్‌కు మధ్యని ఆమె చెప్పారు. చంద్రబాబు తనతో మాట్లాడినట్లు కేంద్ర మంత్రి చిదంబరం పార్లమెంటులోనే చెప్పడం దీనికి సాక్ష్యమని తెలిపారు. తనపై కేసులు లేకుండా చంద్రబాబు ఎలాంటి నాటకాలాడుతున్నారో అందరికీ తెలుసన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ దొంగ నాటకాలాడుతోందని కాంగ్రెస్, టీడీపీలు నిందించడాన్ని శ్రీమతి విజయమ్మ తప్పు పట్టారు. రాజకీయంగా కుమ్మక్కయ్యి ఆ రెండు పార్టీలు నడుస్తున్నాయని ఆరోపించారు.

తెలంగాణ విభజన నిర్ణయాన్ని ప్రకటించాక చంద్రబాబు ఒక్కసారి కూడా దాన్ని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ విమర్శించలేదన్నారు. ఎంతసేపూ దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ గారిని, జగన్ బాబునీ తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కాపాడటం కోసం ఎన్ని రకాలుగా ప్రయత్నించిందీ అందరికీ తెలిసిందేనన్నారు. అవిశ్వాసానికి చంద్రబాబు మద్దతు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి రాష్ట్రానికి వచ్చేది కాదన్నారు.  అందరికీ న్యాయం జరగాలని కోరడం కాదనీ, రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలనీ ఆమె సూచించారు.  ప్రజా ప్రతినిధులు రాజీనామా చేస్తే కేంద్రం కచ్చితంగా దిగొస్తుందన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు ప్రజల బాగోగులు పట్టడం లేదన్నారు. ఇన్ని కోట్ల మంది ప్రజలు ఆందోళనలు చేస్తున్నా... ఎన్జీవోలు పెన్ డౌన్ చేసినా ప్రభుత్వంలో చలనం లేకుండా ఉందని శ్రీమతి విజయమ్మ ధ్వజమెత్తారు. మనం ఉద్యమాన్ని ఉద్ధృతం చేసే కొద్దీ బలం పెరుగుతుందనీ, కాంగ్రెస్, టీడీపీల ఎమ్మెల్యేలు రాజీనామా చేసే పరిస్థితి ఉత్పన్నమవుతుందనీ ఆమె స్పష్టంచేశారు.

సమన్యాయం చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కోరుతూ వచ్చిందని చెప్పారు. రెండు ప్రాంతాలకు  న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని కోరామన్నారు. విభజన చేసే బాధ్యత గానీ, నిర్ణయాన్ని గానీ ఎవరి చేతుల్లోకీ తీసుకోకూడదని కూడా తమ పార్టీ సూచించిందన్నారు.

ఉమ్మడి చెక్ పవర్ తొలగింపు అన్యాయం
సర్పంచులకు ఉమ్మడి చెక్ పవర్‌ను తొలగించడం అన్యాయమని  మండిపడ్డారు. చెక్ పవర్ తొలగిస్తూ జిఓ నెంబరు 385ను విడుదల చేయడాన్ని ఆమె తప్పు పట్టారు. పంచాయతీలకు నిధులు, విధుల కేటాయింపు ఎంతో ముఖ్యమని ఆకాంక్షించిన రాజీవ్ గాంధీ ఆశయాలకు దీనితో తూట్లు పొడిచారని చెప్పారు. ఈ అంశంపై అన్ని పార్టీలూ పోరాడాల్సిన అవసరముందని సూచించారు.

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే పరిస్థితి నెలకొందన్నారు. మహానేత చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకంలో ప్రస్తుతం 139 వ్యాధులను, దీని పరిథి నుంచి ప్రైవేటు ఆస్పత్రులను తొలగించారన్నారు. గుండె శస్త్ర చికిత్సలో వాడే స్టెంట్‌కు ప్రభుత్వం చెల్లించే ధర చాలనందున ఆస్పత్రులు ఆపరేషన్లు చేయడం నిలిపివేశాయన్నారు. మహానేత హయాంలో పింఛన్లను శాచ్యురేషన్ విధానంలో మంజూరు చేసేవారనీ, ఊరిలో ఎవరైనా చనిపోతే అధికారులే కొత్తవారిని ఆ స్థానంలో పింఛను జాబితాలో చేర్చేవారనీ శ్రీమతి విజయమ్మ తెలిపారు. ప్రస్తుతం కొత్తగా ఒక్క పింఛను ఇవ్వలేదనీ, ఒక్క ఇల్లు కట్టించిన పాపాన పోలేదనీ, ఒక్క రేషన్ కార్డు సైతం మంజూరు చేయలేదని ఆమె విమర్శించారు. నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. పంటలు వేసుకునే తరుణంలో ఎరువులు దొరకడం లేదనీ, విత్తనాల కొరత నెలకొందనీ చెప్పారు. సచివాలయానికి వెడితే ఒక్క మంత్రి కూడా అందుబాటులో ఉండటం లేదన్నారు. ముఖ్యమంత్రిని చూస్తే సామాన్య ప్రజలు ప్రస్తావించిన అంశాలను ప్రస్తావిస్తుండడం విచారకరమని చెప్పారు.

తాజా ఫోటోలు

Back to Top