లీకేజీపై సీబీఐ విచారణ జరపాలి

  • అసెంబ్లీలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌
  • చర్చకు అనుమతించని స్పీకర్‌
  • సభలో ప్రతిపక్ష సభ్యుల ఆందోళన
  • సభ పది నిమిషాలు వాయిదా
  • ఏపీ అసెంబ్లీ: పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై గురువారం అసెంబ్లీ అట్టుడికింది. లీకేజీ వ్యవహారంపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ చర్చకు పట్టుబట్టింది. అయితే ప్రభుత్వం చర్చకు ముందుకు రాకుండా టీడీపీ మంత్రులతో ఎదురుదాడికి దిగింది. దీంతో టెన్త్‌ పేపర్‌పై మాట్లాడేందుకు అవకాశం ఇ వ్వాలని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పీకర్‌ కోరినా అనుమతించలేదు. దీంతో ప్రతిపక్ష సభ్యులు స్పీకర్‌ పోడియం ఎదుట నిరసన తెలిపారు. లీకేజీపై సీబీఐ విచారణ చేపట్టాలని వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు డిమాండ్‌ చేశారు. దీంతో సభను స్పీకర్‌ పది నిమిషాలు వాయిదా వేశారు. అనంతరం మీడియా పాయింట్‌ వద్ద వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

    ఎమ్మెల్యే కంబాల జోగులు
    ప్రశ్నాపత్రం లీకేజ్‌ వల్ల కష్టపడిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. లీకేజీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోతే సామాన్య విద్యార్థులు నష్టపోతారు. అసెంబ్లీ నిర్వాహణ తీరు చాలా బాధాకరం. సభలో ప్రతిపక్ష నేతకు మాట్లాడేందుకు మైక్‌ ఇవ్వకపోవడం దుర్మార్గం.
    –––––––––––––
    ఎమ్మెల్యే కళావతి
    ఏపీ అసెంబ్లీ: అసెంబ్లీ హాల్‌లో మేం టెన్త్‌ లీకేజీపై చర్చించాలని మొన్న ఆందోళన చేస్తే స్పీకర్‌ ఈ నెల 30న ప్రకటన చేస్తారని చెప్పారు. మేం సభ నుంచి వాకౌట్‌ చేసిన తరువాత సీఎం స్టేట్‌మెంట్‌ ఇవ్వడం ఎంతవరకు సమంజసం. ఈ రోజు లీకేజ్‌పై మేం చర్చకు పట్టుబడితే కేవలం టీడీపీ సభ్యులతో మాట్లాడించి మాకు అవకాశం కల్పించలేదు. తెలంగాణలో సీసీ కెమెరాలతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏపీలో అలాంటి చర్యలు లేకపోవడంతో నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం పేపర్‌ లీకేజీకి పాల్పడుతోంది.
    ––––––––––––––––
    ఎమ్మెల్యే రాజన్నదొర
    ఈ ప్రభుత్వ విధానం అర్థం కావడం లేదు. లీకేజీపై మేం మాట్లాడతామంటే ప్రతిపక్ష నేతకు అవకాశం ఇవ్వలేదు. మేం సభ నుంచి బయటకు వచ్చిన తరువాత సీఎం స్టేట్‌మెంట్‌ ఇవ్వడం ఎంతవరకు న్యాయం. సభ జరుగకుండా చేసేది టీడీపీనే. గతంలో య్రరబెల్లి. మోత్కుపల్లి తదితరులు సభ జరుగకుండా ఎలా వ్యవహరించామో చూశాం. మేం అలా చేయడం లేదు. శాంతియుతంగా నిరసన తెలిపితే సభను వాయిదా వేస్తున్నారే తప్ప..మేం లేవనెత్తిన అంశాలపై చర్చకు ప్రభుత్వం వెనుకడుగు వేస్తోంది. మేం సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరుతున్నాం. దానికి సర్కార్‌ ముందుకు రావడం లేదు.
    –––––––––––––––––––
    కొరముట్ల శ్రీనివాసులు
    టెన్త్‌ పేపర్‌ లీకేజీ విషయం రాష్ట్రమంతటికి తెలిసిందే. హిందీ, ఇంగ్లీష్‌ పేపర్లు నాలుగు జిల్లాల్లో లీకేజీ అయ్యింది. వీటిపై విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని మేం కోరితే..సీఎం ఎందుకు మంత్రి నారాయణకు వెనుకేసుకొస్తున్నారో అర్థం కావడం లేదు. ప్రతిపక్ష నాయకుడు పదేపదే మైక్‌ అడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. లీకేజీ కారణంగా పేద, మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. టీడీపీ నేతలు గతంలో స్పీకర్‌ చైర్‌ను అవమానించేలా అసభ్యంగా వ్యవహరించారు. మేం శాంతియుతంగా ఆందోళన చేపడుతున్నా స్పీకర్‌ పట్టించుకోవడం లేదు.
    ––––––––––––––––––
    గిడ్డి ఈశ్వరి
    లీకేజీ జరిగిన రోజు నుంచి కూడా మేం సభలో ఆందోళన చేపడుతున్నాం. ప్రతిపక్ష నేతకు మాట్లాడేందుకు మైక్‌ ఇ వ్వడం లేదు. సభను ఏకపక్షంగా నిర్వహిస్తున్నారు అనడానికి ఇదే నిదర్శనం. లీకేజీపై 30న ప్రకటన ఇస్తామని చెప్పారు. మేం వాకౌట్‌ చేశాక సీఎం స్టేట్‌మెంట్‌ఇచ్చి చేతులు దులుపుకోవడం  దారుణం. వినాశకాలే విపరీత బుద్ధికి కారణం అనడానికి టీడీపీ నేతల తీరే నిదర్శనం.
    ––––––––––––––––––
    ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌
    టెన్త్‌ లీకేజీపై మేం చర్చకు పట్టుబట్టినా టీడీపీ నేతలు బిల్లులు పాస్‌ చేసుకునేందుకు ప్రయత్నించారు. మేం సభ నుంచి వెళ్లిపోయాక..ఇది లీకేజీ కాదు..మాల్‌ ప్రాక్టిస్‌ అని స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. మేం ఈ రోజు లీకేజీపై సీబీఐ విచారణకు పట్టుబడుతున్నాం. ఎందుకు ప్రభుత్వం వెనుకడుగు వేస్తోంది. అంటే అందులో మంత్రి ప్రమేయం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీరు తప్పు చేశారు కాబట్టే చర్చకు ముందుకు రాకపోవడం లేదు.


Back to Top