సీబీఐ తీరుపై 'సుప్రీం' విచారణ జరపాలి!

గురుబట్లగూడెం (పశ్చిమ గోదావరి జిల్లా) 12  మే  2013: ఒక్క బొగ్గు స్కామ్‌లోనే కాక మిగతా కుంభకోణాల్లోనూ సీబీఐని కేంద్ర ప్రభుత్వం ఎలా ఉపయోగించుకుందో, ఇంకెన్ని కేసులను ఇలాగే తారుమారు చేసిందో తేలవలసి ఉందని శ్రీమతి వైయస్ షర్మిల అన్నారు. ఈ విషయాన్ని నిగ్గు తేల్చడానికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సమగ్ర విచారణకు ఆదేశించాలని ఆమె డిమాండ్ చేశారు. గత కొన్నేళ్లుగా పలు సందర్భాలలో సీబీఐని ప్రభుత్వం ఉపయోగించుకున్న వైనంపై దర్యాప్తు జరిపించాలంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. అలాగే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి కేసులో సీబీఐ చిలుకను ఎవరు పలికిస్తున్నారో, ఎవరు వెనుక ఉండి ఆడిస్తున్నారో కూడా తేల్చాలని ఆమె అన్నారు. మున్ముందు అమాయకులను వేధించకుండా ఉండేందుకుగాను ప్రభుత్వం సీబీఐని వాడుకుంటున్నతీరుపై  సమగ్ర దర్యాప్తు జరపాలని ఆమె కోరారు.

'మరో ప్రజాప్రస్థానం'లో భాగంగా ఆదివారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం గురుబట్లగూడెంలో జరిగిన ఒక భారీ బహిరంగసభలో శ్రీమతి షర్మిల ప్రసంగించారు. 222 కిలోమీటర్ల మేర ఖమ్మం జిల్లాలో పాదయాత్ర ముగించుకున్న శ్రీమతి షర్మిల నేడు పశ్చిమ గోదావరి జిల్లాలోకి అడుగుపెట్టారు. 13 నియోజకవర్గాలలో 275 కిలోమీటర్ల మేర ఆమె పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేయనున్నారు. 2003లో సరిగ్గా ఇదే రోజున (మే 12) మహానేత రాజశేఖర్ రెడ్డిగారి 'ప్రజాప్రస్థానం'  చింతలపూడి నియోజకవర్గంలోని గురుబట్లగూడెం చేరుకుందనీ, ఇప్పుడు 'మరో ప్రజాప్రస్థానం' కూడా పదేళ్ల తర్వాత సరిగ్గా ఇదే రోజున ఇక్కడికి చేరుకోవడం ఆశ్చర్యమూ, ఆనందమూ కలిగిస్తోందనీ శ్రీమతి షర్మిల జనం హర్షధ్వానాల మధ్య వ్యాఖ్యానించారు.

సభలో సీబీఐ తీరును ఎండగట్టిన శ్రీమతి షర్మిల గడిచిన సంవత్సరాల్లో ప్రభుత్వం  ఇంకెన్ని కేసులను తారుమారు చేసిందీ తేలాలన్నారు.

"ఎందరిని వేధించారో తేలాలి. సీబీఐ పంజరంలో చిలుకేనని స్వయంగా సీబీఐ డైరెక్టరే చెప్పారు. బొగ్గుస్కామ్‌లో న్యాయశాఖ మంత్రి సీబీఐ నివేదికను తారుమారు చేశారు. ఒక్క బొగ్గు కుంభకోణంలోనే కాదు, ప్రతి విషయంలోనూ ఇదే జరుగుతూ వస్తుంది" అని ఆమె అన్నారు. జగనన్న కేసులో సీబీఐ చిలుకను ఎవరు పలికిస్తున్నారో, ఎవరు ఆడిస్తున్నారో నిగ్గు తేలాలి. శ్రీ జగన్మోహన్ రెడ్డి కేసులో సీబీఐని ఎవరెవరు, ఎంతవరకు ప్రభావితం చేశారో, ఎంతమంది జోక్యం చేసుకున్నారో తేలాలి...సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని వైయస్ఆర్ సీపీ కోరుతోంది. భవిష్యత్తులో అమాయకులను ఇలాగే వేధించకూడదంటే, సీబీఐని ప్రభుత్వం వాడుకుంటున్న తీరుపై విచారణ జరగాలి..." అని ఆమె పేర్కొన్నారు.

రాజశేఖర్ రెడ్డిగారిలోని విశ్వసనీయతను మళ్లీ ప్రజలు జగనన్నలో చూశారు కనుకనే రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని భావిస్తున్నారు.  ఒక సారి మాట ఇస్తే ప్రాణంపోయినా దానిని నిలుపుకోవాలన్న వైయస్ మాటలను ఆచరణలో చూపించిన జగనన్నను ప్రజలు ఆదరిస్తున్నారు. జగనన్న ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటే తమ దుకాణాలు మూతబడతాయని భయపడిన కాంగ్రెస్, టీడీపీలు సీబీఐని వాడుకుని జగనన్నను జైలుపాలు చేశాయి" అని ఆమె విమర్శించారు. సీబీఐ జగనన్నపై ఎన్నో ఆరోపణలు చేసినా ఒక్కదానికీ ఆధారాలు చూపలేదన్నారు. 

