విభజన నిర్ణయం ఉపసంహరించాల్సిందే: విజయమ్మ

హైదరాబాద్ 20 సెప్టెంబర్ 2013:

రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఉపసంహరించాల్సిందేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ స్పష్టంచేశారు.  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం ఉదయం అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టేందుకు  వెడుతుండగా పోలీసులు అరెస్టు చేసి, గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించిన సంగతి తెలుసుకుని ఆమె అక్కడికి వెళ్లారు. అరెస్టయిన  ఎమ్మెల్యేలకు మద్దతుగా శ్రీమతి వైయస్ విజయమ్మ  గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధర్నా చేస్తున్న ఎమ్మెల్యేల అరెస్టు దారుణమని విమర్శించారు. ఎమ్మెల్యేలను పోలీసులు ఇష్టం వచ్చినట్లు కొట్టారని శ్రీమతి విజయమ్మ ఆరోపించారు. అరెస్టులను  చూస్తుంటే మనం ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు.

ఎటువంటి షరతులు లేకుండా తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినందువల్లే రాష్ట్రం  రావణకాష్టంలా మారిందని శ్రీమతి వైయస్ విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్, టీడీపీ పార్టీలే కారణమన్నారు. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోందనీ, సమ్మెలో విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారనీ చెప్పారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని... విభజనపై చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విభజనకు ముందు ఒకలా.... తర్వాత మరోలా మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు.  కొత్త రాజధానికి రూ.4,5 లక్షల కోట్లు అవసరమవుతాయని చంద్రబాబు చెప్పారనీ, అంటే  విభజన ప్రకటనను చంద్రబాబు సమర్థించినట్లేనని తెలిపారు.   సీడబ్ల్యూసీలో గంటసేపు చర్చించి కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకుందని.... అప్పట్లో రాష్ట్రవిభజనపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న.... కాంగ్రెస్ ఇప్పుడు కూడా వెనక్కి తీసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు. విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ తాను, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్ష చేశామనీ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ రాష్ట్రపతిని కూడా కలిసిన విషయాన్ని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. రాష్ట్రాన్ని విడదీయ వద్దంటూ శ్రీమతి షర్మిల బస్సుయాత్ర చేశారని ఆమె పేర్కొన్నారు.  చంద్రబాబునాయుడు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని శ్రీమతి వైయస్ విజయమ్మ డిమాండ్ చేశారు.

తాజా వీడియోలు

Back to Top