టీటీడీలో అరాచకాలపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలి

చంద్రబాబుకు దమ్ముంటే ఆయన సవాల్‌ను ఆయనే స్వీకరించాలి
రమణ దీక్షితుల ఆరోపణలకు సమాధానం చెప్పాలి
మత సంప్రదాయాల్లో జోక్యం చేసుకునే హక్కు ఎక్కడిది
నీరు –చెట్టు కార్యక్రమంలో వందల కోట్ల అవినీతి
అనేక కేసుల్లో స్టేలు తెచ్చుకున్న దొంగ బతుకు చంద్రబాబుది
నాలుగేళ్లు బీజేపీతో కలిసున్న చంద్రబాబును ఎక్కడ ఉరితీయాలి
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ

హైదరాబాద్‌: తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అరాచకాలపై సీబీఐ విచారణ జరగాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్‌ చేశారు. అవినీతి లేని పాలన నాది అని సవాల్‌ చేస్తున్న చంద్రబాబు.. తన సవాల్‌ను తానే స్వీకరించి వైయస్‌ఆర్‌ సీపీ చెబుతున్న 10 అంశాలతో పాటు టీటీడీ కమిటీపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకోవాలంటే  సాయంత్రంలోగా సీబీఐ ఎంక్వైరీ వేసుకోవాలన్నారు.  హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కలియుగ వైకుంఠం వెంకటేశ్వరస్వామివారి నగలను కూడా దోచేసే పాలన మీదని ప్రధాన అర్చకులు ఆరోపణలు చేస్తున్నారన్నారు. కృష్ణదేవరాయల కాలం నుంచి వస్తున్న విలువైన నగలకు సంబంధించిన లెక్క, జమ ఎక్కడా లేదని, అసలువి మాయమై.. నకిలీవి వచ్చాయనే ఆరోపలు ఉన్నాయన్నారు. కోట్లాది భక్తుల నమ్మకంతో ముడిపడిన దేవస్థానంలో ఏం జరుగుతుందో నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. 

మత సంప్రదాయాల్లో జోక్యం చేసుకునే హక్కు చంద్రబాబుకు ఎక్కడిదని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకొని మతాలపై పెత్తనం చేయడం.. చివరకు దేవుడిపై కూడా పెత్తం చేయాలనుకోవడం చంద్రబాబు అహంకారానికి పరాకాష్ట అన్నారు. 65 ఏళ్లకు అర్చకులు రిటైర్‌ కావాలనే కొత్త సంప్రదాయం తీసుకురావడం సిగ్గుచేటన్నారు. 

నాలుగేళ్ల టీడీపీ పాలనలో రూ. 4 లక్షల కోట్ల అవినీతి జరిగిందని, ఆ డబ్బుపై చంద్రబాబు, ఆయన కొడుకు కూర్చొని అవినీతిపై సవాల్‌ చేస్తున్నామని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. విచారణకు సిఫార్సు చేయకుండా.. నిజాయితీ నిరూపించుకోకుండా.. అవినీతిపై సవాల్‌ చేస్తున్నా అని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరిపై సవాల్‌ చేస్తున్నారు.. సవాల్‌ చేసే పద్ధతి ఇదేనా అని ప్రశ్నించారు. చంద్రబాబు సవాల్‌ను వైయస్‌ఆర్‌ సీపీ స్వాగతిస్తుందని, అవినీతిపై విచారణకు ఆదేశించాలని సూచించారు. 

