నయీం దుర్మార్గాలకు కేరాఫ్ అడ్రస్ టీడీపీనే

నయీం ఎన్ కౌంటర్ పై బాబు ఎందుకు నోరుమెదపడం లేదు
విచారణ జరిపించాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వానికి లేదా
మంత్రి అచ్చెన్నాయుడు నయీంతో చేతులు కలిపారు
సీబీఐతో విచారణ జరిపిస్తే అన్నీ బయటకొస్తాయి
సినీ నిర్మాత నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో గ్యాంగ్‌స్టర్ నయీమ్‌ను పెంచి పోషించింది తెలుగుదేశం ప్రభుత్వమేననీ, అతడి దుర్మార్గాలకు పలువురు టీడీపీ నాయకులు అండగా నిలిచారని సినీ నిర్మాత నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడుకి నయీమ్ గ్యాంగ్‌తో సత్సం బంధాలున్నాయన్నారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలోని ఓ పవర్‌ప్లాంట్‌కు సంబంధించి నయీమ్‌తో అచ్చెన్నాయుడు చేతులు కలిపారన్నారు. కావాలంటే సీబీఐతో దర్యాప్తు చేయిస్తే.. నిజానిజాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.

నయీం ఎన్ కౌంటర్ పై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని నట్టికుమార్ నిలదీశారు. నయీం కేసుపై బాబు ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర, ఒరిస్సా దాకా నయీం దందాలు కొనసాగించారని, నయీంతో టీడీపీ నేతలు సంబంధాలు కొనసాగించారని చెప్పారు. నయీం ఎన్ కౌంటర్ మీద విచారణ జరిపించాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వానికి లేదా ..?ఏపీ సీఎం ఎందుకు పట్టించుకోవడం లేదని కడిగిపారేశారు. 

ఓ స్థలం వివాదంలో రెండు నెలల క్రితం నయీమ్ గ్యాంగ్ తనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని, నా మిత్రుడితోపాటు ఓ ఎమ్మెల్యే ద్వారా సమాచారం అందడంతో అలర్ట్ అయ్యాను అని చెప్పారు.  ఓ రోజు ఫ్లైట్‌లో కలిసిన అచ్చెన్నాయుడితో ఈ ఇదే విషయం చెబితే, నయీమ్‌తోనే సెటిల్ చేసుకోవాలని చెప్పారన్నారు. నయీమ్ అండతో ఉత్తరాంధ్రలో అచ్చెన్నాయుడు ప్రత్యేక పాలన కొనసాగించారని నట్టికుమార్ స్పష్టం చేశారు. 

అవినీతి, అక్రమాలే ధ్యేయంగా అధికార టీడీపీ నేతలు రెండేళ్లుగా రాష్ట్రంలో సృష్టిస్తున్న అరాచకాల వెనుక అసలు రంగు వెలుగుచూస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నయీం అనుచరగణంతో టీడీపీ నేతలు చేతులు కలిపి ఈదందాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. నయీం అండతో  దోపిడీలు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నట్లు సర్వత్రా వినిపిస్తోంది. నట్టికుమార్ వ్యాఖ్యలతో ఇది మరింత తేటతెల్లం అయ్యింది. సిట్‌పై తనకు నమ్మకం ఉందని చెప్పిన నట్టికుమార్..... నయీమ్ ఆగడాలపై ఏపీ ముఖ్యమంత్రి నిజాయితీగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 


Back to Top