ఆర్నెల్ల పదవికోసం ప్రయోజనాల తాకట్టు

హైదరాబాద్ 06 ఆగస్టు 2013:

రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనే ఆవేదనతో ప్రజలంతా ఉద్యమాలు చేస్తున్నారనీ, ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారనీ, మరికొందరు ఎప్పుడు ఏమవుతుందనే ఆదుర్దా చెందుతున్నారనీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి చెప్పారు.  రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ఇద్దరు వ్యక్తులు మాత్రం కనపించుట లేదు.. అనే ప్రకటన ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు.  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మొదటివారు కాగా... ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇందులో రెండో వారని ఆమె పేర్కొన్నారు. ఇద్దరూ సీమాంధ్ర, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన వారై ఉండి కూడా నిర్లిప్తంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు సమాధానం చెప్పడం కూడా చేయలేదన్నారు. నోరెత్తి మాట్లాడితే తన పదవికే ప్రమాదం వస్తుందేమోననే బెంగతో ముఖ్యమంత్రి ఉన్నారని విమర్శించారు. చంద్రబాబుకు ఆయనకుండే సమస్యలు ఆయనకున్నాయి. కేసుల నుంచి తప్పించుకోవడానికీ, ఆస్తులను కాపాడుకోవడానికి మౌనంగా ఉండక తప్పనిసరి పరిస్థితి ఆయనదన్నారు. వీరిద్దరి వైఖరి వల్లా సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నా కూడా మౌనం వహిస్తున్నారన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు పార్లమెంటులో బొమ్మల్లా కూర్చున్నారని చెప్పారు. వారి ప్రాంతాల గురించి వారు నోరెత్తి మాట్లాడలేకపోవడం బాధాకరమన్నారు. ఏ ఒక్క మంత్రి కూడా సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం లేదన్నారు.

పళ్ళంరాజు వ్యాఖ్యను తప్పు పట్టిన శోభ

ప్రకటన వచ్చేవరకూ  సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమ తీవ్రత ఇంతగా ఉంటుందని తెలియలేదని కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజు వ్యాఖ్యానించడాన్ని శోభా నాగిరెడ్డి తప్పుపట్టారు. తీవ్రత ఉండదని ఆయన ఎలా అనుకున్నారని ప్రశ్నించారు. మరోసారి మంత్రి పదవి ఉండదనీ, ఎంపీ టికెట్ రాదనే భయం మీకు గానీ... సీమాంధ్ర ప్రజలకు అలాంటి భయాలేవీ లేవని ఆమె స్పష్టంచేశారు. సెంటిమెంటు ఒకప్రాంతానికే ఉంటుందని భావించారా అని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. సామాన్య ప్రజలకు ఇది చాలా ఎక్కువనీ, వారెవరికీ భయపడరనీ పేర్కొన్నారు.  

ఏకపక్ష నిర్ణయం కారణంగానే ఉద్యమాలు
రాష్ట్రానికి సమన్యాయం కాకుండా ఏకపక్ష నిర్ణయం చేసిన అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. ఈ కారణంగానే సీమాంధ్రలో ఉద్యమాలకు కాంగ్రెస్  కారణమైందని వివరించారు. ప్రజలను ఇంత ఆవేదనకు గురిచేసిన ఎమ్మెల్యేలు, మంత్రులు  రాజీనామాలు,  ఉద్యమాలు చేస్తున్నారని అంటూ ఇదేం వైఖరని ప్రశ్నించారు.

టీడీపీ విధానమూ అదే
టీడీపీ విధానం కూడా అలాగే ఉందన్నారు.  పార్లమెంటులో ఆ పార్టీ ఎంపీలు డ్రామాలు నడిపిస్తున్నారని చెప్పారు.  పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు... సీడబ్ల్యూసీ తెలంగాణ ప్రకటన చేసిన మరుసటి రోజు మీడియా ముందుకొచ్చి, రాజధాని కోసం నాలుగైదు లక్షల కోట్లు డబ్బులిమ్మన్నారని అడిగారన్నారు. అదే పార్టీ ఎంపీలు రాజధానిని సమైక్యంగా రాజధాని అభివృద్ధి చేసుకుందామంటున్నారనీ వారి ద్వంద్వ వైఖరికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.  తెలంగాణ ప్రకటన రాక ముందు ఇలా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆమె చెప్పారు.

