టిడిపి అక్రమాలతోనే కేంద్రం నిధులు ఆపేసింది

– నీరు చెట్టుపై ఉన్న శ్రద్ధ ఉపాధి కూలీలపై లేదు
– వైయస్సార్‌ సీపీ నాయకులు ధ్వజం

సోమందేపల్లి: రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులలో ఎక్కువ శాతం అక్రమాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు మంజూరు చేయడం లేదని, మండల వైయస్సార్‌సీపీ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం స్ధానిక వెంకటరత్నం కాంప్లెక్స్‌ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తుంగోడు సర్పంచ్‌ నారాయణరెడ్డితోపాటు ఇతర నాయకులు మాట్లాడుతూ ....అధికార పార్టీ నాయకులు ప్రతిపక్షంపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని, ఉపాధి నిధులు రాకుండా తాము అడ్డుకుంటున్నట్లు పేర్కొనడం భావ్యం కాదన్నారు.  టిడిపి నాయకుల జేబులు నింపడానికి రాష్ట్ర పథకాల్లోకి ఉపాధి నిధులను మళ్లించారని, అందులో భారీ ఎత్తున చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై కేంద్రం ఆరాతీసి రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదన్నారు. నీరు చెట్టు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణాల కోసం కోట్లాది రూపాయలు అనవసరంగా ఖర్చు చేస్తున్నారుగాని, ఆ నిధులతో ఉపాధి కూలీలకు బకాయి బడ్డ వేతనాలు మంజూరు చేసివుంటే బాగుండేదన్నారు. టిడిపి నాయకులు చేస్తున్న ఆరోపణలలో ఎలాంటి వాస్తవాలు లేవని వాటిని ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో వైయస్సార్‌సీపీ నాయకులు కొత్తపల్లి శ్రీనివాసులు, ఎల్లారెడ్డి, ఆదినారాయణరెడ్డి, అబ్దుల్, శుభాష్‌నాయక్, రామాంజినేయులు, బాబు, శ్రీనివాసులు, వెంకటేషులు, నాగరాజునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.
Back to Top