నీరు– చెట్టు కార్యక్రమం ద్వారా చంద్రబాబు తన అవినీతిని వరదలా పారించారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో నీరు–చెట్టు అనే కార్యక్రమం వేదికగా అవినీతి గురించి మాట్లాడడం శోచనీయమన్నారు. పచ్చచొక్కా కార్యకర్తలకు మేత వేయడం కోసం ఉపాధి హామీ పనుల నిధులు కూడా నీరు–చెట్టుకు మళ్లించి నామినేషన్‌ పద్ధతుల్లో పనులు అప్పగించారన్నారు. తాజాగా రూ. 13 వందల కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. రాష్ట్రాన్ని నిలువునా దోచుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం తొందరగా పోవాలని ప్రజలంతా దేవుడిని కోరుకుంటున్నారన్నారు. టీడీపీని మళ్లీ గెలిపించడం చరిత్రాత్మక అవసరం కాదని, టీడీపీని భూస్థాపితం చేయడమే చారిత్రక అవసరం అని ప్రతీ పౌరుడు భావిస్తున్నాడన్నారు. 

అనేక కేసుల్లో ముద్దాయిగా ఉండి స్టేలు తెచ్చుకొని దొంగ బతుకు బతుకుతున్న చంద్రబాబు కోర్టుకు వెళ్లే వారు నన్ను విమర్శించకూడదని మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఓటుకు కోట్ల కేసులో నంబర్‌ వన్‌ ముద్దాయి. చంద్రబాబుపై ఉన్న కేసుల్లో ఒక్కటి విచారణకు వచ్చినా జీవితాంతం జైల్లో ఉంటాడన్నారు. చంద్రబాబుతో సంబంధం ఉన్నవారు ఒక్కరైనా  ఆయనను విమర్శించకుండా ఉన్నారా అని ప్రశ్నించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు చంద్రబాబును తిట్టినన్ని తిట్టు ఇంకెవరినీ తిట్టలేదన్నారు. చంద్రబాబు తోడల్లుడు, అత్త లక్ష్మీపార్వతి, తమ్ముడు రాంమ్మూర్తి నాయుడు, బావమరిది హరికృష్ణ తిట్టిన తిట్లకు సమాధానం చెప్పావా చంద్రబాబూ అని నిలదీశారు. చంద్రబాబును ఆయన నీడ కూడా తిట్టే బతుకు అన్నారు. 

బీజేపీకి సహకరించడం దేశ ద్రోహం అని మాట్లాడిన చంద్రబాబుకు ఏ శిక్ష వేయాలో ఆయనే నిర్ణయించుకోవాలని వాసిరెడ్డి పద్మ అన్నారు. బీజేపీతో నాలుగేళ్లు కలిసి ఉన్న చంద్రబాబుకు దేశ ద్రోహం కింద ఎక్కడ ఉరికంబం ఎక్కించాలో చెప్పాలన్నారు. చంద్రబాబుకు అవకాశం ఇస్తే పీఠాధిపతుల స్థానంలో దేవినేని ఉమా, బోండా ఉమా, చింతమనేని, అచ్చెనాయుడుని పెట్టే ఘనుడన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై వస్తున్న ఆరోపణలపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మైసూరు మహారాజు ఇచ్చిన నగలో ఒక డైమండ్‌ కనిపించడం లేదని రమణ దీక్షితులు అడుగుతున్నారని, దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. స్వామివారి విలువైన నగలకే భద్రత కరువైతే దేనికి మీరు భద్రత ఇస్తున్నట్లు..చంద్రబాబూ. భక్తులు వేసిన నాణెలకు నగలోని డైమండ్‌ పగిలిపోయిందట. అదే డైమండ్‌ జెనివాలో వేలంకు వచ్చిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేవుడిని సైతం వ్యాపారాలకు, రాజకీయానికి ఉపయోగించుకోవడం చంద్రబాబు నైజం కావట్టే ఇన్ని ఆరోపణలు వస్తున్నాయన్నారు. ప్రతీ విషయంపై సమగ్ర విచారణ అడుగుతున్నాం.. పది అంశాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం మీద వెంటనే సీబీఐ ఎంక్వైరీ ఆదేశించి వెంటనే చంద్రబాబు సవాల్‌ను ఆయనే స్వీకరించాలన్నారు.  
 
Back to Top