కొత్త రాజధాని నిర్మాణానికి నిధులెలా ఇస్తారు?

హైదరాబాద్ :

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొత్త రాష్ట్రం లేదా రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని భావిస్తే అది అవివేకమే అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు, వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ.‌ సోమయాజులు వ్యాఖ్యానించారు. ‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి రెవెన్యూ ఆదాయం కన్నా రెవెన్యూ లోటు ఎక్కువైంది. జీతాలు ఇచ్చేందుకే కేంద్రం దగ్గర డబ్బులు లేనప్పుడు కొత్త రాష్ట్ర ఏర్పాటుకు డబ్బులెక్కడి నుంచి తెచ్చిస్తారు?’ అని ఆయన ప్రశ్నించారు. శనివారం ‘ది హిందూ సెంటర్’ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై నిర్వహించిన సదస్సులో భాగంగా ‘వనరుల పంపిణీ’ అనే అంశంపై చర్చలో సోమయాజులు మాట్లాడారు. హైదరాబాద్‌ను ‘ఎకనామిక్ పవ‌ర్‌ హౌస్’గా తీర్చిదిద్దిన తరుణంలో కొత్త రాష్ట్రంలో విద్య, పారిశ్రామిక సౌకర్యాలను ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు.

‌ఐఐటిలు కట్టగలరు కానీ డిఆర్‌డిఎల్ లాంటి రక్షణ, పౌర అధ్యయన సంస్థలను ఏర్పాటు చేయగలరా? అని‌ సోమయాజులు ప్రశ్నించారు. ఒక వైపున ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించే విధానంతో కేంద్రం ముందుకెళ్తుంటే... ఆంధ్ర ప్రాంతంలో జాతీయ స్థాయి ప్రభుత్వ రంగ సంస్థలను ఎలా ఏర్పాటు చేస్తారని అన్నారు. ఉమ్మడి రాజధాని అనే అంశంలో తెలంగాణలో అంతర్భాగంగా ఉండే హైదరాబాద్ ఆదాయాన్ని ఇరు ప్రాంతాలకు పంచే అవకాశం ఉందా? అని అడిగారు.

హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ తరహాలో పారిశ్రామిక ప్యాకేజీలు ఇవ్వకపోతే సీమాంధ్రలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎవరూ ముందుకు రారు‌ అని సోమయాజులు అన్నారు. సీమాంధ్రలోని ‌చిట్టచివరి జిల్లాలకు నీళ్లు ఎక్కడి నుంచి వెళ్తాయి? వివిధ ట్రిబ్యునల్సు కేటాయించిన దాంట్లో 50-60 శాతం నీరే ఆ ప్రాంతానికి వెళుతోందని, ఇప్పుడు కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతాలకు నీళ్లు వెళ్లే పరిస్థితే ఉండదు’ అని చెప్పారు.

Back to Top