జూన్ 2న బాబుపై చీటింగ్ కేసులు..?

పంచభూతాలను దోచేస్తున్నారు
ఆఖరికి దేవుడి మాన్యాలను స్వాహా చేస్తున్నారు
కబ్జా కుమారులందరికీ బాబు కుమారుడే రింగ్ మాస్టర్
లోకేష్ కనుసన్నల్లో వేలకోట్ల ఆస్తుల దోపిడీ
ఆత్మస్తుతి, పరనింద తగ్గించుకో బాబు
టీడీపీ సర్కార్ పై ధ్వజమెత్తిన బొత్స సత్యనారాయణ

హైదరాబాద్ః మహానాడులో చంద్రబాబు తీరు చూస్తుంటే ఆత్మస్తుతి, పరనింద తప్ప మరొకటి కనిపించ లేదని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఎన్నికల సమయంలో వందలాది వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు..అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్కహామీని నెరవేర్చకపోగా, అన్నీ చేశానని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఏమీ చేయకుండానే అన్నీ చేశానని చెబుతూ నయవంచన చేస్తున్న టీడీపీ ముఖ్యమంత్రి, ఆ పార్టీపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ...జూన్ 2న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేయాలని నిర్ణయించామన్నారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిలతో కలిసి బొత్స సత్యనారాయణ మాట్లాడారు.  

మహానాడులో ప్రతిపక్ష నాయకుడిపై దాడి చేయడమే ప్రధానాంశంగా పెట్టుకోవడం సిగ్గుచేటని టీడీపీపై ధ్వజమెత్తారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం...ఆయన ఇచ్చిన లేఖల కారణంగానే రాష్ట్ర విభజన జరిగిందని బొత్స చెప్పారు. చంద్రబాబు ఆయన తాబేదారులు రాష్ట్రంలో పంచభూతాలను దోచేస్తున్నారని బొత్స నిప్పులు చెరిగారు. ఇసుక నుంచి మట్టి వరకు కనిపించినదాన్నల్లా దోచుకుతింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి పాలనపై ప్రజలు ఆలోచన చేయాలని బొత్స సూచించారు. 

రాష్ట్రంలో రూపాయి లంచం లేకుండా ఎక్కడైనా పనిజరుగుతుందా అని బొత్స ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మీరు మీ మంత్రులు అమరావతి ముసుగులో పేద రైతుల భూములు దోపిడీ చేశారు. దీనిపై విచారణ జరిపించమంటే తమపై ఎదురుదాడి చేస్తున్నారు. ఆఖరికి దేవుడిని కూడా వదిలిపెట్టడం లేదు. పాపాలు చేసిన వాళ్లే గుడికి వెళతారా చంద్రబాబు..?. మీరు పాపాలు చేశారనే బొట్టుపెట్టుకున్నారా..? ఏమిటీ ఈ మాటలు..? సాక్షాత్తు దేవుడి మాన్యాలను కూడా దోచుకుంటున్నారు. అమరావతి అమరేశ్వరుడి భూములు లోకేష్ స్వాహా చేశారని బొత్స తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భూముల కొనుగోళ్లపై తక్షణమే విచారణ జరపించాలని బొత్స డిమాండ్ చేశారు. భూముల క్రయ, విక్రయాల ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలన్నారు.

 లోకేశ్ కనుసన్నల్లోనే వెయ్యికోట్ల దోపిడీ జరిగిందని బొత్స అన్నారు. తమిళనాడులోని అమరేశ్వరుని ఆస్తులు ఎకరం ఆరుకోట్లు(వాస్తవంగా రూ.10 కోట్లు) ఉండగా ...కేవలం 25 లక్షలకు అమ్మారు. ఎంత విడ్డూరమంటే... రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న తెలుగుదేశం వ్యక్తి లెటర్ రాస్తే, దాన్ని ఆక్షన్ వేయమని ప్రభుత్వం ఆతృతగా ధర్మాదయ, దేవాదయ శాఖకు రికమెండ్ చేసింది. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన రామాంజనేయులు కుమారుడి పేరుపై ఎకరాకు రూ. 27 లక్షల చొప్పున ధారాదత్తం చేశారు. ఈ కుమారులు చేస్తున్న కార్యక్రమానికి చంద్రబాబు కుమారుడు లోకేష్ రింగ్ లీడర్ గా ఉన్నారు.  కబ్జాదారుల కుమారులందరికీ లోకేష్ టీం లీడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈరకంగా ప్రభుత్వ భూములను దోచేయడం ఎంతవరకు న్యాయం. దేవాదయ శాఖకు ఆదాయం తేవాలనుకుంటే ..ఆ ఆస్తులను బహిరంగ వేలం పెట్టాలని బొత్స ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

సుమారు వేయి కోట్ల రూపాయలున్న ఆస్తిని ఎకరా రూ. 25, 27  లక్షలకు ఇస్తుంటే... దేవుడు క్షమిస్తాడా బాబు మిమ్మల్ని. ఓ పక్క రాష్ట్రాన్ని లూటీ చేస్తూనే అవినీతి రహిత పాలన అందిస్తున్నామంటూ ... బాబు తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా  అబద్ధాలు ఆడుతున్నారని బొత్స ఫైరయ్యారు. పట్టిసీమ, అమరావతి, అమరేశ్వరుడి భూములు ఇలా అన్నింటినీ దోచుకుతింటున్నారు. ఇది వాస్తవం కాదా బాబు...?  అందులో ఏ ఒక్కటీ అబద్ధమని చెప్పినా ....ఎంక్వైరీ వేసి  విచారణ జరిపించాలని సవాల్ చేశారు. 

టక్కుటమార విద్యలతో అధికారంలోకి వచ్చిన నీవు ఇలాగేనా బాబు పాలన చేసేది. నీతివంతుడినని చెప్పుకోవడం కాదని...సీబీఐ ఎంక్వైరీ జరిపించి నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. బాబు ప్రోద్భలంతోనే వంగవీటి రంగా హత్య గావించబడ్డాడని గతంలో మీ కేబినెట్ లో పనిచేసిన హరిరామయ్య జోగయ్య పుస్తకం రాశారు.  మీరు ఆపని చేయనప్పుడు ...దానిపై చర్య తీసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదని బాబును నిలదీశారు. ఓ పక్క కరవు, తాగునీటి ఎధ్దడి సహా అనేక సమస్యలతో ప్రజలు అల్లాడుతుంటే...వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుతినేసి మహానాడులో విందు ఆరగించేందుకు సిగ్గేయడం లేదా అంటూ బాబుపై విరుచుకుపడ్డారు. 

ఎంతసేపు హరిరామ జపంలాగా బాబు వైయస్ జగన్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని బొత్స ఎద్దేవా చేశారు. ఓ స్వామీజి ఏదో స్టేట్ మెంట్ చేస్తే దాన్ని కూడా వైయస్ జగన్ కుట్రతోనే జరిగిందంటూ బాబు మాట్లాడడం నీచమన్నారు. కుట్రలు, కుతంత్రాలు, కుళ్లు రాజకీయాలతో   బాబు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశాడని నిప్పులు చెరిగారు. స్వార్థ ప్రయోజనాల కోసం  రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే గాకుండా..ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నిస్సిగ్గుగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు కండువాలు కప్పడం దుర్మార్గమన్నారు.  ఇప్పటికైనా ఆత్మస్తుతి, పరనింద తగ్గించుకొని ప్రజాపరిపాలన మీద దృష్టి పెట్టాలని బాబుకు బొత్స సత్యనారాయణ హితవు పలికారు. 
Back to Top