అకాల వర్షాలు..బాధితుల వెతలు

తుఫాన్  సాయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం
స్పందించని కేంద్రం...టీడీపీ సర్కార్ మొద్దునిద్ర

ఆంధ్ర ప్రదేశ్ లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. భారీ వర్షాలతో 20 రోజులుగా ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందకపోవడంతో వరద బాధితులు నరకయాతన అనుభవిస్తున్నారు. పంటలు నష్టపోయి, ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకొని ఆర్తనాదాలు పెడుతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. అధికారులు గానీ, పాలకులు గానీ ఎక్కడా బాధితులను పట్టించుకోవడం లేదు. తూతూమంత్రంగా ఎక్కడో ఓ దగ్గర పర్యటించడం మినహా ఆదుకోవాలన్న ఆలోచనే చేయడం లేదు.

అకాల వర్షాల వల్ల రూ.3,819 కోట్లు నష్టం జరిగినట్లు అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం తక్షణం సాయం కింద రూ.1,000 కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరింది.  తమిళనాడు రాష్ట్రానికి ఆగమేఘాల మీద రూ.939 కోట్ల వరద సాయం ప్రకటించిన కేంద్రం... రాష్ట్ర నివేదికపై ఇప్పటి వరకు స్పందించ లేదు. తుఫాన్ లు, కరవుతో రైతాంగం విలవిలలాడుతుంటే పరిహారాన్ని అడగడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఏడాది అయినా హుద్ హుద్ తుఫాన్ కు సంబంధించి ఇప్పటివరకు పెద్దగా నిధులు విదిల్చిందే లేదు. ‘హుద్‌హుద్’ తుపాను నష్టానికి కేంద్రం కేవలం 3% నిధులు మాత్రమే ఇచ్చినా...రాష్ట్ర ప్రభుత్వం నిలదీయలేకపోయింది. ఈసారైనా నిధులు తీసుకొచ్చి రైతులను ఆదుకుంటుందంటే ..మొద్దు నిద్ర వహిస్తోంది. 
 

ఇప్పటికే ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ వరద ప్రాంతాల్లో వారంరోజుల పాటు విస్తృతంగా పర్యటించారు. నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప, ఉభయగోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున అక్కడ పర్యటించారు. దెబ్బతిన్న పంటలు, ఇళ్లు పరిశీలించారు. ఈసందర్భంగా వారి కష్టాలు చూసి జననేత చలించిపోయారు. తిండితిప్పలు లేక కట్టుబట్టులతో రోడ్డున పడ్డ బాధితులకు అండగా నిలిచారు. ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. పనులకు వెళ్లలేని పరిస్థితుల్లో తినడానికి తిండిలేక, ఉండడానికి గూడు లేక బాధితులు అల్లాడుతున్నా...ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. బాధితులకు తక్షణ సాయం కింద రూ.5 వేలు, సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం బాధితులను ఆదుకోవడంలో చోద్యం చూస్తోంది. ప్రకృతి విపత్తును కూడా చంద్రబాబు రాజకీయం చేయడం బాధాకరమని రైతుసంఘాలు, విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Back to Top