బాబు సచ్ఛీలుడైతే సీబీఐ ఎంక్వైరీ వేయాల్సిందే

మైసూరారెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం
స్వలాభం కోసం పార్టీ మారుతూ తమపై అభాండాలా
చంద్రబాబు అవినీతిపై పుస్తకం రిలీజ్ చేశామనే మైసూర నాటకం
రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలి ఎమ్మెల్యేలను కొంటున్నావ్
రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నావ్ బాబుః పెద్దిరెడ్డి

న్యూఢీల్లీః  వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  మైసూరారెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధ్యక్షులు వైఎస్ జగన్ పై మైసూరారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల మండిపడ్డారు. చంద్రబాబు అవినీతిపై వైఎస్ జగన్ ఢిల్లీలో  పుస్తకం విడుదల చేయగానే....టీడీపీ పథకం ప్రకారం మైసూరారెడ్డి చేత లెటర్ రాయించినట్లుందని దుయ్యబట్టారు. అపరిచితుడంటూ మైసూరారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయనకే వర్తిస్తాయన్నారు. ఆర్నెళ్లుగా పార్టీ ఆఫీసుకు కూడా రాకుండా..మైసూరారెడ్డి మా ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చేందుకు అందరికీ ఫోన్లు కొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఢిల్లీలో విలేకరుల సమావేశంలో పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మైసూరారెడ్డి లేఖలో చెప్పుకోవాల్సింది ఏమీ లేదన్నారు. వైఎస్ జగన్ కు డబ్బు యావ ఉందని మైసూరారెడ్డి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. డబ్బు యావ మైసూరారెడ్డికి ఉంది కాబట్టే అవసరానికి అనుగణంగా  అన్ని పార్టీలు మారుతున్నారని ఎద్దేవా చేశారు. మైసూరారెడ్డి సిమెంట్ కంపెనీకి మైనింగ్ లీజులు, బ్యాంక్ గ్యారంటీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడం వల్లే మైసూరారెడ్డి ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. రాయలసీమ పరిరక్షణ ఉద్యమానికి వైఎస్ జగన్ మద్దతివ్వలేదనడం అవాస్తవమన్నారు. చంద్రబాబు ఎంతసేపు అమరావతి జంపం చేస్తూ రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నాడని తాము బయట, అసెంబ్లీలో ఎన్నో సార్లు పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు.

వైఎస్ జగన్ పెద్దలను ఎంతో గౌరవిస్తారని, అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.  మైసూరారెడ్డి తన సీనియారిటీకి తగిన విధంగా మాట్లాడితే బాగుండేదన్నారు. రాజకీయ కారణాలతో వెళితే వెళ్లుగానీ అభాండాలు వేయడం తగదని మైసూరారెడ్డికి హితవు పలికారు. నాలుగేళ్ల ముందు పార్టీలో చేరినప్పుడు వైఎస్ జగన్ గురించి , ఆయన కుటుంబం, తండ్రి గారి గురించి మీకు తెలియదా అని ప్రశ్నించారు.  లేని విషయాలను ఉన్నట్లు మాట్లాడడం దురదృష్టకరమన్నారు. ఆర్నెళ్ల నుంచి మీరేం కార్యక్రమం చేశారని అడుగుతున్నాం. పార్టీ ఆఫీస్ కు కూడా రాకుండా.... టీడీపీ అనుకూలంగా శాసనసభ్యులను కూడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని మైసూరారెడ్డిపై మండిపడ్డారు. 

చంద్రబాబు మీరు బీజేపీకి మద్దతిస్తున్నారు. కేంద్రంలో భాగస్వామ్యులుగా ఉన్నారు. మీరు రాష్ట్రానికి ఏమేరకు నిధులు తెచ్చారని పెద్దిరెడ్డి కడిగిపారేశారు. ఇంతవరకు పోలవరం డబ్బులు తేలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి లోటు బడ్జెట్ నిధులు తెచ్చుకోలేదు. పోలవరం డబ్బులు పట్టిసీమకు పెట్టి అనవసరంగా రూ.1700కోట్లు వృథా చేశారని కేంద్రం కరెక్ట్ అకౌంట్స్ ఇవ్వమని అడుగుతోంది.  బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మీరు గానీ, మీ ఆర్థికమంత్రి గానీ ఢిల్లీకి వచ్చి  ఎవరినైనా కలిశారా బాబు. ఇబ్బందుల్లో ఉన్నాం నిధులు కావాలి అని ఎవరినైనా అడిగే ప్రయత్నం చేశారా అని బాబును నిలదీశారు.  రాష్ట్రంలో  కూర్చొని ఏపీకి బ్రాండ్ ఇమేజ్ తెస్తాం, నంబర్ వన్ చేస్తానని మాట్లాడుతున్నాడు. నిధులు తీసుకురావడం మానేసి ప్రగల్భాలు పలుకుతున్నాడని బాబుపై ఆగ్రహించారు. 

హైటెక్ సిటీ పేరుతో చంద్రబాబు తన అనుచరులకు ఏవిధంగా లబ్ది చేకూర్చాడో...ఏపీలో కూడా రాజధాని పేరుతో అమరావతిని అలానే చేస్తున్నారని ఫైరయ్యారు. చంద్రబాబు సఛ్చీలుడైతే తన అవినీతిపై  సీబీఐ విచారణ వేయించుకొని నిరూపించుకోవాలన్నారు.  గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన హయాంలో వచ్చిన ఆరోపణలపై  సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో నిధులు లేక అల్లాడుతున్నాం. అభివృద్ధి సజావుగా జరగడం లేదు. 24 గంటలు అమరావతి అని కలవరిస్తున్నావ్. రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలి ఎ్మమెల్యేలను కొంటున్నావ్. అసలు  రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నావని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. 
Back to Top