ఆర్నెల్ల పదవికోసం ఆత్మాభిమానం తాకట్టు
తనను కలవవచ్చిన ఎంపీలు.. ఎమ్మెల్యేలతో చెప్పుకునేదేమైనా ఉంటే  హైలెవెల్ కమిటీతో చెప్పుకోండని సోనియా గాంధీ చెప్పడం చూసి చాలా బాధ వేసిందన్నారు.  ఆర్నెలలు ఉండే  పదవుల కోసం తెలుగు జాతి పరువును వీరు తాకట్టు పెట్టారని శ్రీమతి శోభా నాగిరెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన అంశంలో సోనియాను ఎందుకు నిలదీయకుండా, ఎందుకు పాకులాడుతున్నారని అడిగారు. ఆంటోనీ, దిగ్విజయ్ అనే  ఇద్దరు వ్యక్తులు మన రాష్ట్ర దశ, దిశలను నిర్దేశిస్తారా?  అలా చేయడానికి వారెవరని నిలదీశారు. రాష్ట్ర భవిష్యత్తును ఇద్దరి చేతిలో పెట్టడం తెలుగు జాతిని అవమానించడం కాదా? అని అడిగారు. ఇలా చెప్పడం ద్వారా కేవలం ఒక్క ఎంపీని కాదు ఆయనకు ఓటేసిన లక్షలాదిమందిని అవమానించినట్లేనని పేర్కొన్నారు. ఏకపక్షంగా చేయడానికి ఇది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారం కాదన్నారు. సమన్యాయం జరగకుండా... తెలంగాణ ఇస్తామంటే సమస్య తీరదని స్పష్టంచేశారు. నదీ జలాలు, విద్యుత్తు.. తదితర సమస్యలను  తీర్చకుండా విభజిస్తే చాలా సమస్యలొస్తాయనీ, దీనివల్ల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందనీ ఆమె ఆందోళన వ్యక్తంచేశారు.

జగన్ ఎదుగుతారనే ఇరుప్రాంతాల మధ్య చిచ్చు
తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి  తిరుగులేని నాయకునిగా ఎదుగుతారనే భయంతో   దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ సెంటిమెంటు ఓటును చెడగొట్టే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఇరు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టిందని ఆరోపించారు.  రాహుల్ గాంధీని ప్రధాని చెయ్యాలనే ప్రగాఢ ఆకాంక్ష దీని వెనుక ముఖ్యోద్దేశమన్నారు. తెలంగాణ మంత్రులు... సీమాంధ్రులకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతుండడాన్ని  శోభా నాగిరెడ్డి హేళన చేశారు.  మిమ్మల్ని అడుక్కునే పరిస్థితుల్లో సీమాంధ్ర ప్రజలు లేరని పేర్కొన్నారు.  రాజధానిపై తెలంగాణ ప్రాంతీయులకు ఎంత హక్కుందో... సీమాంధ్రులకూ అంతే హక్కుందని ఆమె స్పష్టంచేశారు.  మీ దయాదాక్షిణ్యాల మీద సీమాంధ్ర ప్రజలు బతకడం లేదనే విషయాన్ని గుర్తెరగాలన్నారు.   

ఆ రెండు రాష్ట్రాల అభివృద్ధి గురించి చెప్పండి
సీమాంధ్ర ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తామన్న దిగ్విజయ్ వ్యాఖ్యను శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్ని ఎంత అభివృద్ధి చేశారో చూశామనీ, దీనికి తగిన మూల్యాన్ని కాంగ్రెస్ చెల్లిస్తుందనీ ఆమె హెచ్చరించారు. ప్రధాన ప్రతిపక్షం ఉందనే విషయాన్ని మరిచేలా చంద్రబాబు వ్యవహహార శైలి ఉందని విమర్శించారు. సీమాంధ్ర ప్రాంతానికి ఇంత అన్యాయం జరుగుతుంటే బాధ లేకుండా ప్రశాంతంగా కనిపిస్తున్నారన్నారు. ఎప్పుడూ వేలు చూపించి బెదిరించే  ధోరణిలో మాట్లాడే చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని తనదైన శైలిలో ఎందుకు బెదిరించడం లేదదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత రాయలసీమకే చెందినవారనీ, ప్రజలే మిమ్మల్ని నాయకులు చేశారనే విషయాన్ని మరిచారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ వైఖరికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని చెప్పారు.

అభద్రతను తొలగించేందుకే షర్మిల వ్యాఖ్యలు

తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలపై టీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన విమర్శపై శోభ తీవ్రంగా స్పందించారు. శ్రీమతి షర్మిలపై కేసీఆర్ ఏం విమర్శలు చేశారో గుర్తుచేసుకోవాలని సూచించారు. కేసీఆర్ మాటలకు సమాధానంగానే శ్రీమతి షర్మిల మాట్లాడారని స్పష్టంచేశారు. కేసీఆర్ ఎంతైన రెచ్చగొట్టవచ్చా... అవమానకరంగా మాట్లాడిన విషయం గుర్తు రాలేదా.. తెలుగు తల్లి విగ్రహం గురించి ఆయన 'ఎవరి తల్లి అని విమర్శించిన సంగతి మరిచారా అని ప్రశ్నించారు. జాగో భాగో నినాదం తప్పు కాదా అంటూ నిలదీశారు. సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలని కేసీఆర్ అన్న అంశాన్ని ఉద్దేశించి శ్రీమతి షర్మిల మాట్లాడారన్నారు. ఇక్కడున్న ప్రజలకు అభద్రతా భావాన్ని కలిగిస్తున్న సందర్భంలో శ్రీమతి షర్మిల  సీమాంధ్రులకు భరోసా కల్పించేలా మాట్లాడారని ఆమె పేర్కొన్నారు.

రాయలసీమను విడగొట్టడమనే వాదన తగదనీ, సమైక్యంగా ఉండాలంటే ఏంచేయాలో డిమాండ్ పెడితే సహకరిస్తామని శోభ చెప్పారు. రాయలసీమ ఇంతవరకూ ఎన్నో రకాలుగా నష్టపోయిందనీ, ఎన్నో వదులుకున్నామనీ... ఇప్పటికైనా  ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నామనీ తెలిపారు.

Back to Top