"జగనన్నను దోషి అని జైలులో పెట్టలేదు. కేవలం సాక్షులను ప్రభావితం చేస్తారనే జైలులో ఉంచారు. జగనన్న బయట ఉన్నప్పుడు ఏ సాక్షినైనా ప్రభావితం చేశారా? మరి అదే చార్జిషీటులో ఉన్న మంత్రులను ఎందుకు అరెస్టు చేయలేదో సీబీఐ సమాధానం చెప్పాలి. హోం మంత్రి కూడా చార్జిషీటులో ఉన్నారు కదా? సాక్ష్యాలను తారుమారు చేయగలిగే అవకాశం పుష్కలంగా ఉన్న హోంమంత్రిని ఎందుకు అరెస్టు చేయలేదో సీబీఐ సమాధానం చెప్పాలి" అని ఆమె నిలదీశారు. సీబీఐ, ఈడీలు కేవలం కాంగ్రెస్ కోసమే పని చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. 

"దోషి అని నిర్ధారించకుండానే జగనన్నను సంవత్సరం జైలులో పెట్టారంటే శిక్ష వేసినట్లు కాదా? ఏ చట్టంలో ఉంది ఇలా? తీరా కేసు ముగిసి నిర్దోషి అని తేలితే జగనన్న జైలులో కోల్పో.యిన  జీవితాన్ని ఈ కుట్రదారులు తిరిగి ఇవ్వగలరా ?" అని ఆమె ప్రశ్నించారు.

"జగనన్నను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం వీరికి లేదు. అందుకే సీబీఐ చాటున దాగి కుట్రలకు పాల్పడ్డారు. నిజమైన కుట్రదారులు కాంగ్రెస్, టీడీపీ, సిబీఐయేనని ప్రజలు తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అది మరెంతో దూరం లేదు.." అని శ్రీమతి షర్మిల అన్నారు.

రాష్ట్రంలో ప్రజావ్యతిరేక ప్రభుత్వం ఉందనీ, చంద్రబాబు దన్నుతో కిరణ్ కుమార్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారనీ ఆమె దుయ్యబట్టారు. 

"రాష్ట్రంలో ఎక్కడా కరెంట్ లేదు. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికి ఉంటే వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత  విద్యుత్తు వచ్చి ఉండేది...ఈ ప్రభుత్వం సరఫరా చేస్తున్న కరెంట్ వ్యవసాయ అవసరాలకు సరిపోవడం లేదు. సగానికి సగం దిగుబడి తగ్గిపోయిందని రైతులు వాపోతున్నారు. వేలాది పరిశ్రమలు మూతబడి లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. లేని కరెంటుకు బిల్లులు మాత్రం బారెడు వస్తున్నాయి. కరెంటు నిల్లు, బిల్లులు ఫుల్లు అన్నట్లుగా ఉంది పరిస్థితి" అని శ్రీమతి షర్మిల ఆక్షేపించారు. చంద్రబాబు  అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రభుత్వం పక్షాన నిలిచి అది పడిపోకుండా కాపాడారనీ అందుకే ప్రభుత్వం ప్రజలను వేధిస్తున్న పాపంలో చంద్రబాబుకీ భాగం ఉందనీ ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అన్ని చార్జీలూ పెరిగిపోయాయనీ. ఆర్టీసీ చార్జీలు మూడుసార్లు పెరిగాయనీ, 30 వేల కోట్ల రూపాయల మేరకు ప్రభుత్వం ప్రజలపై కరెంట్ చార్జీల భారం మోపిందనీ, రిజిస్ట్రేషన్ చార్జీలూ పెరిగాయనీ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు, శ్రీ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి...ఈ ముగ్గురు ముఖ్యమంత్రుల్లో ఎవరి పరిపాలనలో రాష్ట్రం కళకళలాడిందో చిన్నపిల్లలను అడిగినా చెబుతారని ఆమె అన్నారు. చంద్రబాబు హయాంలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆమె గుర్తు చేశారు. ప్రతి ఏటా కరెంట్ చార్జీలు పెంచుతానంటూ ప్రపంచబ్యాంకుతో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారని ఆమె ఆరోపించారు. రెండెకరాలతో జీవితం మొదలుపెట్టిన చంద్రబాబు దేశవిదేశాల్లో ఆస్తులు కూడబెట్టారన్నారు. 1999 లో బంగారు తాళిబోట్లు, ఆడపిల్లలకు సైకిళ్లూ ఇస్తానన్న చంద్రబాబు తన వాగ్దానాలను నిలుపుకోలేదన్నారు. చంద్రబాబుకు మాట నిలుపుకోవడమన్నది ఈ జన్మలో అర్థం కాదన్నారు. ప్రస్తుతం ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు హయాంను తలపించేట్లుగా ఉందన్నారు. దివంగత వైయస్ అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసి ఒక్క రూపాయి కూడా ఏ చార్జీనీ పెంచలేదని శ్రీమతి షర్మిల గుర్తు చేశారు.


Back to Top