టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

  • శృతిమించిన టీడీపీ ఎమ్మెల్యే అరాచకాలు
  • జర్నలిస్టులపై దాడి ఘటనలో చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు
  • గతంలోనూ అధికారులపై చింతమనేని దౌర్జన్యం
  • ఇసుకమాఫియాకు అడ్డొస్తుందని మహిళా ఎమ్మార్వోపై దాడి
  • ప్రభాకర్ తీరుపై మండిపడుతున్న అధికారులు, జర్నలిస్టులు, ప్రజాసంఘాలు,ప్రతిపక్షాలు
 ఏలూరు:  దెందులూరు టీడీపీ ఎమ్మెలే చింతమనేని ప్రభాకర్‌ అరాచకాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. జర్నలిస్టులపై దాడి చేసిన ఘటనలో చింతమనేనిపై కేసు నమోదైంది. జర్నలిస్టుల ఫిర్యాదుమేరకు టీడీపీ నేత చింతమనేనితో పాటు మరో ఇద్దరిపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఐసీసీ 323, 394, 406, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదయింది. జర్నలిస్టులపై చింతమనేని దాడి చేయడాన్ని ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఏపీ జర్నలిస్ట్ ఫోరం, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఖండించారు. చింతమనేని అరెస్ట్ చేయాలని కోరుతూ దశలవారిగా ఉద్యమం చేపట్టాలని జర్నలిస్టులు నిర్ణయించారు. రిపోర్టర్‌పై దాడిని వ్యతిరేకిస్తూ గురువారం ఆందోళన చేసిన జర్నలిస్టులు శుక్రవారం ఏలూరు త్రీటౌన్ పీఎస్ ఎదుట ధర్నా చేపట్టారు.

గత బుధవారం వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తుండగా అక్కడికి వచ్చిన చింతమనేని వారిపై చిందులు తొక్కారు. మిమ్మల్ని విధుల నుంచి తొలగిస్తానంటూ హెచ్చరిస్తుండగా  అక్కడే ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా విలేకరి, ఏపీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్‌ మీడియా విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కడవకొల్లు సాగర్‌ ఈ తతంగాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండటంతో చింతమనేని జర్నలిస్టులపై దాడికి దిగారు. 

గతంలోనూ కృష్ణాజిల్లా ముసునూరు తహసీల్దార్‌ వనజాక్షిపై దౌర్జన్యం.. ఆటపాక పక్షుల కేంద్రం వద్ద అటవీ శాఖ అధికారిపై దాడి.. ఐసీడీఎస్‌ అధికారులకు బెదిరింపులు.. ఏలూరు టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌పై దాడికెళ్లినంత పనిచేసి నిందితులను బయటకు తీసుకువెళ్లిపోవడం.. పోలీస్‌ కానిస్టేబుల్‌ను చితక్కొట్టడం..అంగన్ వాడీలను అసభ్యపదజాలంతో దూషించడం... ఇలా ఎన్నో పర్యాయాలు చింతనేని దాడులకు పాల్పడ్డారని జర్నలిస్టులు మండిపడుతున్నారు.

తాజా వీడియోలు

Back to Top