సమస్యలకు కేంద్రమే జవాబు చెప్పాలి

గుంటూరు, 21 ఆగస్టు 2013:

రాష్ట్ర విభజన విషయంలో ఏర్పడిన చిక్కు సమస్యలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి వైయస్ విజయమ్మ అన్నారు. సమన్యాయం చేయాలంటూ గుంటూరులో విజయమ్మ చేస్తున్న సమరదీక్ష బుధవారం మూడవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సర్పంచ్లకు చె‌క్ పవ‌ర్‌ను నియంత్రిస్తే గ్రామాభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

ఎంతటి వారైనా ప్రజాగ్రహానికి దిగిరాక తప్పదని శ్రీమతి విజయమ్మ అన్నారు. ప్రజల కోరికను ఎవరైనా మన్నించాల్సిందే అన్నారు. ఉద్యోగాలు, హైదరాబాద్, నీటి విషయాలను ఏమి చేస్తామన్నది ప్రభుత్వం వివరణ ఇవ్వాలని శ్రీమతి విజయమ్మ డిమాండ్‌ చేశారు. భావోద్వేగాలను చూసి విభజన నిర్ణయం తీసుకోకూడదని దివంగత ప్రధాని ఇందిరాగాంధీ చెప్పిన వైనాన్ని ఆమె గుర్తుచేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు కలిసి ఉండాలని ఆనాడు ప్రధమ ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారన్నారు.

మిగులు నీటితో చేపట్టిన ప్రాజెక్టులను ఏమి చేస్తారో జవాబు చెప్పాలన్నారు. మన ఇరు ప్రాంతాలూ ఒకే రాష్ట్రంగా ఉన్నప్పటికీ ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుల కారణంగా ఇప్పటికే కృష్ణా డెల్టాకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదన్నారు. మధ్యలో తెలంగాణ మరో రాష్ట్రంగా ఏర్పాటైతే ఇక కింద ఉండే వారికి మంచినీళ్ళు కూడా వచ్చే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తంచేశారు.

పంచాయతీలు బలపడాలంటే ఆర్టికల్‌ 73 ప్రకారం నిధులు, విధులు కేటాయించాలని‌ దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ చెబితే.. ఇప్పుడు ప్రభుత్వం సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ తీసేయడమేమిటని శ్రీమతి విజయమ్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. సీమాంధ్రలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చి ప్రజాగ్రహం పెల్లుబుకుతుందని కాంగ్రెస్ పార్టీ ఊహించలేదని ‌శ్రీమతి విజయమ్మ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎం.పి.లు కూడా రాజీనామాలు చేసి ఉంటే విభజన ప్రకటన వచ్చి ఉండేది కాదన్నారు.

రాష్ట్రాన్ని తానే అభివృద్ధి చేశానంటున్న చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని శ్రీమతి విజయమ్మ సూటిగా ప్రశ్నించారు. తొమ్మిదేళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబు రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు. ఆ రోజుల్లో కరెంటు చార్జీలు, బస్సు చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచడం ఎవరికి తెలియనిది అన్నారు. ఒక్క ప్రాజెక్టు కట్టారా? ఒక్క పరిశ్రమనైనా ఏర్పాటు చేశారా? అని చంద్రబాబును ఆమె ప్రశ్నించారు. హైటెక్‌ సిటీ కట్టి ఐటి రంగాన్ని అభివృద్ధి చేశానని చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్నారని అయితే, అంతకు ముందు మూడవ స్థానంలో ఉన్న ఆ రంగం ఆయన హయాంలో ఐదవ స్థానంలోకి వెళ్ళిపోయిందని గుర్తుచేశారు. ఆత్మగౌరవ యాత్ర చేస్తానంటున్న చంద్రబాబు వంచనను ప్రజలు మరిచిపోలేదని ఈ సారి కూడా ఆయనకు సరైన జవాబే చెబుతారని శ్రీమతి విజయమ్మ హెచ్చరించారు. ఆయన సంతకం చేయబట్టే ఈ రోజు విభజన నిర్ణయం జరిగిందని దుయ్యబట్టారు.

‌జగన్‌బాబుకు, 10 జన్‌పథ్‌కు హాట్లై‌న్ లింకే ఉంటే త‌న కుమారుడు జైలులో ఉండేవారు కాదని చంద్రబాబు, టిడిపి నాయకుల ఆరోపణలకు శ్రీమతి విజయమ్మ ఘాటుగా సమాధానం ఇచ్చారు.‌ ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో సంబంధాలు ఉంటే తమ కుటుంబం ఎందుకింత బాధపడేదని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు చిదంబరం మధ్య హాట్‌లైన్ సంబంధ‌ం ఉందని ఆయనే స్వయంగా పార్లమెంటులో ఒప్పుకున్నారని శ్రీమతి విజయమ్మ అన్నారు. సోనియాకు చంద్రబాబుకు మధ్యే హాట్‌లైన ఉందన్నారు. చంద్రబాబుది రెండు కళ్ళ సిద్ధాంతమైతే... కాంగ్రెస్‌ పార్టీది రెండు కాళ్ళ సిద్ధాంతమని చెబుతున్నారని శ్రీమతి విజయమ్మ ఎద్దేవా చేశారు. ఈ సిద్ధాంతాలు, పొలిటికల్‌ ఫిక్సింగ్‌లు అన్నీ చంద్రబాబుకే తెలుసన్నారు. తన మీద నమోదైన కేసులపై విచారణ జరగకుండా ముందుగా స్టే తెచ్చుకున్నారని, అందు కోసమే ఎఫ్‌డిఐ బిల్లుకు అనుకూలంగా వ్యవహరించారు, రెండుసార్లు అవిశ్వాసం పెట్టినప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కాపాడారని ఆరోపించారు. మార్చిలో అవిశ్వాసానికి చంద్రబాబు మద్దతు ఇచ్చి ఉంటే ఆ నాడే ప్రభుత్వం పడిపోయేదని, ఇప్పుడు రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చి ఉండేదే కాదన్నారు.

నిరుపేదలకు ఉచితంగా మంచి వైద్యం అందించాలన్న ఉదాత్త ఆశయంతో మహానేత డాక్టర్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని పెడితే.. దాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం నీరుగారుస్తోందని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. ఆరోగ్యశ్రీలో 139 రోగాలను తొలగించారని, గుండెకు స్టెంట్‌ వేయించుకోవడానికి ఇచ్చే రూ.60 వేలను రూ. 40 వేలకు తగ్గించడంతో వైద్యులు చికిత్సలు నిలిపివేసిన దుస్థితి వచ్చిందన్నారు. పంటలు వేసుకునే కాలంలో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఉందని విచారం వ్యక్తంచేశారు. ప్రభుత్వం, ప్రతిపక్షం కూడా ప్రజలను మరిచిపోయాయని ఆరోపించారు.

ఎవరు వీధి నాటకాలు ఆడుతున్నారో ప్రజలే గమనిస్తున్నారని పిసిసి అధ్యక్షుడు బొత్స వ్యాఖ్యలపై శ్రీమతి విజయమ్మ విరుచుకుపడ్డారు. పోరాటాల‌తోనే వైయస్ఆర్ కాంగ్రెస్‌ పుట్టిందన్నారు. మహానేత హయాంలో ఏ ఒక్కరూ పోరాటం చేయాల్సి పని లేదన్నారు. ఆయన మరణించిన మూడవ నెల నుంచే పన్నుల బాదుడు, చార్జీల మోత మొదలైందన్నారు. జగన్‌బాబు బయట ఉన్నప్పుడు అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు చేసిన వైనాన్ని శ్రీమతి విజయమ్మ ప్రస్తావించారు. చంద్రబాబుకు ఏ పోరాటమూ చేసిన చరిత్ర లేదన్నారు.

భావోద్వేగాలకు లోనై ఏ ఒక్కరూ ఆత్మార్పణ చేసుకోవద్దని ఈ సందర్భంగా శ్రీమతి విజయమ్మ ఉద్యమకారులకు విజ్ఞప్తి చేశారు. శాంతియుతంగా పోరాడి విజయం సాధించిన మహాత్మా గాంధీ తీరులోనే డిమాండ్లను నెరవేర్చుకుందామని ఆమె సూచించారు. కడుపు మండి ఆందోళన చేస్తున్న ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించి బాధించడం తగదని ప్రభుత్వానికి శ్రీమతి విజయమ్మ హితవు చెప్పారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులందరినీ ఆదుకుంటుందని ఆమె హామీ ఇచ్చారు.

తాజా ఫోటోలు

Back to Top